తెలంగాణ రాష్ట్ర సాధనలో అలుపెరగని ఉద్యమకారుడిగా ముద్ర వేసుకున్నాడు. వినూత్న నిరసనలు, దీక్షలతో ఎంతోమందిని ఆకర్షించాడు. ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా అమరుడయ్యే వరకు ప్రజల కోసం పోరాటం చేశాడు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యమకారుడిగా గుర్తించలేదనే మనోవేదనతో మృతిచెందాడు కొమురయ్యగౌడ్.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన వెంగళ కొమురయ్యగౌడ్ కల్లు గీత కార్మికుడు. అయితే టీవీలు, ఫ్యాన్లు, గృహోపకరణాలు అమ్మి కుటుంబాన్ని పోషించేవాడు. అయితే కేసీఆర్ ప్రసంగాలకు ఆకర్షితుడై 150పైగా వినూత్న నిరసనలు చేపట్టి అలుపెరగని ఉద్యమకారుడిగా నిలిచిపోయాడు.
ప్రత్యేక రాష్ట్రంలో కొమురయ్య ఎలాంటి నామినేటెడ్ పదవులు దక్కకపోవడంతో 2023లో సెప్టెంబర్ 15న గుండెపోటుతో చనిపోయాడు. ఆయన మృతితో కుటుంబం రోడ్డునపడింది. కొమురయ్యకు భార్య నర్సవ్వ, కొడుకు మల్లేశం, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కొడుకు మల్లేశంగౌడ్ గల్ఫ్ దేశాలకు వలస వెళ్లి, ముగ్గురు చెల్లెళ్ల పెండ్లిలు చేశాడు. ప్రస్తుతం చిన్న కిరాణం కొట్టుపెట్టుకోని తల్లితో పాటు భార్య పిల్లలను పోషించుకుంటున్నాడు.
తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న కొమురయ్యగౌడ్ ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద ఆందోళనలు చేశాడు. ప్రత్యేక రాష్ట్రం కోసం 33 రోజుల పాటు ఆకాశ దీక్ష చేశాడు. ఆతర్వాత రుద్రంగి నుంచి వేములవాడ 25 కిలో మీటర్ల వరకు అర్ధనగ్న పాదయాత్ర చేశాడు. కాంగ్రెస్ పాలకుల తీరును నిరసిస్తూ గోతి తవ్వుకుని వినూత్న నిరసనకు దిగడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
తెలంగాణ మంత్రులు ఉద్యమంలో పాల్గొనాలంటూ వారంరోజుల పాటు నిరాహారదీక్ష చేపట్టాడు. అయితే ఎన్నో వినూత్న నిరసనలు చేపట్టిన కొమురయ్యగౌడ్‌ను అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. సీమాంధ్రుల పాలనలో ఎన్నో ఇబ్బందులు పడ్డామని, స్వరాష్ట్రంలో అవే ఇబ్బందులు పడుతున్నామని తీవ్ర ఆవేదనతో కన్నుమూశాడు.
శ్రీనివాస్, సిరిసిల్ల, (విజయక్రాంతి)
ఉద్యమమే ఊపిరిగా..
ఇరువై ఏళ్లుగా ఉద్యమం పేరుతో మమల్ని పట్టించుకోలేదు. ఉన్నదంతా ఉద్యమం కోసం ఖర్చుపెట్టిండు. నా కొడుకు గల్ఫ్‌కు వెళ్లి కుటుంబ భారం ఎత్తుకున్నాడు. ముగ్గురు ఆడబిడ్డల పెండ్లిలు చేశాడు. తెలంగాణ ఉద్యమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేసినా గుర్తింపు దక్కలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆదుకోవాలి.
భార్య నర్సవ్వ
కిరాణం కొట్టుతో..
నాన్న ఉద్యమానికి అంకితమై కుటుంబాన్ని పట్టించుకోలేదు. కుటుంబ భారం నా మీద పడటంతో దుబాయ్ వెళ్లి కొంత సంపాదించుకున్నా. ఇప్పుడు ఇంటి వద్దనే కిరాణం కొట్టుపెట్టుకున్నా. ఆడ పిల్లల పెండ్లిలకు చేసిన అప్పులు ఇప్పటికీ తీరలేదు. అమ్మ అనారోగ్యంతో బాధపడుతుం ది. కుటుంబ పోషణ కష్టంగా మారింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆదుకోవాలి.
వెంగళ మల్లేశంగౌడ్, కుమారుడు