- బీసీల గురించి మాట్లాడే హక్కు మీకు లేదు
- కులగణన ఆధారంగా సంక్షేమ పథకాలు
- మంత్రులతో ముఖాముఖిలో మంత్రి సీతక్క
హైదరాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): బీసీలకు అన్యాయం జరిగిందంటూ ఆరోపిస్తున్న బీఆర్‌ఎస్ లీడర్లు పార్టీ అధ్యక్ష పీఠాన్ని బీసీ నేతలకు ఇస్తారా అని మంత్రి సీతక్క ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణనను బహిష్కరించిన బీఆర్‌ఎస్‌కు ఇప్పుడు కులగణన లెక్కలు అడిగే హక్కులేదని, బీసీ సమాజం కూడా బీఆర్‌ఎస్‌ను ప్రశ్నించాలని మంత్రి సీతక్క సూచించారు.
బుధవారం గాంధీభవన్‌లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరై ప్రజలనుంచి వినతులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 20 ఏళ్లలో కనీసం ఒక్క బీసీనేతకు పదవి ఇవ్వలేదని, ఎదిగిన బీసీలను పార్టీ నుంచి బయటికి పంపారని ఆమె ఆరోపించారు.
ఆలే నరేంద్ర, ఈటల రాజేందర్ లాంటి బీసీ నేతలను అవమానించిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. ఇప్పుడు మా సర్వేను ప్రశ్నిస్తున్న బీఆర్‌ఎస్ నేతలు పదేండ్ల కాలంలో ఎందుకు సర్వే నిర్వహించలేదని ప్రశ్నించారు. మాజీమంత్రి తలసాని కులగణనలో ఎందుకు పాల్గొనలేదన్నారు.
తీన్మార్ మల్లన్న సంగతి పార్టీ చూస్తుంది
కులగణన సర్వే సరిగ్గా జరగలేదని ఆరోపిస్తున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపించడం సరికాదని, అభ్యంతరాలుంటే పార్టీ వేదికల మీద మాట్లాడాలే తప్ప బహిరంగంగా మాట్లాడటం సరికాదని సీతక్క హితవు పలికారు. ఆయన సంగతి పార్టీ చూసుకుంటుందన్నారు. ప్రజల సంతోషాన్ని చూసి ఓర్వలేక కులగణనను, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను కొందరు వక్రీకరిస్తున్నారని మంత్రి అన్నారు.
మంత్రులతో ముఖాముఖికి రెండోసారి వచ్చా..
ప్రజా సమస్యలపై గ్రామస్థాయిలో దరఖాస్తులను స్వీకరించడంతో పాటు గాంధీభవన్‌లోనూ మంత్రులుగా తాము దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, తాను రెండోసారి మంత్రులతో ముఖా ముఖి కార్యక్రమం కోసం గాంధీభవన్‌కు వచ్చినట్టు చెప్పారు. గతంలో ఏ పార్టీలో ఇలాంటి విధానాన్ని అవలంబించలేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రూ.21 వేల కోట్ల రుణాలను మాఫీ చేశామని, కేసీఆర్ హయంలో 2016లో తీసుకున్న రుణాలు లక్షల మంది రైతులకు మాఫీ కాలేదన్నారు. ప్రభుత్వ పథకాలు అమలు నిరంతర ప్రక్రియ అని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సీతక్క వివరించారు.