calender_icon.png 22 October, 2024 | 5:29 AM

వేరే పార్టీ వాళ్ల కాలేజీలని సీట్లు పెంచలేదా?

22-10-2024 01:50:03 AM

  1. రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
  2. తీర్పు అమలు నిలిపివేయడం కోర్టు ధిక్కరణే 
  3. దీనికి శిక్ష ఎంతో తేల్చుతామన్న ధర్మాసనం

హైదరాబాద్, అక్టోబర్ 2౧(విజయక్రాంతి): ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఏఐసీటీఈ, జేఎన్టీయూ ఆమోదించిన సీట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతించాలన్న గత ఉత్తర్వులను అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది.

సీట్ల భర్తీకి మాప్‌అప్ కౌన్సెలింగ్ నిర్వహించాలని సెప్టెంబర్ 9న ఇచ్చిన ఉత్తర్వులను ఉద్ధేశపూర్వకంగా అమలు చేయనట్టు అనిపిస్తోందని వ్యాఖ్యానించింది. కోర్టు ఉత్తర్వులను అమలుచేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేనట్టుందని అభిప్రాయపడింది. హైకోర్టు ఉత్తర్వులపై దాఖలు చేసిన అప్పీలును సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత కూడా ఎందుకు అమలు చేయలేదని నిలదీసింది.

అక్టోబర్ 1న ప్రభుత్వం రివ్యూ దాఖలు చేసినప్పటికీ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఏమీ ఇవ్వనప్పుడు గతంలోని తమ ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేని నిప్పులు చెరిగింది. సీట్లు పెంపుదల చేయాల్సిన కాలేజీలు వేరే రాజకీయ పార్టీకి చెందినవి కావడం వల్లే పెంపుదల చేయలేదా? అనే సందేహాన్ని వ్యక్తంచేసింది. మరోపార్టీకి చెందిన కాలేజీల్లో సీట్లను పెంపుదల చేయరా అని ప్రశ్నించింది.

సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 23వ తేదీతో సీట్ల భర్తీ ప్రక్రియ ముగిసిపోనుందని గుర్తు చేసింది. ఆ తర్వాత కాలేజీలకు అనుకూలంగా ఉత్తర్వులను జారీచేస్తే ఏం ఉపయోగం ఉంటుందని ప్రశ్నించింది. ఏఐసీటీఈ అనుమతించిన సీట్లను భర్తీ చేసుకోవడానికి కాలేజీలకు అనుమతిస్తున్నట్టు ప్రకటించింది.

అయితే, ప్రైవేటు కాలేజీలు ఎలాంటి క్యాపిటేషన్ ఫీజు వసూలు చేయరాచని షరతు విధించింది. కోర్టు ఉత్తర్వులను ఉద్ధేపూర్వకంగా ఉల్లంఘించినట్టు కనిపిస్తున్నందున ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ కింద ఎందుకు శిక్ష విధించరాదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ ఏ శ్రీదేవసేన, ఉన్నత విద్యా శాఖ కన్వీనర్ శ్రీరాం వెంకటేశ్, టీజీఈ ఏపీసెట్ కన్వీనర్ డాక్టర్ బీ డీన్ కుమార్‌కు కోర్టుధిక్కార నోటీసులు జారీ చేసింది. ఎంజీఆర్, సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ, చంద్రమ్మ ఎడ్యుకేషనల్ సొసైటీ, మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ, కేఎంఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ, ఎంఎల్‌ఆర్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విద్యాజ్యోతి ఎడ్యుకేషనల్ సొసైటీ ఇతర కాలేజీలు వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్లను సోమవారం ధర్మాసనం విచారించింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్ రాహుల్‌రెడ్డి చేసిన వాదనలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేసింది.

ప్రభుత్వ వాదనలపై కౌంటర్ వేసేందుకు సమయం కావాలని రాహుల్‌రెడ్డి కోరడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. సుప్రీం కోర్టుల్లో రివ్యూ పిటిషన్ దాఖలు చేసినట్టు రాహుల్‌రెడ్డి చెప్పగా, అక్కడేమీ మధ్యంతర ఉత్తర్వులు రాలేదు కదాఅని నిలదీసింది. 

కోర్టు ఉత్తర్వుల అమలు నిలిపివేతకు సమర్థింపా?

పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి, ఎస్ నిరంజన్‌రెడ్డి వాదిస్తూ.. కోర్టు ధిక్కరణ చట్టం కింద 6 నెలల జైలు శిక్ష, జరిమానా విధించే విధంగా అధికారుల చర్యలు ఉన్నాయని అన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు, ఏవిధంగా కోర్టు ఉత్తర్వుల అమలు నిలిపివేతను సమర్థించుకుంటా రా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

అక్టోబర్ 1న రివ్యూ పిటిషన్ దాఖలు చేసి కోర్టు ఉత్తర్వులను అమలు చేయకుండా తప్పించుకునేం దుకు ప్రయత్నం చేయవద్దని తేల్చి చెప్పింది. కోర్టు ధిక్కార చర్యలకు సిద్ధంగా అధికారులు ఉన్నారా? అని ప్రశ్నించింది. ఇది ప్రాథమికంగా కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని తేల్చిచెప్పింది.

కోర్టు ఆదేశాల్ని అమలు చేయకపోవడంపై కోర్టుధిక్కార వ్యవహారంపై ఎంత శిక్ష విధించాలనే అంశంపై వాదనలు వింటామని ప్రకటించింది. ఒక తప్పు జరిగినపుడు దాన్ని సరిచేసుకునే ప్రయత్నం చేయలేదని, తాము ఆ తప్పును కొనసాగించలేమని వెల్లడించింది.

తిరిగి ప్రభుత్వ న్యాయవాది రాహుల్ రెడ్డి కల్పించుకుని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘన చేయలేదని, కౌన్సెలింగ్ పూర్తయిందని, లక్ష మంది పైగా విద్యార్థుల అడ్మిషన్లు జరిగిన కారణంగా సీట్ల పెంపు ఉత్తర్వులను అమలు చేయలేకపోయారని వివరించారు. ఈ సమయంలో మాప్‌అప్ కౌన్సెలింగ్ చేయడం కష్ట సాధ్యమని చెప్పారు. హైకోర్టు ఆగ్రహ నేపథ్యం లో విచారణ మధ్యాహ్నానికి వాయిదా పడింది.

ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ సుదర్శన్‌రెడ్డి వాదిస్తూ.. సుప్రీంకోర్టు ఉత్తర్వులను తిరిగి సమీక్షించాలని ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసిందని చెప్పారు. సీట్ల భర్తీలో ఆచరణ రూపంలో సమస్యలు ఉన్నాయని చెప్పా రు. తాము ఆ ఉత్తర్వుల వివరాల్లోకి వెళ్లడం లేదని, కోర్టుధిక్కార పిటిషన్ వరకే పరిమితమై విచారణ చేస్తున్నామని స్పష్టంచేసింది.

ఇది కోర్టు ధిక్కరణ జరిగిందా? లేదా? అన్నదానిపైనే వాదనలు వింటామని చెప్పింది. కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోరాదో చెప్పాలని సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది.

ఈ నెల 23తో పెరిగిన సీట్ల భర్తీకి సు ప్రీం కోర్టు ఇచ్చిన గడువు ముగిపోతున్నందు న, ఆ సీట్ల పెంపునకు పిటిషనర్ల కాలేజీలకు అనుమతిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. చట్ట ప్రకారం కోర్టు ధిక్కరణకు పాల్పడిన అధికారులపై ఏ మేరకు శిక్ష విధించాలో తేల్చుతా మని వెల్లడించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.