calender_icon.png 30 October, 2024 | 6:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జలుబు చేసిందా..!

24-06-2024 12:00:00 AM

వానకాలం.. వచ్చిదంటే చాలు.. చిన్న చిన్న సమస్యలే చాలా ఇబ్బంది పెడతాయి. వాటిలో ముఖ్యంగా జలుబు.. దగ్గు.. ముక్కు కారటం.. గొంతు నొప్పి, కళ్ల నుండి  నీరు కారడం, చలి వంటి లక్షణాలు సహజంగా అందరిని వేధిస్తాయి. జలుబు, ప్లూ సీజన్ వానకాలం నుంచి శీతాకాలం చివరి వరకు ఉంటుంది. ఎన్ని మందులు వాడినా అప్పటికి తగ్గినట్టే అనిపిస్తుంది కానీ అది తాత్కాలికం మాత్రమే.. మామూలు ఇంగ్లీషు వైద్యంతో విసిగిపోయినవారు అప్పుడప్పుడు ఆయుర్వేదం వైపు చూస్తూ ఉంటారు. ఇలా అస్తమానూ జలుబు, దగ్గుల బారిన పడేవారు ఈ చికిత్సలో సహాయపడే మూలికా ఔషధాలను ఆహారంలో చేర్చుకోవచ్చు. అవేంటో చూద్దాం. 

ఆయుర్వేదం

తులసి..

తులసి మంచి ఔషదం. ఇది గొప్ప సుగుణాలు కలిగి ఉంది. తులసిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్లమేటరీలు ఉన్నాయి. దీని వల్ల చల్లటి వాతావరణం కనిపించే వ్యాధులకు తులసి చక్కని ఔషధంగా పని చేస్తుంది. ముఖ్యంగా జలుబు నుంచి ఉపశమనం కలిగించడంలో ముందుంటుంది.

సపిస్తాన్ (నక్కెరి పండ్లు)..

లాసోరా, లిసోడా, గోండి, నరువిరి, సబెస్తాన్ ప్లం అని భారతదేశమంతతటా కనిపించే ఈ చెట్టుకు ఉన్న కొన్ని సాధారణ పేర్లు. చెట్టు వివిధ భాగాలు అంతర్గతంగా, బాహ్యంగా ఔషధ ప్రయోజనాల కోసం ప్రాచీన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. దీనినే సపిస్తాన్, కోర్డియో మిక్సా అని కూడా పిలుస్తారు. సాధారణ జలుబు, దగ్గుతో సహా ఎగువ శ్వాసకోశ ఇబ్బందులకు చికిత్స చేయడానికి దీనిని ఉపయోగిస్తారు. ఈ హెర్బ్ యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్లమేటరీ, నొప్పి నుంచి ఉపశమనం కలిగించే లక్షణాలను కూడా కలిగి ఉంది. 

అమల్టాస్ (రేల పండ్లు)..

రేల చెట్టు ఆయుర్వేదంలో ఔషధ వృక్షంగా ఉపయోగిస్తారు. వీధుల్లో కనిపించే ‘గోల్డెన్ షవర్’ లేదా లాబ ర్నమ్ చెట్లు ఈ చెట్టు మూలికను వైద్యంలో ఉపయోగిస్తారు. ఈ మొక్కల విత్తనాలు, పువ్వులు కూడా ఆరో గ్యానికి చాలా ఉపయోకరంగా ఉంటాయి. బెరడు, కాండం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులోని అమల్టాస్ ఎక్స్‌ట్రాక్ట్స్ జ్వరాన్ని, గొంతులో కలిగే అసౌకర్యం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మంట, ఛాతీలో ఇబ్బందిని తగ్గిస్తుంది. గజ్జి, దురద, అలెర్జీ వంటి చర్మ సమస్యలను తగ్గించడానికి రేల చెట్టు సహాయపడుతుంది. బీన్స్ లాగా ఉండే ఈ రేల పండ్లను పేస్ట్‌గా చేసి గజ్జి, దురద ఉన్నచోట అప్లు చేయాలి. రోగ నిరోధక శక్తి ని పెంచడంలో కూడా ఈ రేల చెట్టు మంచి పాత్ర పోషిస్తుంది. ఈ చెట్టు బెరడులో యాంటీ ఆక్సిడెంట్ లక్షణా లు పుష్కలంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచడ మే కాకుండా సీజనల్ వ్యాధుల ప్రభావాన్ని తగ్గిస్తుంది. 

ఉన్నాబ్ (రేగి పండ్లు)..

ఉన్నబ్, బెర్ అని, కాశీరేగి అని పిలుస్తాం. దీనిని ఎండిన పండుని వైద్యంలో వాడతారు. దీనిని ఇండియ న్ జుజుబ్ లేదా కామన్ అని కూడా పిలుస్తారు. ఇది దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే శ్వాసకోశ వ్యవస్థను శాంతపరుస్తుంది. ఈ పండులో విటమిన్ సి అధికంగా ఉంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. 

ములేతి (అశ్వగంధ)..

ములేతి లేదా లైకోరైస్ ఇది గొంతు నొప్పిని నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. ఇదే కాదు ఈ మూలికతో ఇం కా అనేక ఇతర ఉపయోగాలు కూడా ఉన్నాయి. అశ్వగంధ యాంటీవైరల్ ఏజెంట్‌లుగా పని చేసే రెండు రసాయన భాగాలను కలిగి ఉంది. ములేతికి శరీరం లోపల ఇన్‌ఫెక్షన్లు వ్యాపించకుండా నిరోధించే శక్తి ఉంది. 

తినకూడని ఆహారం.. 

బయటి ఆహారం తినకూడదు. ముఖ్యంగా ఐస్‌క్రీములు, చాక్‌లేట్లు, శీతల పానీయాలు, చెరకు రసం, జంక్ ఫుడ్స్ తినొద్దు. ఇంట్లో కూడా పూరీలు, గారెలు, సమోసాలు, నూనెలో ఫ్రై చేసిన ఆహారపదార్థాలను తినకపోవడం మంచిది. 

తీసుకోవాల్సినవి..

కాచి చల్లార్చిన నీరు, తేలికగా జీర్ణమయ్యే ఆహారం (పెసలు, ఉలవలతో చేసిన జావ/ సూప్స్). అల్లం, కరివేపాకులతో తయారు చేసిన మజ్జిగ. తాజాగా వండిన వేడి వేడి ఆహారం తీసుకోవాలి. ఊరగాయలు కాకుండా తాజాగా తయారు చేసిన పచ్చళ్ళ వల్ల అగ్ని దీప్తి కలుగుతుంది. (ఉదాః అల్లం/కరివేపాకు/పుదీనా/కొత్తిమీర పచ్చళ్లు ఆహారంలో తీసుకోవాలి. ఆవు నెయ్యి, నువ్వుల నూనె ఉపయోగించడం మంచిది. 

ఈ సీజన్‌లో.. సప్త సూత్రాలతో!

ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్.. అంటే చికిత్స కన్నా నివారణే మేలు! వానకాలంలో వచ్చే జబ్బులబారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఈ సీజన్‌లో సప్త సూత్రాలు పాటిస్తే చాలావరకు రైనీ సీజన్ రోగాల నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. 

  1. వానకాలంలో ముఖ్యంగా ఆయుర్వేదం ప్రకారం కాచి చల్లార్చిన నీటినే తాగాలి. దీని వల్ల సగం వరకు రోగాలను తగ్గించుకోవచ్చు. 
  2. బాగా ఉడికించిన ఆహారం, వేడిగా ఉన్నప్పుడే  తీనాలి. 
  3. వానలో తడవకుండా జాగ్రత పడాలి. 
  4. ఇంటిలోపల, చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
  5. సాధ్యమైనంత వరకు మస్క్యుటో రిపల్లెంట్స్ వాడాలి. లేదంటే కనీసం ఇంట్లో వేపాకు పొగ పెట్టునా దోమలను తరిమేయాలి. 
  6. చలిగా ఉందని బద్దకించకుండా రోజుకు రెండుసార్లు శుభ్రంగా స్నానం చేయాలి. లేదంటే చర్మరోగాలు వచ్చే ఆస్కారం ఉంటుంది. 
  7. చేతులతో ముక్కు, కళ్లు, నోరును సాధ్యమైనంతవరకు టచ్ చేయకుండా జాగ్రత్త పడాలి. 

డాక్టర్ సి.ధన్య 

ఆయుర్వేద వైద్య నిపుణులు

కేఎస్‌ఏసీ మల్టీస్పెషలిటీ 

హాస్పిటల్, బంజారాహిల్స్

- అల్విదా