calender_icon.png 25 December, 2024 | 8:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరుగేలేదు!

15-07-2024 12:05:00 AM

ఆఖరి టీ20లో యువభారత్ గెలుపు l 4-1తో సిరీస్ కైవసం

యంగ్‌ఇండియా అదరగొట్టింది. తొలి పోరులో జింబాబ్వే చేతిలో పరాజయం చవిచూసిన మన కుర్రాళ్లు.. ఆ తర్వాత సమష్టిగా కదంతొక్కి ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగారు. ఆఖరి ఆటలో బ్యాట్‌తో సంజూ శాంసన్, బంతితో ముఖేశ్ కుమార్ విజృంభించగా.. శివమ్ దూబే అటు బ్యాట్‌తో ఇటు బంతితో సత్తాచాటాడు. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత జట్టు 4 చేజిక్కించుకుంది. 

హరారే: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత యువ జట్టు.. జింబాబ్వేపై చివరి టీ20లోనూ విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఐదో మ్యాచ్‌లో యంగ్ ఇండియా 42 పరుగుల తేడాతో జింబాబ్వేను మట్టికరిపించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి పోరులో పరాజయం పాలైన యంగ్‌ఇండియా ఆ తర్వాత కలిసికట్టుగా కదంతొక్కి మిగిలిన అన్నీ మ్యాచ్‌లు నెగ్గి 4 సిరీస్ పట్టేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది.

సంజూ శాంసన్ (45 బంతుల్లో 58; ఒక ఫోర్, 4 సిక్సర్లు) అర్ధశతకంతో మెరవగా.. శివమ్ దూబే (26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), రియాన్ పరాగ్ (22) తలా కొన్ని పరుగులు చేశారు. గత మ్యాచ్‌లో దంచికొట్టిన కెప్టన్ శుభ్‌మన్ గిల్ (13), యశస్వి జైస్వాల్ (12; 2 సిక్సర్లు) ఎక్కువసేపు నిలువలేకపోయారు. జింబాబ్వే బౌలర్లలో ముజర్బాని రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో జింబాబ్వే 18.3 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. మయేర్స్ (34) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో ముఖేశ్ కుమార్ 4, శివమ్ దూబే రెండు వికెట్లు పడగొట్టారు. దూబేకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, సుందర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి. ఇక భారత జట్టు తదుపరి శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. 

సంక్షిప్త స్కోర్లు

భారత్: 20 ఓవర్లలో 167/6 (శాంసన్ 58; దూబే 26; ముజర్బాని 2/19), 

జింబాబ్వే: 18.3 ఓవర్లలో 125 ఆలౌట్ (మయేర్స్ 34, అక్రమ్ 27; ముఖేశ్ 4/22, దూబే 2/25).