calender_icon.png 9 November, 2024 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చనిపోతేకానీ స్పందించరా?

09-11-2024 12:00:00 AM

  1. నిర్మల్‌లో ఇష్టారాజ్యంగా హోటళ్ల నిర్వహణ 
  2. కస్టమర్లకు కల్తీ ఆహారం సరఫరా
  3. పట్టించుకోని ఫుడ్ సేఫ్టీ అధికారులు

నిర్మల్, నవంబర్ ౮ (విజయక్రాంతి): నిర్మల్‌లో ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్న హోటళ్లలో కల్తీ ఆహారం ప్రజల ప్రాణాలు తీస్తోంది. లాభార్జనే లక్ష్యంగా వ్యాపారులు కల్తీ ఆహారం సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

హోటల్ నిర్వాహకులు ఇచ్చే మామూళ్ల అలవాటు పడిన ఫుడ్‌సేఫ్టీ అధికారులు నామమాత్రపు తనఖీలు నిర్వహించి వదిలేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నిర్మల్, భైంసా, ముథోల్, బాసర, ఖానాపూర్ పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఫాస్టుఫుడ్ సెంటర్‌లు, దాబాలు, ఫ్యామీలీ రెస్టారెంట్లు, హోటళ్లు, కర్రీపాయింట్‌లు, కచోరి బండీలు, టిఫిన్ సెంటర్లు ఉన్నాయి. ఏదైనా ఫిర్యాదు వస్తే తప్ప అధికారులు తనిఖీలు చేయడం లేదు. 

నాణ్యతలేని మాంసంతో ఆహారం 

లాభార్జనే లక్ష్యంగా కొందరు హోటల్ నిర్వాహకులు ఆహారం తయారీలో కల్తీ వస్తువులు వినియోగిస్తున్నారు. నాణ్యత లేని చికెన్, మటన్, కోడిగుడ్లు, చేపలు కొని ఆహారం తయారు చేసి కస్టమర్లకు పెడుతున్నారు. నాణ్యత గల మటన్ కేజీ రూ.600 ఉండగా నాసిరకం మటన్ రూ.480కే దొరుకుతుంది.

కోడి మాంసం కిలో రూ.220 ఉండగా రూ.108కే దొరుకుతుంది. చేపలు రకాన్ని బట్టి రూ.200  నుంచి రూ.500 వరకు ఉండగా 30 శాతం ధర తగ్గించి నాణ్యత లేని చేపలను హోటల్ నిర్వాహకులు కొంటున్నారు. అందులోనూ మాంసం మిగిలితే ఫ్రిజ్‌లో రోజుల తరబడి ఉంచి కస్టమర్లకు పెడుతున్నారు.

వంటల కోసం ఉపయోగించే నూనె, కారంపొడి, మసాల దినుసులు, అల్ంల వెల్లుల్లి తొందరగా ఉడికేందుకు హాని కలిగించే రసాయనాలు వాడుతున్నారు. రుచి, వాసన కోసం రసాయనాలు వాడుతున్నారు. 

అపరిశుభ్రంగా వంట గదులు

టిఫిన్ సెంటర్లు, దాబా హోటళ్లు, రెస్టారెంట్‌లలో ఉన్న వంట గదులు అపరిశుభ్రంగా ఉంటున్నాయి. ఆహార పదార్థాలపై ఈగలు, దోమలు వాలుతున్నాయి. ఆహారంలో బల్లులు, బొద్దింకలు వచ్చిన ఘటనలు కూడా ఉన్నాయి. నిర్మల్‌కు చాలామంది మహారాష్ట్ర, బీహార్, ఏపీ, బెంగాల్ ప్రాంతాలకు చెందిన కూలీలు, దినసరి కార్మికులు ఎక్కువగా వస్తుంటారు. వారు తక్కువ ధరకు ఆహారం లభించే హోటళ్లను ఎంచుకుని భోజనం చేస్తుంటారు. దీన్ని ఆసరా చేసుకుని కొన్ని హోటళ్లలో కల్తీ పదార్థాలతో చేసిన ఆహారం అమ్ముతున్నారు. 

వరుస ఘటనలతో కలకలం

ఈ నెల 2న బోథ్‌కు చెందిన ఐదుగురు నిర్మల్ పట్టణంలోని గ్రీల్‌నైన్ రెస్టారెంట్‌లో చికెన్ బిర్యాణి తిని అస్వస్థకు గురయ్యారు. పుల్‌కాలీ బౌగా(19) అనే యువతి మృతి చెందింది. నెల రోజుల క్రితం రెండు హోటళ్లలో బొద్దింకలు కనిపించాయి. ఓ టిఫిన్ సెంటర్‌లో ఎలుక తోక వచ్చింది. భైంసా, ముథోల్ పట్టణంలో మటన్ బిర్యానికి ఆర్డరు ఇస్తే వేరే జంతువు మాంసం ముక్క రావడంతో హోటల్‌పై దాడి చేశారు.

ఖానాపూర్ దాబాలో చనిపోయిన చేపలు, కోడి మాంసంతో వండిన ఆహారం పట్టుబడింది. నిర్మల్ పట్టణంలోని స్టార్ హోటల్‌లో కల్తీ ఆహారం ఇవ్వడంతో బాధితులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఏడాదిలో ఇప్పటి వరకు ఇటువంటి ఘటనలు 10 వరకు జరుగగా 100 మంది అస్వస్థకు గురయ్యారు. 

నామమాత్రపు తనిఖీలు 

హోటళ్లలో ఏదైనా ఘటన జరిగినప్పుడు మాత్రమే అధికారులు తనిఖీలు నిర్వహించి నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. మున్సిపాటీల్లో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, కమిషనర్లు, గ్రామాల్లో కార్యదర్శులు తనిఖీలు చేస్తున్నా వారిపై పైనుంచి ఒత్తిడి ఉండటంతో చర్యలు తీసుకోలే పోతున్నారు. నిరంతరం తనిఖీలు చేయాలన్న రెండు జిల్లాలకు ఒక్కరే అధికారి ఉండటంతో సమస్యగా మారింది.