calender_icon.png 19 January, 2025 | 2:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒకే సమస్యపై భిన్న స్వరాలు!

21-09-2024 01:30:00 AM

* సినీ పరిశ్రమ.. ఓ పెద్ద సామ్రాజ్యం. పరిశ్రమలో ఎదిగితే.. అందనంత ఆకాశంలోకి.. ఓడితే.. అథఃపాతాళానికి చేరుకోవాల్సిందే. ఇండస్ట్రీ ఏదైనా.. మహిళలు ఎదుర్కొంటున్న సమస్య మాత్రం ఒక్కటే. అదే లైంగిక వేధింపులు. మొన్నటి వరకు మాలీవుడ్‌లో.. ఇవాళ టాలీవుడ్‌లో దీనికి సంబంధించిన చర్చ పెద్ద ఎత్తున నడుస్తున్నది.

* సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు సర్వసాధారణమే అని కొందరంటే.. దీన్ని సీరియస్ అంశంగా పరిగణించాలని మరికొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలో పరిశ్రమలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. దానికి సంబంధించిన ప్రత్యేక కథనం.. 

బాధితురాలినే నిందితురాలిగా చూసే ఈ పురుషాధిక్య సమాజంలో నాపై లైంగిక వేధింపులు జరిగాయని ఏ మహిళైనా గళం విప్పితే.. అనేక ప్రశ్నలు చూట్టుముడతాయి. ఇవాళ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారంలో బాధితురాలిగా ఉన్న అమ్మాయి విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. ఒకవైపు బాధితురాలి తరపున మహిళా సంఘాలు.. హక్కుల సంఘాలు.. అండగా నిలబడుతుంటే.. మరోవైపు మహిళా కొరియోగ్రాఫర్ల నుంచి భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లైంగిక వేధింపులపై ఎటువంటి స్పృహను కలిగి ఉండాలి అనే ది చర్చించాల్సిన అవసరం ఉన్నది.

మళయాళ చిత్ర పరిశ్రమలో  ఏం జరిగిందో చూశాం. ఆ దెబ్బకు తమిళ చిత్ర పరిశ్రమ ఏం చేసిందో కూడా చూశాం. ఇప్పుడు టాలీవుడ్‌లో అలాంటి అలర్ట్ బెల్స్ మోగుతున్నాయి. ఓ మహిళా కొరియోగ్రాఫర్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడు అని పోలీస్ కేసు పెట్టింది. దీంతో జానీ మాస్టర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. 

బాధితురాలి గురించి..

జానీ మాస్టర్ కేసులో బాధితురాలిది మధ్యప్రదేశ్. ఆమె 2017లో ఓ డ్యాన్స్ షోలో పాల్గొంది. ఆ షోకు జడ్జ్‌గా జానీ మాస్టర్ ఉన్నారు. ఆ కార్యక్రమంలో బాధితురాలి పెర్‌ఫార్మెన్స్ ఆయనకు నచ్చింది. తన దగ్గర డ్యాన్స్ అసిస్టెంట్‌గా ఛాన్స్ ఇస్తానన్నాడు. చెప్పినట్టుగానే ఆయన ఛాన్స్ ఇచ్చాడు. 2019లో జానీ తనకు కాల్ చేశాడని.. తన టీమ్‌లోకి ఆహ్వానించాడని చెప్పింది. 

ఏఫ్‌ఐఆర్‌లో ఏముంది? 

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు పెట్టిన యువతి ఎఫ్‌ఐఆర్‌లో కీలక విషయాలు వెల్లడించింది. 2017లో ‘ఢీ’ షోలో జానీ మాస్టర్ తనకు పరిచయమైనట్లు తెలిపింది. ఆ తర్వాత జానీ మాస్టర్ టీం నుంచి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా ఉండాలంటూ తనకు ఫోన్ కాల్ రావడంతో 2019లో జానీ మాస్టర్ టీంలో జాయిన్ అయినట్లు బాధిత యువతి పేర్కొంది. ఓ షో కోసం జానీ మాస్టర్‌తో పాటు మరో ఇద్దరితో కలిసి తాను ముంబైకి వెళ్లానని, ఆ సమయంలో ముంబైలోని హోటల్ లో తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని యువతి ఎఫ్‌ఐఆర్ కాపీలో చెప్పుకొచ్చింది.

ఈ విషయాన్ని బయట ఎవరికీ చెప్పవద్దని జానీ మాస్టర్ బెదిరించినట్లు వాపోయింది. షూటింగ్ సమయంలో చెప్పినట్లు వినకపోతే అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనపై పలుమార్లు జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడని ఎఫ్‌ఐఆర్‌లో యువతి ఫిర్యాదు చేసింది. దీంతో మాస్టర్‌పై అత్యాచారం కేసు నమోదు చేశారు. 

లవ్ జిహాదీ కేసుగా పరిగణించాలి.. 

ఇది ముమ్మాటికీ లవ్ జిహాదీ కేసు. ఇలాంటి ఘటనలు రోజురోజుకీ పెరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం దారుణం. ఈ ఘటనను లవ్ జిహాదీ కేసుగా పరిగణించాలని, బాధితురాలికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. అంతేగాక బాధితురాలికి న్యాయం జరిగే వరకు బీజేపీ మహిళా మోర్చా అండగా ఉంటుంది.

బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి

బాధితులకు భరోసా..

మొదట మీడియా వారి నుంచే జానీ మాస్టర్ వివాదం మా వద్దకు వచ్చింది. ఇండస్ట్రీలో ఇబ్బందులు పడేవారి కోసం 2013లో అసరా అని పెట్టి.. 2018లో దాని స్థానంలో తెలుగు ఫిలిం చాంబర్ అఫ్ కామర్స్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ ఏర్పాటు చేసిందని, అయితే ఇండస్ట్రీలో ఒక మహిళకు ధైర్యం ఇవ్వలేకపోతున్నామన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలోని ప్రతి అమ్మాయికి ఆపద వస్తే తమకు సపోర్ట్ ఉందనే భరోసా కల్పించాలని, అందుకు తగ్గ కమిటీ నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. 

 దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ

ప్రతిదీ నిజం కాదు!

‘మీరు విన్న ప్రతిదీ నిజమని నమ్మకండి. ప్రతి కథలోనూ మూడు వెర్షన్‌లు ఉంటాయి. మీ వైపు, నావైపు, నిజం’. ‘న్యాయ స్థానంలో నేరం రుజువయ్యే వరకు ఏ వ్యక్తిని నేరానికి పాల్పడినట్లుగా పరిగణించలేరు’ అని ట్వీట్స్ చేశారు. 

- ప్రముఖ నటుడు నాగబాబు

బాధితురాలికి అండగా..

జరుగుతున్న విషయాలపై మహిళలకు సానుభూతి అవసరం లేదు. అన్యాయ్యాన్ని ప్రశ్నించేతత్వం ఉండాలి. మీకే కాదు తెలిసినవాళ్లకు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే వెంటనే బయటపెట్టండి. మీకు అందరూ అండగా ఉంటారు. నేను పనిచేసే చోట మహిళలకు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే వెంటనే స్పందిస్తాను. ఈ వ్యవహారంలో కూడా బాధితురాలికి న్యాయం జరుగుతుందని భావిస్తున్నా.

 యాంకర్ అనసూయ

కష్టపడే వాళ్లను ఇలా ఇరికిస్తారా? 

ఈ రోజుల్లో చాలామంది ఓవర్ స్మార్ట్ అవుతున్నారు. అబ్బాయిలు ఎవరైనా అమ్మాయిల్ని ఏడిపిస్తే, వాళ్లతో తప్పుగా ప్రవర్తిస్తే కచ్చితంగా శిక్షించాలని.. చట్టం దృష్టిలో అందరూ సమానమే. ఎంత పెద్దవాళ్లను అయినా సరే వదలకూడదన్నారు. కానీ కొన్ని చట్టాలని ఉపయోగించుకొని కొంతమంది అమ్మాయిలు ఓవర్ స్మార్ట్‌గా ప్రవర్తిస్తున్నారు. లైఫ్‌లో చాలా కష్టపడి ఎదిగిన అబ్బాయిల కెరీర్‌ని దెబ్బ కొట్టడానికి కొంతమంది అమ్మాయిలు చూస్తున్నారని.. వాళ్లను కూడా కఠినంగా శిక్షించాలన్నారు. ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు మనం రెండువైపులా వినే మాట్లాడాలని చెప్పారు.

డ్యాన్సర్ జ్యోతీరాజ్ 

మాస్టర్ అని పిలవొద్దు.. 

ఇకపై జానీ మాస్టర్‌ను ఎవరూ మాస్టర్ అని పిలవొద్దంటూ తన ట్విట్టర్ వేదికగా కుండబద్దలు కొట్టారు. అంతేకాదు మాస్టర్ అనే పదానికి కాస్త గౌరవం, విలువ ఇవ్వాలని.. అందరికీ విజ్ఞప్తి చేశారు. 

 నటి పూనమ్ కౌర్