calender_icon.png 25 November, 2024 | 2:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రిగారు మర్చిపోయారా?

16-10-2024 01:34:11 AM

నెరవేరని సీతక్క హామీ

ఏళ్లు గడుస్తున్నా పూర్తికాని గుండి వంతెన 

వానాకాలంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గ్రామస్థుల రాకపోకలు

కుమ్రంభీం ఆసిఫాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న గుమడి గ్రామానికి వెళ్లేందుకు వాగుపై చేపట్టిన బ్రిడ్జి నిర్మాణం ఇప్పటికీ అసంపూర్తిగానే ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క ఏడు నెలల క్రితం సందర్శించి, బ్రిడ్జి నిర్మాణానికి హామీ ఇచ్చినా పనులు ముందుకు సాగడం లేదు. రూ.8 కోట్ల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణానికి 2014లో శంకుస్థాపన చేయగా నేటికీ పూర్తి కాలేదు.

దీంతో ఆ గ్రామ ప్రజ లు ఏటా వర్షాకాలంలో ప్రాణాలు అరచేతి లో పెట్టుకుని వాగు దాటాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్నికల సమయంలో నాయకులు బ్రిడ్జి పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం తప్ప చేసింది ఏమీ లేదని ప్రజలు వాపోతున్నారు. 

ఎన్నికల బహిష్కరణ

2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామ ప్రజలంతా పార్టీలతో సంబంధం లేకుండా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తేనే ఓట్లు వేస్తామంటూ ఎన్నికలను బహిష్కరించారు. నాయకులెవరూ ప్రచారానికి రావద్దని ఫ్లెక్సీలు పెట్టి హెచ్చరించారు. ఎన్నికల అధికారులు కల్పించుకుని ఎన్నికలను బహిష్కరించడం సరికాదని నచ్చజెప్పడంతో ఆఖరి నిమిషంలో ఓట్లు వేశారు. అయితే ప్రజలు అందోళన చేసిప్పుడు మాత్రం హడావిడిగా పనులను ప్రారంభించడం, ఆ తర్వాత నిలిపివేయడం ఏళ్లుగా జరుగుతూ వస్తున్నది. 

మంత్రి సీతక్క హామీ ఏమాయే?

15 మార్చి 2024న జిల్లా ఇన్‌చర్జి మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రేతో పాటు సంబంధిత అధికారులతో కలసి గుండి వంతెనను పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతం చేసి వానాకాలంలోగా వంతెనను వినియోగంలోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. మంత్రి పర్యటించి ఏడు నెలలు గడుస్తున్నప్పటికీ పనుల్లో పురోగతి కనిపించడం లేదు.

కాంట్రాక్టర్‌కు నిధులు రాకపోవడంతో పనులు ఆలస్యం అవుతున్నాయన్న వాదన ఉంది. కాగా బుధవారం గుండి ప్రభుత్వ పాఠశాల 10వ తరగతికి అప్‌గ్రేడ్ అయిన సందర్భంగా గ్రామాన్ని ఈ నెల 16, 17 తేదీల్లో మంత్రి సీతక్క సందర్శించనున్నారు. ఈ మేరకు మంత్రి హామీని గుండి ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.

పాలకుల మాటలు నీటి మూటలు

జిల్లా కేంద్రానికి నాలు గు కిలో మీటర్ల దూరం లో ఉన్న గుండి గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేదు. మార్గమధ్యంలో ఉన్న వాగుపై వం తెన నిర్మాణం ఏళ్ల తరబడి కొనసాగుతున్నది. వానాకాలంలో ప్రాణాలు ఆరచే తిలో పెట్టుకుని వాగు దాటుతున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో మం జురైన వంతెన ఇప్పటికీ పూర్తి కాలేదు. పాలకుల మా టలు నీటిమూటలు అవుతున్నాయి. మంత్రి సీతక్క హామీ కూడా నెరవేరలేదు. 

 రవీందర్, మాజీ ఎంపీటీసీ, గుండి