calender_icon.png 17 November, 2024 | 8:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మళ్లెందుకొచ్చారు?

19-09-2024 02:52:18 AM

రెండోసారి పిటిషన్ వేసిన బీఆర్‌ఎస్‌పై ఆగ్రహం

  1. నల్లగొండ బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చివేత వ్యవహారంలో హైకోర్టు సీరియస్
  2. కోర్టు సమయం వృథా చేసినందుకు రూ.లక్ష చెల్లించండి
  3. జోక్యం చేసుకోబోమంటూ ఉత్తర్వులు జారీ  

హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలో అనుమతులు లేకుండా నిర్మించిన బీఆర్‌ఎస్ పార్టీ భవనం కూల్చివేత వ్యవహారంలో రెండోసారి పిటిషన్ వేసిన బీఆర్‌ఎస్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. గతంలో ఇదే అంశానికి సంబంధించి ఉత్తర్వులు జారీచేసినా తిరిగి పిటిషన్ వేయడంపై సీరియస్ అయ్యింది. పార్టీ కార్యాలయ భవనం కూల్చివేత వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది.

కోర్టు సమయం వృథా చేసినందుకు నల్లగొండ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీకి  రూ. లక్ష 4 వారాల్లో చెల్లించాలని ఆదేశించింది. నల్లగొండ మున్సిపాలిటీలో సర్వే నంబర్ 1506లో ఎకరం స్థలంలోని పార్టీ కార్యాలయ భవన నిర్మా ణాన్ని క్రమబద్ధీకరించేందుకు నిరాకరించడంతోపాటు జూలై 20న మున్సిపల్ కమిషనర్ జారీచేసిన కూల్చివేత నోటీసు ను సవాలు చేస్తూ నల్లగొండ బీఆర్‌ఎస్ తరఫున మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ టీ వినోద్‌కుమార్ బుధవారం విచారణ చేపట్టారు.

పిటిషనర్ తరఫు న్యాయ వాది వాదనలు వినిపిస్తూ పార్టీ కార్యాలయం క్రమబద్ధీకరణ దరఖాస్తును తిరస్కరి స్తూ జూలై 20న కమిషనర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించినట్టు తెలిపారు. అయితే ఇందు లో జోక్యానికి హైకోర్టు నిరాకరిస్తూ చట్టప్రకారం ప్రత్యామ్నాయాలను చూసుకోవచ్చని సలహా ఇచ్చిందని చెప్పారు. కమిషనర్ ఉత్తర్వులను సవాల్  చేయడానికి ప్రత్యామ్నా యం మున్సిపల్ ట్రైబ్యునల్ లేదని, అందువల్ల మళ్లీ హైకోర్టును ఆశ్రయించినట్టు తెలి పారు.

క్రమబద్ధీకరణ తిరస్కరణతోపాటు జూలై 20న 15 రోజుల్లో అక్రమ నిర్మాణాలను తొలగించాలని, లేని పక్షంలో మున్సి పాలిటీ తొలగిస్తుందని నోటీసులు జారీ చేసిందని తెలిపారు. కూల్చివేత ఉత్తర్వుల అమలును నిలిపివేసి క్రమబద్ధీకరణ దరఖాస్తును పరిశీలించాలని ఆదేశించాలని కోరా రు. వాదనలను విన్న న్యాయమూర్తి బీఆర్‌ఎస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో క్రమబద్ధీకరణ నిరాకరణ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించగా, తిరిగి మరో పిటిషన్ ఎలా వేస్తారని ప్రశ్నించారు. మున్సిపల్ కమిషనర్ జారీ చేసిన కూల్చివేత ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్‌ను జరిమానాతో కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

కాంగ్రెస్‌వి కక్షసాధింపు చర్యలు

నల్లగొండ బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చివేత కాంగ్రెస్ పార్టీ కక్షసాధింపు చర్యలేనని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆరోపించారు. హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తామని, అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామ ని ఓ ప్రకటనలో తెలిపారు. బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చివేతపై హైకోర్టు ఆదేశాలపై అప్పీల్‌కు వెళ్తామని బీఆర్‌ఎస్ నల్లగొండ అధ్యక్షుడు రవీంద్రకుమార్ చెప్పారు. న్యాయపరంగానే పోరాడుతామని స్పష్టంచేశారు.

చట్టం తన పని తాను చేస్తుంది

బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం కూల్చి      వేతపై హైకోర్టు ఆదేశాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. చట్టం తనపని తాను చేసుకుంటూ పోతుందని, అందులో ఎవరికీ మినహాయింపు ఉండదని వ్యాఖ్యానించారు.