ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తహశీల్దార్ కు వినతి
మందమర్రి,(విజయక్రాంతి): రాష్ట్రంలోని నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈ బీసీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి వారికి కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ధర్మ సమాజ్ పార్టీ నాయకులు తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ధర్మాసమాజ్ పార్టీ మండల నాయకులు నందిపాట రాజ్ కుమార్ మాట్లాడుతూ... రాష్ట్రంలో 90% పైన పేద, మధ్యతరగతి వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈ బీసీ వర్గాల ప్రజలు సుమారు ఒక కోటి కుటుంబాలు ఉన్నాయని విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు వంటి ప్రధాన సమస్యలతో సతమతమవుతున్నారని వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్యను అందించాలని, నాణ్యమైన ఉచిత వైద్యం అందించాలని,ఉపాధి అవకాశాలు కల్పించాలని, అర్హులైన వారందరికీ సాగునీటి సౌకర్యంతో ఒక ఎకరం వ్యవసాయ భూమిని కేటాయించాలని, అర్హులైన వారందరికీ 200 గజాల స్థలంతో నాలుగు గదుల ఇల్లును నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఐదు పథకాలకు పూలే, అంబేడ్కర్, సాహు మహారాజ్, కాన్షిరాంల పేర్లు పెట్టి ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు.ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కల్లూరి క్రాంతి కుమార్, జాడి తిరుపతి, రవిలు పాల్గొన్నారు.