calender_icon.png 16 November, 2024 | 9:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నియంతలకు గుణపాఠం తప్పదు

05-07-2024 12:00:00 AM

సుంకవల్లి సత్తిరాజు

అహంకారం, నియంతృత్వం ప్రజాస్వామ్య మూలసూత్రాల కు విరుద్ధం. ఈ రెండు అవలక్షణాలు రాజకీయాల్లోకి చాపకింద నీరులా వచ్చి చేరా యి. తత్ఫలితంగానే రాజకీయం ఒక రణరంగంగా పరివర్తన చెందింది. పదవులు శాశ్వతమని భ్రమించి, ప్రత్యర్థులను వేధించడం వల్ల జరిగే పరిణామాలు ప్రజా జీవితంలో ప్రశాంతమైన వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. శతాబ్దాల తరబడి సాగిన పరాయి పాలకుల ఏలుబడిలో నలిగి నుజ్జయిన భారతీయుల స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఎంతోమంది మహనీయుల స్వార్థమెరుగని సుదీర్ఘ పోరాటాల ఫలితంగా తిరిగి ఊపిరి పోసుకున్నాయి. స్వేచ్ఛకోసం తమ ఊపిరిని ఉరికంబ మెక్కించిన వీరుల త్యాగాలకు ప్రతిరూప మే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్య్రాలు. అయితే, నాటి వీరులు మనకందించిన పోరాట స్ఫూర్తి ఏమై పోతున్నదని ప్రశ్నించుకుంటే రాజకీయ రావణ కాష్ఠంలో దగ్ధమైపోతున్నదన్న చెప్పవలసి వస్తుంది. 

హుందాతనం ఎక్కడ?

వర్తమాన రాజకీయాలు హుందాతనా న్ని కోల్పోతున్నాయి. ప్రశాంతంగా సాగవలసిన ప్రజాజీవితాలు సంకుచిత రాజకీ య రంగులు పులుముకుంటున్నాయి. ప్రజల మధ్య కార్చిచ్చు రగిలిస్తున్నాయి. ఫలితంగా ప్రజలు కుల, మత, ప్రాంత, వర్గాలుగా విడిపోతున్నారు. అయితే, ఎక్క డో ఒకచోట ప్రజాస్వామ్య స్ఫూర్తి కనిపిస్తున్నది. ప్రజాస్వామ్య పునాదులు ధ్వంసం కాకుండా  పోరాటం జరుగుతున్న భావన కలుగుతున్నది. ప్రజా చైతన్యం పెల్లుబికి రాజకీయాలు శాశ్వతం కాదని, అధికారం ప్రజల విచక్షణపై ఆధారపడి ఉంటుందన్న సత్యం నిరూపణవుతున్నది. ప్రజలు బానిసలు కారని, పాలకులు ప్రజాస్వామ్యాన్ని హరిస్తే ఎదురు తిరిగి, ఓటుహక్కుతో గుణపాఠం చెప్తారని పాలకులు గుర్తించాలి.

ఎంతోమంది నాయకులు మన దేశాన్ని పాలించారు, పాలిస్తున్నారు. ప్రజాప్రతినిధులు ప్రజాభీష్టానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే వారిని ఎన్నికల్లో  మార్చగలిగే వ్యవస్థలో మనమున్నాం. అయినా, అధికారం శాశ్వతమని భ్రమించే ధోరణి మాత్రం రాజ కీయాల్లో కొనసాగుతూనే ఉంది. ఐదేళ్లు, పదేళ్లు భరించి, ప్రజలు ఇలాంటి పాలకులను మార్చేస్తున్నారు. ఒక్కోసారి మెజారి టీని తగ్గించి పాలకుల దూకుడుకు పగ్గాలు వేస్తున్నారు. ఇటీవల దేశంలో జరిగిన లోక్‌సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరు ణాచల్‌ప్రదేశ్, సిక్కిం శాసనసభలకు జరిగిన ఎన్నికలు భారతీయుల ప్రజాస్వామ్య స్ఫూర్తిని, పోరాట పటిమను ప్రతిబింబిం పచేశాయి. ఓటు వేయడానికి ఆసక్తి చూప ని పరిస్థితుల్లో ఇటీవల ఆంధ్రప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పెరిగిన ఓటింగ్ శాతం రికార్డు సృష్టించింది. 

అంచనాలు తలకిందులు

సార్వత్రిక ఎన్నికల్లో 64 కోట్లమందికి పైగా ఓటుహక్కును వినియోగించుకుని ప్రపంచ రికార్డు సృష్టించి ప్రజాస్వామ్యా న్ని పునరుజ్జీవింప చేశారు. ఎన్నికల ఫలితాలు కూడా ‘అధికారం శాశ్వతమని భ్రమించిన నాయకులకు కనువిప్పు కలిగించాయని’ మేధావులు, విశ్లేషకులు అభి ప్రాయ పడుతున్నారు. రాజకీయ రణరంగంలో కత్తులు దూసిన కాకలు తీరిన యోధుల రాజకీయ పంథా ఎలా ఉండా లో ఎన్నికలు నిర్దేశించాయి. ప్రజాస్వామ్యానికి సరైన నిర్వచనం చెప్పాయి. దేశ వ్యాప్తంగా ఎందరో నాయకుల ఆశలను తలకిందులు చేశాయి. 

ప్రజాభీష్టాన్ని గౌరవించని పాలకులను ఓటర్లు ఇంటికి పంపారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ప్రజాతీర్పు పాత పాలకులకు వ్యతిరేకంగా రావడం, సంస్కరణవాదిగా పేరొందిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జైలు పాలై నా ప్రజల్లో మచ్చుకైనా సానుభూతి కానరాకపోవడం ప్రజల విచక్షణా శైలిని సూచిస్తున్నది. ప్రజల నాడిని సరిగ్గా అంచ నా వేయని సర్వే సంస్థల విశ్వసనీయత కూడా ప్రశ్నార్థకమవుతున్నది. తప్పుడు గణాంకాలతో ప్రజలను బెట్టింగులకు పురిగొల్పి, లక్షలు, కోట్లు నష్టపోయేలా, ఆస్తు లు కోల్పోయేలా చేస్తూ, జీవితాలను తలకిందులు చేస్తున్న ఆ సంస్థలపై చట్టబద్ధ చర్యలు తీసుకోవాలి. భారతదేశంలో ఏడు దశల్లో సుదీర్ఘంగా సాగిన ఎన్నికల ప్రక్రి య తీవ్ర ఉత్కంఠను రేకెత్తించింది. 

ఈవీఎంలలో నిక్షిప్తమైన ప్రజాభిప్రాయం బహిర్గతం కావడానికి చాలా రోజులు వేచి చూడవలసి వచ్చింది. ఎన్నికలకు ముందు, తర్వాత కొన్నిచోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి, పిమ్మట వాతావరణం చల్లబడింది.

పెరుగుతున్న ధన ప్రభావం

ఓటర్లు రాజకీయ పక్షాల ప్రలోభాలకు, మద్యానికి, డబ్బుకు లొంగిపోతే పాలకులు చేసే తప్పులను ఎదిరించే నైతిక హక్కును కోల్పోతామన్న సంగతి ఇంకా ప్రజల మెదళ్ళకు సోకలేదు. ఇటీవలి ఎన్నికల్లో డబ్బు ప్రభావం బాగా కనిపించింది. అయితే, కొన్నిచోట్ల డబ్బు తీసుకుని కూడా ఓట్లు వేయని పరిస్థితి కనిపించిన ట్లు తెలుస్తున్నది. ప్రతీ పౌరుడు దేశభక్తిని అలవరచుకుని, ప్రజాస్వామ్య స్ఫూర్తితో, న్యాయబద్ధంగా జీవిస్తూ, దేశ, రాష్ట్ర ప్రయోజనాల కోసం శ్రమించాలి. తాత్కాలిక ఉపశమనాలవల్ల దీర్ఘకాలిక ప్రయో జనాలు దెబ్బ తింటాయి. అర్హులకు తగిన ప్రోత్సాహకాలు ప్రభుత్వాలు అందించాలి.

ఉచిత విద్య, వైద్య సదుపాయాలు అందరికీ కల్పించాలి. శుద్ధమైన తాగునీరు సర ఫరా చేయాలి. వ్యవసాయానికి వున్న ప్రాధాన్యం దృష్ట్యా రైతులకు సకాలంలో సాగునీరు అందించడానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాలి. ఉచిత పథకాల పేరుతో లక్షల కోట్లు ఖర్చు చేయడం, అప్పుల భారాన్ని ప్రజలపై వివిధ రూపా ల్లో రుద్దడం అవాంఛనీయం. రాజకీయ పార్టీలు శాశ్వతం కాదు, అధికారం అంతకంటే శాశ్వతం కాదు. అశాశ్వతమైన పదవులతో, అధికారంతో ప్రజల ను ఇబ్బంది పెట్టడంలో ఎలాంటి ఔచి త్యం లేదు. అధికారం అలంకారం కాదు. దానితో అహం కారం ఏర్పడితే అది అంతిమంగా నియంతృత్వానికి  దారితీస్తుంది.

ఈ విషయాన్ని గ్రహించే ఎంతోమంది మేధావులు భారతదేశానికి ప్రజాస్వామ్య విధానమే శ్రేయస్క రమని భావించి, ప్రజలకోసం అనేక వ్యవస్థలను, యంత్రాంగాలను ఏర్పరిచారు. అయితే, మన శ్రేయస్సుకోసం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తే, జరిగే పరిణామాలు అత్యంత భయానకంగా ఉంటాయి. ప్రజాభీష్టానికి అనుగు ణంగా నడచుకోని పాలకులు ప్రజాగ్రహానికి గురికాక తప్పదనే హెచ్చరికలు చేస్తూ, ప్రతీ ఐదు సంవత్సరాల కొకసారి పాలకులను మార్చడానికి లేదా కొనసాగించడాని కి ఎన్నికలు జరుగుతుంటాయి.

సేవా స్పృహ పెరగాలి

రానురాను ప్రజాస్వామ్యం మేడిపండులా మారుతున్న లక్షణాలు కనిపిస్తు న్నాయి. ఎన్నికల్లో హింస చోటు చేసుకోవడం, అల్లర్లు చెలరేగడం, రాజకీయ పార్టీ లపై అభిమానంతో ప్రజలమధ్య సుహృద్భావ వాతావరణాన్ని చెడగొట్టడం, అమాయకులను రాజకీయ కక్షలతో వేధించడం ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నది. ప్రధాని, ముఖ్యమం త్రి, మంత్రులు, ఇతర  ప్రజాప్రతినిధులు కేవలం ప్రజాభిప్రాయం మేరకు నిర్దిష్టమై న కాలపరిమితికి ఎన్నికైన ప్రజా సేవకులు మాత్రమే. పాలించడమంటే శాసించడం కాదు, ప్రజలకు సేవ చేయడమే అన్న స్పృహ కలిగి ఉండాలి. ప్రజాభిప్రాయాన్ని పాలకులు గుర్తించి, తమ విధానాలను మార్చుకుని ప్రజలతో సన్నిహిత సంబంధాలు నెలకొల్పుకోవాలి. గెలుపు గర్వాన్ని తెచ్చి పెడితే, ఓటమి ప్రతీకారాన్ని రగిలిస్తే ప్రజాస్వామ్య దేశంలో ప్రజల హక్కులకు రక్షణ ఉండదు.

వ్యాసకర్త సెల్: 9704903463