ప్రజాస్వామ్య వ్యవస్థ అనగానే ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు ఉంటాయన్న నమ్మకం ఉంది. అయితే, ఇందులో ప్రజాస్వామిక పాలన ఏ విధం గా ఉండాలన్న దాన్ని పాలకులు ఇప్పటివరకు నిర్ధారించుకోలేకపోతున్నారు. 1947 స్వాతంత్య్రం తరువాత ఏర్పడిన మొదటి ప్రజాస్వామిక పాలన వ్యవస్థలో లౌకిక రాజ్యాంగ వ్యవస్థకు లోబడి పాలన కొనసాగించారు. 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలకుల నిర్బంధ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించి ఎంతోమంది ప్రాణత్యాగాలవల్ల సాధించిన స్వాతంత్య్రం సోషలిజాన్ని లక్ష్యంగా చేసుకుంది.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలందరికీ సమాన ప్రాతిపదికన హక్కులను రాజ్యాం గం కల్పించింది. ఇందులో భాగంగానే నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా ప్రజా స్వామిక హక్కులతో పాలకులు చేస్తున్న తప్పిదాలను ఎప్పటికప్పుడు ఎండగట్టడానికి రాజ్యాంగం వీలుకల్పించింది. రాజ్యాం గాన్ని అడ్డం పెట్టుకొని పాలకులు చేస్తున్న అరాచకాలు సామాన్యులకు ఇబ్బందికరం గా ఉంటున్నాయి. చట్టం ముందు అంద రూ సమానులే కానీ, రాజ్యాంగ వ్యవస్థ కొద్దిమందికి అనుకూలంగా వ్యవహరిస్తోందని మేధావుల నుంచి విమర్శలు వినబడుతున్నాయి. నిర్బంధాలను ఛేదించుకొని ముందుకు పోతున్న సామాజిక వ్యవస్థపట్ల అధికారాన్ని చలాయించే రాజ్యం హింస మార్గాన పయనిస్తోంది. దీనివల్ల ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థలకు లోబడి పాలన లేదని చెప్పుకోవాలి. కాబట్టి, ఇప్పటికైనా పాలకులు ప్రజాస్వామిక విలువలను తెలుసుకొని రాజ్యాంగ వ్యవస్థకు లోబడి పని చేయాల్సి ఉం టుంది. అదే నిజమైన ప్రజాస్వామ్య పాల న అవుతుంది.
ప్రత్యక్ష, ప్రాతినిధ్య వ్యవస్థలు
రాష్ట్రంలోని సాధారణ జనాభాకు ప్రజాస్వామ్యపు నిర్వచనం ప్రకారం పాలకులు ఎన్నికల ద్వారా ఎన్నుకోబడతారు. అయితే మరింత విస్తృతమైన నిర్వచనాలు ప్రజాస్వామ్యాన్ని పోటీ ఎన్నికలతోపాటు పౌర స్వేచ్ఛలు , మానవ హక్కుల హామీలతో అనుసంధానిస్తాయి. ప్రత్యక్ష ప్రజా స్వామ్యంలో, చట్టాన్ని ఉద్దేశించి నిర్ణయించే ప్రత్యక్ష అధికారం ప్రజలకు ఉం టుంది. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ప్రజ లు అలా చేయడానికి ఎన్నికల ద్వారా పాలక అధికారులను ఎన్నుకుంటారు. ప్రజాస్వామ్య భావన కాలక్రమేణా గణనీయంగా అభివృద్ధి చెందింది. చరిత్ర అం తటా ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాక్ష్యాలను కనుగొనవచ్చు. చాలా ప్రజాస్వామ్యాలు చాలా సందర్భాలలో మెజారిటీ నియమాన్ని వర్తింపజేస్తాయి. అయితే, కొన్ని సందర్భాల్లో బహుళత్వ నియమం, సూప ర్ మెజారిటీ నియమం లేదా ఏకాభిప్రా య నియమం వర్తింపజేస్తారు. చాలా ఆధునిక ప్రజాస్వామ్య దేశాల్లో ఇది 19, 20 శతాబ్దాల ఓటుహక్కు ఉద్యమాల ద్వారా సాధించడం జరిగింది.
ప్రజాస్వామ్యానికి జన్మస్థలంగా భావిం చే పురాతన ఏథెన్స్‌లో ‘డెమోక్రసీ’ పదాన్ని మొదట ఉపయోగించారు. ఇది రెండు గ్రీకు పదాల కలయిక. అనేక శతాబ్దాలుగా ఆధునిక ప్రజాస్వామ్యాలు రూపు దిద్దుకున్నాయి. పౌరులు ఏకతాటిపైకి వచ్చి మంచి సమాజం కోసం కృషి చేశారు. ఈ ప్రజాస్వామ్య కథ నేటికీ కొనసాగుతోంది. ప్రపంచంలోని చాలా ప్రజాస్వామ్యాలు 100 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవి. పరిపూర్ణ ప్రజాస్వామ్య సమాజం అంటూ ఏదీ లేదు. వాస్తవానికి, ఇది పౌరులకు, ప్రభుత్వానికి మధ్య చక్కటి సమతుల్యత, వాటిమధ్య సమ్మిళితాలను సూచిస్తుంది. ఉదారవాద ప్రజాస్వామ్యాలలో ఒక ఉన్నత వర్గం ద్వారా అధికారం తరచుగా క్లెయిమ్ చేయడం జరుగుతుంది. మితిమీరిన పాలన సామాజిక ప్రజాస్వామ్యాలలో వ్యక్తిగత స్వేచ్ఛకు ఆటంకం కలిగి స్తుంది. కానీ, విజయవంతమైన ప్రజాస్వామ్యాలు ఎల్లప్పుడూ అభివృద్ధి చెందు తూనే ఉంటాయి.
జీవించే హక్కును కాలరాస్తే ఎలా?
ప్రజాస్వామ్య ప్రక్రియలో పౌరులందరికీ సమాన హక్కులు, బాధ్యతలతోపాటు దేశాభివృద్ధిలో కీలక భాగస్వామ్యం ఉన్నదని మరిచిపోకూడదు. ఉద్యోగులు, ఉపా ధ్యాయులు, కార్మికులు.. వృత్తులు ఏవైనా ‘తాము ముందు పౌరులం’ అనే విషయా న్ని మర్చిపోకూడదు. కనుక, అందరూ ఆ హక్కులు, బాధ్యతలు విధిగా తెలుసుకుంటే మంచిది. రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రకారంగా ప్రతి మనిషికీ జీవించే హక్కు ఉంది. ఈ క్రమం లోపల గౌరవప్రదంగా, న్యాయబద్ధంగా తమ హక్కులకోసం పోరాడుతూ దేశ సంపదను అనుభవించడానికి ఆస్కారం ఉం టుంది. అలాగని, జీవించే హక్కును కాల రాచే అధికారం ఎవరికి ఉండదు. కానీ, నిజ జీవితంలో గమనించినప్పుడు తమ కోసమే కాకుండా ప్రజలకోసం, పీడిత జనోద్ధరణ కోసం పనిచేస్తున్నటువంటి బుద్ధిజీవులు, ఉద్యమకారులు, మేధావులపైన ప్రభుత్వ దమనకాండ కొనసాగుతూ నే ఉంది. నేరాన్ని రుజువు చేయకుండానే దశాబ్దాలుగా జైళ్లలో మగ్గుతున్న వాళ్లు కూడా ఈ దేశంలో చాలా మంది ఉన్నా రు.
విప్లవ రచయితలు, ఉద్యమకారులు, ప్రజాస్వామిక వాదులు, న్యాయవాదులు, అధ్యాపకులు అనేక రంగాలలో పనిచేస్తున్న వాళ్లు తమ వృత్తిని కొనసాగిస్తూనే మరోవైపు ప్రవృత్తిగా ప్రజల హక్కులకోసం పోరాడుతుంటారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వాన్ని తిప్పి కొట్టడంలో క్రియాశీల భూమిక పోషించిన అనేకమందిని చరిత్రలో చూడవచ్చు. విప్లవ రచయిత, బూటకపు కుట్ర కేసులో నిర్బంధితుడిగా జైలు పాలైన వరవరరావు ముందు పౌరులు, ఆ తర్వాత ఉద్యోగులం అని భరోసా ఇచ్చిన విషయాన్ని మర్చిపోకూడదు. రాజ్యహింసకు బలైన ప్రొ. సాయిబాబా, గౌరీ లంకేశ్, ధబోల్కర్, పన్సారి సహా వేలాదిమంది నుండి స్ఫూర్తి పొంది మనీషిగా బతకడం గర్వంగా భావించాలి.
నేరం చేసిన వాళ్లు మాత్రమే నేరస్థులు కాదు. నేరం జరుగుతున్నప్పుడు, చేయని నేరాన్ని నేరంగా చిత్రీకరిస్తున్నప్పుడు, నిర్బంధాలు అమలు చేస్తూ ప్రాథమిక హక్కులను వంచించినప్పుడు నిశితంగా పరిశీలించి, పరిశోధించ డం మరిచిన ప్రతి వాళ్ళుకూడా నేరస్థులే అవుతారు. ప్రజల కోణంలో వారికి అందాల్సిన ఫలాలను రాజ్యాంగబద్ధంగా అందించడానికి అడ్డుగా వున్న ప్రభుత్వాల దమననీతిని ప్రశ్నించడానికి, నేర చరిత్ర గలవాళ్ళు చట్టసభల్లో రాజ్యపాలనలో కొనసాగుతున్నప్పుడు ప్రజలను బానిసలుగా చేస్తున్న పాలకవర్గాల చట్టవ్యతిరేక చర్యలను తిప్పి కొట్టడానికి ప్రతి ఒక్కరు కూడా సమాజ కార్యకర్తగా మారాల్సిన అవసరం ఎంతగానో ఉంది.
మానవీయ స్పృహను పెంపొందించుకుందాం!
ఇప్పటికీ సమాజంలో ఉన్నత స్థాయి లో ఉండికూడా సామాజిక చింతన లేని కారణంగా ‘ఈ వ్యవస్థ గురించి మనకెందుకులే’ అని భావించే వాళ్లను మనం ఎక్కువ సంఖ్యలో చూడవచ్చు. అదే సందర్భంలో కాయకష్టం చేసి ‘అన్నమో రామచంద్ర’ అంటూ అలమటించే పేదవర్గాలతోపాటు కిందిస్థాయిలో పనిచేసే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులలో సామాన్య ప్రజా నీకం శ్రేయస్సును ఆకాంక్షించే వాళ్లు కూడా ఉంటారు. ప్రభుత్వ అసంబద్ధ విధానాలను, పాలకుల నిరంకుశ ధోరణిని, పెట్టుబడిదారీ భూస్వామ్య వర్గాల సాచివేత వైఖరిని, నేర చరిత్ర కలిగిన వాళ్ళ గూండాయిజం, రౌడీయిజం, అరాచక త్వం, అత్యాచారాలు, హత్యలు వంటి దురాగతాలను తుదముట్టించి ‘యుద్ధం తర్వాత శాంతిని సాధించినట్లు’గా సర్వమానవాళి సంక్షేమాన్ని, ప్రయోజనాన్ని, సార్థక జీవితాన్ని ఆశించడం ద్వారా మన జీవితాలకు కూడా సార్థకతను కల్పించుకో వాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం మనుషులుగా మిగిలిపోతాం. లేకుంటే మానవత్వాన్ని మరిచిన నిర్జీవులుగా చరిత్రకు ఎక్కుతాం.