calender_icon.png 1 October, 2024 | 7:00 PM

వారి వేధింపుల వల్లే ఇండస్ట్రీకి దూరమయ్యా..

30-09-2024 12:26:25 AM

లైంగిక వేధింపులపై హేమ కమిటీ నివేదికతో మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలన విషయాలు బహిర్గతం అవుతున్నాయి. మలయాళ నటి మిను మునీర్ సైతం పలువురు స్టార్ డైరెక్టర్లు, నటులపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఆమె గతంలో ప్రముఖ నటుడు జయసూర్య సహా ఏడుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇటీవల ఓ ఇంగ్లిష్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిను మునీర్ తాజాగా దర్శకుడు బాలచంద్ర మీనన్ కూడా తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించింది. “ఇంతటి ప్రభావం ఉన్న ఎమ్మెల్యే, మాజీ నటుడు ముఖేష్‌ను అరెస్టు చేయడం అంత సులువైన విషయం కాదు.

ఫిర్యాదులు అందితే కేసులు నమోదు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పినప్పుడు నేను కూడా మాట్లాడాలని నాకు అనిపించింది. అందుకే ఇప్పుడు ముందుకొచ్చాను. బాలచంద్ర మీనన్ 2007లో తన గదిలో గ్రూప్ సెక్స్ చూడమని బలవంతం చేశాడు. అప్పటికే అక్కడ మరికొంత మంది పురుషులు కూర్చుని చూస్తున్నారు. అక్కడే ముగ్గురు అమ్మాయిలు, బాలచంద్ర ఉన్నారు.

అతను నన్ను కూర్చుని చూడమని అడిగారు. ఈ వేధింపుల విషయమై నేను పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత రాజీపడాలని కోరుతూ నాకు చాలాసార్లు కాల్స్ వచ్చాయి. డబ్బును కూడా ఆఫర్ చేశారు. ఆ కాల్స్‌తో విసుగెత్తిపోయి ఇప్పుడు తెలియని నంబర్ల నుంచి కాల్స్ తీసుకోవడమే మానేశాను.

ఇదే వేధింపుల విషయమై ఇటీవల తన ఫేస్‌బుక్‌లో పెద్ద పోస్ట్ చేసిందామె. “2013లో ఒక ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నప్పుడు.. ముఖేష్, మణియంపిళ్ల రాజు, ఇడవెల బాబు, జయసూర్య నన్ను శారీరకంగా వేధించారు. అసభ్యకరంగా మాట్లాడారు. నా గది నుంచి బయటకు రాగానే నటుడు జయసూర్య నా అనుమతి లేకుండా నన్ను వెనుక నుంచి కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు.

నేను షాక్ అయ్యి పారిపోయాను. అలా వారి వేధింపులు భరించలేక మలయాళ చిత్ర పరిశ్రమను వదిలి చెన్నై వెళ్లాల్సి వచ్చింది. నేను అప్పుడు అనుభవించిన బాధలకు న్యాయం కోరుతున్నాను” అని రాసుకొచ్చింది మిను మునీర్.