19-09-2024 12:37:36 AM
రంగారెడ్డి, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): పెండింగ్ పాల బిల్లులను వెంటనే చెల్లించాలని కోరుతూ బుధవారం పాడిరైతులు ధర్నాకు దిగారు. బిల్లుల చెల్లింపులో విజయ డెయిరీ అధికారులు జాప్యాన్ని నిరసిస్తూ ఆమనగల్లు పట్టణంలోని హైదరా బాద్ జాతీయ రహదారిపై రోడ్డుపై పాలను పారబోసారు. వీరికి స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. వ్యవసాయానికి అనుబంధంగా పాల ఉత్పత్తితో జీవనోపాధి పొందుతున్న తాము ప్రతినిత్యం గ్రామాల్లో విజయ డెయిరీకి పాలను పోస్తున్నట్లు తెలిపారు. గతంలో పాలబిల్లులు 15 రోజుల ఒక్కసారి వచ్చేవన్నారు. కానీ ఇప్పుడు వేస్తాం... అప్పుడు వేస్తాం అంటూ అధికారులు దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారని రైతులు ఆవేద న వ్యక్తం చేశారు. సింగిల్ విండో చైర్మన్ గంప వెంకటేశ్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు సకాలంలో పాలబిల్లులు అందేవని అన్నారు. అనంతరం రైతులు, నేతలు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.