- అమరవీరులకు నివాళి అర్పించిన దాఖలా లేదు..
- తెలంగాణ కోసం పదవికి రాజీనామా చేయలే..
- ఆయన నాడు ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టారు
- సిద్దిపేట ‘దీక్షా దివస్‌లో’ రేవంత్‌రెడ్డిపై హరీశ్‌రావు ఫైర్
సిద్దిపేట, నవంబర్ 29 (విజయక్రాంతి): నాడు తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కోరితే ఇప్పటి సీఎం రేవంత్‌రెడ్డిని కోరగా, ఆయన ముఖం చాటేశారని, టీడీపీ చెప్పినట్లే విన్నారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు గుర్తుచేశారు.
సీఎం పదవి చేపట్టాక ఆయన ఒక్కసభలోనైనా ‘జై తెలంగాణ’ అని నినదించలేదని, కనీసం తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పించిన దాఖలాలు సైతం లేవని స్పష్టం చేశారు. సిద్దిపేటలోని బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ‘దీక్షా దివస్’లో ఆయన మాట్లాడారు.
నాడు తెలంగాణ ఉద్యమం చేస్తున్న వారిపై తుపాకీ పెట్టించిన రేవంత్‌రెడ్డిపై ఎప్పటికీ మరకపోదన్నారు. స్వరాష్ట్రం కోసం నాడు శాఖ లేకుండా కేసీఆర్ ఆరు నెలలు మంత్రి పదవిలో కొనసాగారని, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గడ్డిపోచల్లాగా పదవులను వదులుకున్నారని గుర్తుచేశారు. సీఎం రేవంత్‌రెడ్డిది రెండు నాల్కల పాలన అని విమర్శించారు.
తమ పోరాట ఫలితంగానే లగచర్లలో భూసేకరణపై సీఎం వెనక్కి తగ్గారని, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ దీక్షా స్ఫూర్తితో మళ్లీ బీఆర్‌ఎస్ మరో ఉద్యమం చేయాల్సి ఉందన్నారు. ప్రాణాలకు తెగించి కోట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని, స్వరాష్ట్రం వచ్చిన తర్వాత కొందరు బీఆర్‌ఎస్‌లో చేరి, పందికోక్కులాగ తిని.. అధికారం కోల్పోగానే వెళ్లిపోయారని ధ్వజమెత్తారు.
1956లోనే హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రాలో విలీనం చేయొద్దని, నాటి పెద్దలు గళమెత్తారని గుర్తుచేశారు. కాంగ్రెస్, టీడీపీ తెలంగాణకు అనుకూలమని తీర్మానాలు చేసి, అవసరం తీరాక మాట మార్చాయన్నారు. 16 ఏళ్ల క్రితం కేసీఆర్ సిద్దిపేటలో దీక్ష చేపడితే గొర్రెల మందపై తోడేళ్లు పడ్డట్టు పోలీసులు ఉద్యమకారులపై విరుచుకుపడి అరెస్టు చేశారని వాపోయారు.
రాజకీ య ప్రక్రియ విఫలం కావడంతోనే కేసీఆర్ అహింసామార్గంలో నిరహార దీక్ష చేపట్టారని స్పష్టం చేశారు. 2009 డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణ ఇస్తున్నట్లు ప్రకటించి, తర్వాత ప్రకటనను వాపస్ తీసుకున్నదని గుర్తుచేశారు.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రచించిన పుస్తకంలో ప్రత్యేకంగా కేసీఆర్ నిబద్ధత గురించి ప్రస్తావించారన్నారు. హరీశ్‌రావు తొలుత పార్టీ జిల్లా అధ్యక్షుడు, దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డితో కలిసి ప్రశాంత్‌నగర్‌లోని తెలంగాణ తల్లి విగ్రహానికి, రంగాదాంపల్లి అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు.