calender_icon.png 26 October, 2024 | 6:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబాల ధర్నా

26-10-2024 12:20:44 AM

సెలవులపై గతంలో ఇచ్చిన జీవోను తాత్కాలికంగా నిలిపివేసిన ప్రభుత్వం 

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 25 (విజయక్రాంతి): గతంలో ఉన్న సెలవుల మాన్యువల్‌ను ప్రభుత్వం మార్పు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే పలు బెటాలియన్ల వద్ద నిరసనలు చేపట్టిన బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు శుక్రవారం సచివాలయం ముట్టడికి యత్నించారు.

ఈ సందర్భంగా ఒకే పోలీస్ విధానం ఉండాలని, సెలవుల మార్పును వెనక్కి తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం గతంలో ఇచ్చిన జీవోను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు అదనపు డీజీపీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

గత ప్రభుత్వంలో బెటాలియన్ కానిస్టేబుళ్లు 15 రోజులకు ఒకసారి సెలవుపై వెళ్లే అవకాశం ఉండగా, ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిబంధనలను మార్చి కొత్త లీవ్ మాన్యువల్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో 26 రోజులకు ఒకసారి సెలవుపై వెళ్లాల్సి రావడాన్ని బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ కొన్నాళ్లుగా ఆందోళనకు దిగారు. 

3 కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్ 

కొండాపూర్ 8వ బెటాలియన్ పోలీసు కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు శుక్రవారం కొండాపూర్ సిగ్నల్ వద్ద ఆందోళన చేపట్టారు. పోలీస్ వ్యవస్థలో ఒకే విధానం ఉండాలని వారు డిమాండ్ చేశారు. వారి ఆందోళనతో సుమారు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.