calender_icon.png 6 November, 2024 | 8:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌కు 14 కష్టమే!

15-05-2024 01:40:11 AM

ఒకటి, రెండు స్థానాలు తగ్గే అవకాశం

అభ్యర్థుల ఎంపికలో లోపాలే కారణం

పీసీసీ వర్గాల ప్రాథమిక అంచనా

సర్వే సంస్థల నుంచి ఫీడ్‌బ్యాక్ తెప్పించుకున్న నేతలు

హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమరం ముగిసింది. మెజార్టీ నియోజకవర్గాల్లో గతం కంటే పోలింగ్ శాతం పెరిగింది.  జూన్ 4న ఫలితాలు రానున్నాయి. అయితే ఏ నియోజకవర్గంలో ఏ పార్టీకి మెజార్టీ వస్తుంది? గెలుపు అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? పెరిగిన ఓటింగ్ శాతం ఎటు వైపు మళ్లింది? ఏ సామాజిక వర్గం ఎవరికి ఓటు వేసింది? అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓటు బ్యాంకు పార్లమెంట్ వరకు పదిలంగానే ఉందా? అనే అంశాలపై అధికార కాంగ్రెస్ పార్టీ కూడికలు, తీసివేతలతో కుస్తీ పడుతోంది.

పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, మంత్రులు, నేతలు నియోజకవర్గాల వారీగా పోలింగ్ సరళిపై వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు. అంతేకాకుండా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కనీసం 14 నియోజకవర్గాల్లో జెండా ఎగరవేయాలని పట్టుదలతో కాంగ్రెస్ నేతలు ఎన్నికల  ప్రచారం జోరుగా నిర్వహించారు. అంతేకాకుండా మంత్రులు, కొందరు సీనియర్లకు కూడా రేవంత్‌రెడ్డి ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించారు. పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలనే టాస్క్‌తో ఇన్‌చార్జీలు కూడా గట్టిగానే పనిచేశారు. 

బీఆర్‌ఎస్, బీజేపీకి దీటుగా..

రాష్ట్రంలో పోలింగ్ సరళిని బట్టి కాంగ్రెస్ పార్టీకి డబుల్ డిజిట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని పీసీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎక్కువ స్థానాల్లో బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొనట్లుగా చెబుతున్నాయి. ప్రధానంగా రామమందిరం, అక్షింతలు తదితర అంశాలు క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ దీటుగా అడ్డుకోగలిగినట్లు పీసీసీ భావిస్తోంది. బీజేపీకి ఓట్లు వేస్తే రాజ్యాంగాన్ని సవరించి ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తుందని రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. 

బీజేపీ కూడా తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా రాష్ట్రంలో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ హయాంలో అన్ని కుంభకోణాలు, అవినీతి అక్రమాలు జరిగాయని బీజేపీ కూడా బలంగానే ఆరోపణలు చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా దీటుగానే స్పందించింది. కాగా, రాష్ట్ర విభజన తర్వాత జరిగిన అన్ని ఎన్నికలు ఒక ఎత్తు. ఇప్పడు జరిగిన పార్లమెంట్ ఎన్నికలు మరొక ఎత్తుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అధికారం కోల్పోవడం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అంతేకాక గులాబీ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలును కాంగ్రెస్‌లోకి వచ్చారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో అవినీతి అక్రమాలు భారీగా జరిగాయని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా అస్తవ్యస్థం చేసిందని కాంగ్రెస్ జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లింది. దీంతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఐదు గ్యారెంటీలను అమలు చేశామని, రూ.2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15లోగా అమలు చేస్తామని చెప్పడం కాంగ్రెస్‌కు కలిసొచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే విధంగా ఉద్యోగాల భార్తీకి చర్యలు చేపట్టడం, ఒకటో తేదీన వేతనాలు ఇవ్వటం వంటి చర్యల ద్వారా బీఆర్‌ఎస్‌పై కొంత ఆదరణ తగ్గిందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.  

14 స్థానాల్లో కష్టమే..!

రేవంత్‌రెడ్డి అన్నీ తానై ఎన్నికల ప్రచారాన్ని ముందుకుతీసుకెళ్లారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌కు దీటుగా ప్రచారం చేపట్టారు. ఏప్రిల్ 6న రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో సభ ద్వారా మొదలుపెట్టిన ఎన్నికల ప్రచారం.. ఈ నెల 11వ తేదీ వరకు నిర్విరామంగా కొనసాగింది. మంత్రులు, ఎమ్మె ల్యేలు, కోఆర్డినేటర్లు  వారికి కేటాయించిన నియోజకవర్గాల్లోనే తిష్టవేశారు. సన్నాహక సమావేశాలతో పాటు ప్రతి నియోజకవర్గంలో ఒకటి, రెండు బహిరంగ సభలను నిర్వహించారు. అయితే రాష్ట్రంలో పోలింగ్ సరళిని బట్టి చూస్తే తాజా రాజకీయ పరిస్థితుల్లో ముందునుంచి అనుకున్నట్లుగా 14 పార్లమెంట్ స్థానాలు రావడం అంత ఈజీ కాదని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. టికెట్ల కేటాయింపులో తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల రెండు, మూడు సీట్లను చేజార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనే భావన కొందరిలో వ్యక్తమవుతోంది.