హస్తం నేతల మధ్య విభేదాలు
త్వరలో స్వచ్ఛమైన హిమాయత్ సాగర్ నీళ్లు అందిస్తామని మేయర్ వెల్లడి
నిరంతరం పనుల పర్యవేక్షణ
'సేవ్ బండ్లగూడ' అంటూ వీడియో పోస్టు చేసిన కార్పొరేటర్ సాగర్ గౌడ్
హిమాయత్ సాగర్ లో శంషాబాద్ మురుగు కలుస్తుందని ఆరోపణ
తప్పుడు ఆరోపణలు నమ్మొద్దని మేయర్ లతా ప్రేమ్ గౌడ్ విజ్ఞప్తి
రాజేంద్రనగర్,(విజయక్రాంతి): బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో 'హస్తం' నేతల మధ్య విభేదాలు మరోమారు భగ్గుమన్నాయి. ఇరు వర్గాల మధ్య ప్రస్తుతం 'వాటర్ వార్' కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మేయర్, ఎమ్మెల్యే వర్గాల మధ్య పొ రపొచ్చాలు సద్దుమణిగేలా ఏమాత్రం కనిపించడం లేదు. రెండు వర్గాల మధ్య పోసగడం లేదనే విమర్శలు కొనసాగడం గమనార్హం. గతంలో రెండు వర్గాలకు చెందిన నేతలు తీవ్ర స్థాయిలో గొడవ పడిన విషయం తెలిసిందే. అప్పట్లో పంచాయితీ పోలీస్ స్టేషన్ వరకు కూడా చేరుకుంది. మరోమారు కాంగ్రెస్ నేతల మధ్య కోల్డ్ వార్ రాజుకుంది.
ఇరువర్గాల మధ్య నీళ్ల పంచాయితీ
బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు త్వరలో స్వచ్ఛమైన నీటిని హిమాయత్ సాగర్ నుంచి అందిస్తామని మేయర్ లతా ప్రేమ్ గౌడ్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా మేయర్ పలుమార్లు ఫిల్టర్ బెడ్ లను పరిశీలించారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు కట్టుబడి ఉన్నామని, నిరంతరం అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.
సే నో టు హిమాయత్ సాగర్ వాటర్
ఇదిలా ఉండగా, సేవ్ బండ్లగూడ జాగిర్ అంటూ కార్పొరేటర్ సాగర్ గౌడ్ ఓ వీడియో సోషల్ మీడియాలో విడుదల చేశారు. హిమాయత్ సాగర్ లో శంషాబాద్ నుంచి మురుగునీరు కలుస్తుందని, ఈ నేపథ్యంలో 'సే నో టు హిమాయత్ సాగర్ వాటర్' అని ఆయన పేర్కొన్నారు. హిమాయత్ సాగర్ లో మురుగునీరు కలుస్తుందని ఆయన ఆరోపించారు.
తప్పుడు ఆరోపణలు నమ్మొద్దు
కొందరు హిమాయత్ సాగర్ నీటిపై చేస్తున్న తప్పుడు ఆరోపణలు ఏ మాత్రం నమ్మొద్దని మేయర్ లతా ప్రేమ్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. తాము హిమాయత్ సాగర్ నుంచి స్వచ్ఛమైన నీటిని అందించేందుకు శాయశక్తుల పనిచేస్తున్నామన్నారు. ఫిల్టర్ బెడ్ల ద్వారా వడపోత తర్వాత బ్లూ పరీక్షించిన తర్వాతనే ప్రజలకు మంచినీటిని సరఫరా చేస్తామని భరోసా ఇచ్చారు. ఇలా ఒకే పార్టీకి చెందిన నేతలు విభిన్నంగా నడుచుకోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అయోమయానికి గురవుతున్నారు.