calender_icon.png 31 March, 2025 | 8:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెనిజులా చమురు కొనుగోలు చేశారో..

25-03-2025 12:00:13 AM

వారికి 25 శాతం సుంకాలు: ట్రంప్

ఏప్రిల్ 2 నుంచి అమలుకు ముహూర్తం..

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబ్ పేల్చారు. ఇప్పటికే వివిధ దేశాల మీద సుంకాలు వేస్తూ వాణిజ్యభయాలకు తెరలేపిన విషయం తెలిసిందే. తాజాగా వెనిజులా దేశం నుంచి చమురును కొనుగోలు చేసే దేశాలపై ట్రంప్ విరుచుకుపడ్డారు. ‘ఎవరైతే వెనిజులా దేశం నుంచి చమురును దిగుమతి చేసుకుంటారో.. వారు అమెరికాతో చేసే వాణిజ్యంపై 25 శాతం సుంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సుంకాలు ఏప్రిల్ 2 నుంచి విధిస్తా. వెనిజులా అనేక గ్యాంగులను పెంచి పోషిస్తోంది.’ అని పేర్కొన్నారు. ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే అమెరికాలో అక్రమంగా ఉంటున్న అనేక మంది వెనిజులా దేశస్తులను వెనక్కి పంపింది. చైనాకు చెక్ పెట్టేందుకే అమెరికా ఇలా చేసిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

వెనిజులా నుంచి పెద్ద మొత్తంలో చైనా చమురు దిగుమతి చేసుకుంటోంది. ఇప్పటికే చైనా నుంచి దిగుమతయ్యే వస్తువులకు ట్రంప్ ప్రభుత్వం సుంకాలు విధిస్తున్న విషయం తెలిసిందే. ట్రంప్ తాజాగా విధించిన సుంకాల ప్రభావం చైనాకు పెద్ద షాకే అని చెప్పాలి. 2023లో వెనిజులా నుంచి చైనా 68 శాతం చమురును కొనుగోలు చేసింది. స్పెయిన్, సింగపూర్, వియత్నాం దేశాలు కూడా వెనిజులాతో చమురు వ్యాపారం చేస్తున్నాయి. జనవరిలో అమెరికా వెనిజులా నుంచి 8.6 మిలియన్ బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటికే ఏప్రిల్ 2ను ట్రంప్ ‘లిబరేషన్ డే’గా ప్రకటించారు. ఇతర దేశాలు అమెరికా మీద ఎంతలా పన్నులు విధిస్తున్నాయో అమెరికా కూడా అదే రీతిలో పన్నులు విధించబోతుందని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు.