కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి పొన్నం కౌంటర్
హైదరాబాద్, జులై 11 (విజయక్రాంతి): హైదరాబాద్ అభివృద్ధి విషయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాటలు చూస్తే ఆశ్చర్యం గా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమ ర్శించారు. హైదరాబాద్ నగరం నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్‌రెడ్డి టూరిజం మంత్రిగా సిటీ అభివృద్ధి కోసం గడిచిన ఐదేళ్లలో కేంద్రం నుంచి ఒక్క రూపాయి అయినా తెచ్చారా? అని ప్రశ్నిం చారు. గురువారంగాంధీభవన్‌లో పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి పాలనలో జీహెచ్‌ఎంసీ, జలమండలిలో నిధుల లేమితో హైదరాబాద్ నగరం అనాథలా మారిందంటూ చేసిన విమ ర్శలకు కౌంటర్ ఇచ్చారు.
గడిచిన 10 ఏళ్లలో బీజేపీ హయాంలో నగర అభివృద్ధి కోసం నిధులు తేకుండా గత బీఆర్‌ఎస్ ప్రభు త్వంతో అంటకాగి హైదరాబాద్‌ను నిర్లక్ష్యం చేసింది మీరు కాదా? అని మండిపడ్డారు. హైదరాబాద్ ఇమేజ్‌కు భంగం కలిగే విధంగా కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్‌కు బీజేపీ, బీఆర్‌ఎస్ చేసిందేమి లేదని, బీజేపీపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక నిధులు తీసుకురావడంలో బీఆర్‌ఎస్ విఫలమైందన్నారు. భూకబ్జాలు, అక్రమ కట్టడాలతో హైదరాబాద్ ఇలా కావడానికి బీఆర్‌ఎస్, బీజేపీలే కారణమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేంద్రం నుంచి నిధుల కోసం అనేక విజ్ఞప్తులు చేశా మన్నారు. బోనాల పండుగ పూర్తయిన తర్వాత బస్తీల్లోకి వెళ్లి నేరుగా సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి పొన్నం తెలిపారు. మధుయాష్కీగౌడ్ మాట్లాడుతూ.. నిరుద్యో గులను రెచ్చగొడుతున్న బీఆర్‌ఎస్ నేతలకు యూనివర్సిటీల్లో అడుగుపెట్టే దమ్ముందా? అని సవాల్ విసిరారు.