calender_icon.png 24 December, 2024 | 9:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టర్ ఎన్నికల్లో పోటీ చేశారా?

19-10-2024 01:53:25 AM

  1. కౌంటర్ వేయడానికి ఎన్నికలకు సంబంధం ఏమిటి?
  2. ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన హైకోర్టు

హైదరాబాద్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వానికి మధ్య ఓ భూవివాదంలో సింగిల్ జడ్జి తీర్పుపై ప్రభుత్వం అప్పీలు దాఖలు చేయడంలో జాప్యానికి, చట్ట సభకు జరిగిన ఎన్నికలను కారణంగా చూపటాన్ని శుక్రవారం హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఎన్నికల వల్లే కౌంటర్ వేయలేదని అధికారులు చెప్పడానికి వాళ్లేమైనా రాజకీయ నాయకులా? అని నిలదీసింది.

ఎన్నికలొస్తే మంత్రులు వెళతారుగానీ అధికారులు వెళ్లరు కదా? ప్రశ్నించింది. అప్పీల్ దాఖలు చేసిన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఏ రాజకీయ పార్టీ తరపున పోటీ చేశారు? గెలుపొందారా? అని వ్యాఖ్యానించింది. ఎన్నికలు వస్తే కార్యనిర్వాహక వర్గం తన తాను పనిచేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. పని వదిలేసి ప్రచారానికి వెళ్లినట్లుగా సాకులు చెప్పడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది.

ఎన్నికల ప్రచారానికి వెళ్లడం వల్ల అప్పీలు దాఖలు చేయడంలో జాప్యం జరిగిందా? అని మండిపడింది. హైదరాబాద్ గుడిమల్కాపూర్‌లో 2302 చదరపు గజాల స్థలానికి సంబంధించిన వివాదాన్ని ఏపీ యజమానిలేని, ఖాళీ స్థలాల చట్టం కింద సివిల్ కోర్టుకు నివేదిస్తూ కలెక్టర్ 2014లో ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ మహమ్మద్ ఫజలుల్లాల్ హక్, మరో 9 మంది 2016లో హైకోర్టును ఆశ్రయించారు.

దీనిపై విచారించిన సింగిల్ జడ్జి ఆ స్థలం ప్రైవేటు వ్యక్తులకు చెందినదని తీర్పు చెప్పారు. 1968లో ప్రభుత్వం లీజుకు తీసుకుని పాఠశాల నిర్వహిస్తోందని, అందువల్ల పాఠశాలను ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేయలేమని భూసేకరణ చట్టం కింద తగిన చర్యలు చేపట్టాలని, ఈ ప్రక్రియను రెండు నెలల్లో పూర్తి చేయాలని తీర్పులో పేర్కొన్నారు.

అలా భూసేకరణ ప్రక్రియ కింద చర్యలు ప్రారంభించని పక్షంలో స్థలాన్ని పిటిషనర్లకు స్వాధీనం చేయాలని 2016 సెప్టెంబర్ 13న తీర్పు వెలువరించారు. సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం తరపున హైదరాబాద్ కలెక్టర్ ఈ ఏడాది జూలైలో అప్పీలు దాఖలు చేశారు. ఎన్నికల కారణంగా అప్పీల్ దాఖలు చేయడంలో జాప్యం జరిగిందని, జాప్యాన్ని మన్నించాలంటూ మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు.

ఈ అప్పీలుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ జే శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఏ దివ్య వాదనలు వినిపిస్తూ అప్పీల్ దాఖలు చేయడంలో జాప్యం జరిగిందని, మన్నించి అప్పీలుపై విచారణ చేపట్టాలని కోరారు. దీనిపై డివిజన్ బెంచ్ స్పందిస్తూ, జాప్యానికి పేర్కొన్న కారణంపై నిలదీసింది.

2023లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినందున అప్పీలు దాఖలు చేయలేకపోయామని ఎలా చెబుతారని ప్రశ్నించింది. పని చేయకుండా ఉండటానికి ఎన్నికలు లైసెన్సుగా పరిగణిస్తున్నారా అని నిలదీసింది. ఎన్నికలు రాజకీయ పార్టీలకు, ప్రభుత్వంలోని మంత్రులకే కాని అధికారులకు కాదు కదా? అని మండిపడింది. మీరేమైనా ఐదేళ్ల కాలానికే పదవుల్లో ఉంటున్నారా? అని నిలదీసింది.

దీనిపై న్యాయవాది సమాధానమిస్తూ రెండు పడకల గదుల ఇళ్ల కేటాయింపు దరఖాస్తుల పరిశీలన, ఎన్నికల కోడ్, ఎన్నికల కార్యక్రమాలు చేపట్టడం వంటివాటిలో అధికారులు బిజీగా ఉన్నారని చెప్పడంతో ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

కేవలం ఇదే కారణం అయితే అప్పీలును జాప్యం కారణంపైనే తిరస్కరించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. న్యాయవాది కల్పించుకొని సరైన కారణాలతో అఫిడవిట్ దాఖలు చేస్తామని అభ్యర్థించారు. ఇందుకు అనుమతించిన హైకోర్టు విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.