calender_icon.png 18 March, 2025 | 4:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధర్పల్లి కుంట కబ్జా!

17-12-2024 12:00:00 AM

  1. రూ.12.60 కోట్ల భూమిపై కాంగ్రెస్ నేత కన్ను
  2. కుంటలో మొరం నింపి చదును

నిజామాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా ధర్పల్లి గ్రామంలో కబ్జారాయుళ్లు రెచ్చిపోతున్నారు. గ్రామంలో రూ.12.60 కోట్ల విలువ చేసే కుంటపై కన్నేసిన ఓ కాంగ్రెస్ నాయకుడు చదును చేసే పనిని మొదలుపెట్టాడు. గ్రామంలోని పశువుల కుంట భూమి కబ్జాకు ప్లాన్ వేశాడు. మొరం తరిలించి కుంటలో నింపుతున్నట్టు ఆరోపణలున్నాయి.

ధర్పల్లి గ్రామంలోని షాదీఖానా రోడ్డుకు అటువైపు ఉన్న ఈ కుంట గత 50 ఏళ్లకు పైగా పశువుల దాహార్తి తీర్చడం కోసం, పంటల సాగు కోసం, మత్య్సకారుల జీవనోపాధి కోసం ఉపయోగించిన ఈ కుంట ఇక రియల్‌ఎస్టేట్ లేఅవుట్‌గా మారబోతోంది. ఆ పక్కనే ఉన్న కొంత ప్రైవేటు పట్టా భూమికి తోడుగా కుంటను చేర్చి పక్కా ప్రణాళికలతో  కబ్జా చేస్తున్నట్టు సమాచారం.

ఐదెకరాలకు పైగా విస్తీర్ణంలో గల ఈ భూమిని  ట్రాక్టర్ల ద్వారా మొరం నింపి చదును చేస్తున్నట్టు తెలుస్తున్నది. మండల కాంగ్రెస్ నేత కన్ను సన్నల్లోనే ఇదంతా జరుగుతున్నట్లు తెలుస్తున్నది. సంవత్సరాల తరబడి కుంటగా ఉన్న ఈ స్థలాన్ని ప్రభు త్వ కార్యాలయాల సెలవు దినాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా జేసీబీ, ట్రాక్టర్ల సహాయంతో మొరంతో నింపుతున్నారు.

ప్రశ్నించిన గ్రామాభివృద్ధి కమిటీ పెద్దల్లో చిచ్చుపెట్టి రెండుగా చీల్చా డు. ప్రశ్నించిన గ్రామస్తులను బెదిరిస్తున్నాడు. మరికొందరు చోటామోటా లీడర్లను, అధికారులను కరెన్సీ కట్టలతో నోరు మూయిస్తున్నాడు. బడా నాయకుల అండతోనే ఈ తతంగం అంతా నడిపిస్తున్నట్లు ధర్పల్లి గ్రామంలో చర్చ జరుగు తోంది. గ్రామ పంచాయతీ అధికారులు ఈ కుంట కబ్జా గురవుతున్నా స్పదించకపోవడం శోచనీయం. 

లే అవుట్లలో వాటా!

కుంటపై గ్రామంలోని ఓ సామాజిక వర్గానికి చెందిన సొసైటీకి హక్కులు ఉండగా లేఅవుట్లో సగభాగాన్ని వాళ్లకు ఇస్తానని సదరు కాంగ్రెస్ నేత ఒప్పందం కుదుర్చుకున్నట్లు విశ్వాసనీయ సమాచారం. దీంతో ఈ సామాజిక వర్గం కుంట భూమి కబ్జాపై మాట్లాడటం లేదని తెలుస్తున్నది. ఈ సామాజిక వర్గానికి చెందిన ఒకరు గ్రామ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. కబ్జా విషయమై అతను ప్రశ్నించడంతో గ్రామభివృద్ధి కమిటీ నుంచి తప్పించాడు. 

కబ్జా చేస్తే చర్యలు తప్పవు

ధర్పల్లి కుంట కబ్జా అవుతున్నట్టు మా దృష్టికి కూడా వచ్చింది. ప్రస్తుతం గ్రూప్ పరీక్ష నిర్వహణలో ఉన్నాం. గ్రామాధికారిని పంపి వివరాలు తెలుసుకుంటాం. ధర్పల్లి గ్రామంలోని కుంట పక్కనే కొందరి పట్టా భూములు కూడా ఉన్నాయి. అయితే పట్టా భూముల మాటున కుంట భూమి కబ్జా అయినట్లుగా తేలితే.. కబ్జాదారులపై కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటాం. 

మాలతి, తహసీల్దార్