calender_icon.png 23 October, 2024 | 3:55 AM

ధరణి ఎన్‌ఐసీకి

23-10-2024 02:12:40 AM

  1. మూడేండ్ల పాటు భూరికార్డుల నిర్వహణ
  2. ఉత్తర్వులు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం 
  3. సాంకేతిక సహకారం అందించాలని టెర్రాసిస్‌కు సూచన

హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 22 (విజయక్రాంతి): టెర్రాసిస్ అలియాస్ క్వాంటెల నుంచి ధరణి పోర్టల్‌కు విముక్తి లభించింది. ధరణి నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్‌ఐసీ) కి అప్పగించింది. ఈ మేరకు ప్రభు త్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ధరణి అమల్లోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణలో భూ రికార్డులను టెర్రాసిస్ సంస్థ నిర్వహిస్తోంది. అయితే 2024 అక్టోబర్ 29తో టెర్రాసిస్ గడువు ముగియనుంది. రెవెన్యూ అధికారులతోపాటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యునికేషన్, తెలంగాణ టెక్నికల్ సర్వీసెస్ విభాగాల అధికారులు ఇటీవల సమావేశమై తెలంగాణ భూ రికార్డుల నిర్వహణను ఎన్‌ఐసీకి అప్పగించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు.

తెలంగాణ మినహా దేశంలోని 28 రాష్ట్రాల్లోను భూ రికార్డుల నిర్వహణ బాధ్యతలను ఎన్‌ఐసీనే నిర్వహిస్తున్నది. ఈ క్రమంలోనే డిసెంబర్ 1 నుంచి మూడేళ్లపాటు ధరణి పోర్టల్‌ను నిర్వహించేలా ఎన్‌ఐసీతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అక్టోబర్ 29తోనే టెర్రాసిస్ గడువు ముగుస్తున్నప్పటికీ, టెర్రాసిస్ నుంచి ఎన్‌ఐసీకి డేటా, మెయింటనెన్స్ వర్కు ట్రాన్స్‌ఫర్ చేసేందుకు ప్రభుత్వం ఒక నెల గుడువు ఇచ్చింది.

అలాగే భూరికార్డుల నిర్వహణలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఎన్‌ఐసీకి ట్రాన్సిషన్ పీరియడ్‌ను రెండు నెలలు ఇచ్చినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందులో ఒక నెల టెర్రాసిస్‌కు ఎక్స్‌టెన్షన్ ఇవ్వడంతో 2024 డిసెంబర్ 1 నుంచి రాష్ట్రంలో భూ రికార్డులను ఎన్‌ఐసీ నిర్వహించనుంది. 

25న కీలక సమావేశం 

ధరణి ప్రాజెక్టును ఎన్‌ఐసీకి అప్పగించేందుకు ప్రభుత్వం ఈ నెల 25న ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్య అధికారులత పాటు టెర్రాసిస్, తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ (టీజీటీఎస్), నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ) అధికారులు పాల్గొననున్నారు. 

ధరణి సమస్యలకు త్వరలోనే మోక్షం: మంత్రి పొంగులేటి

రాష్ట్రంలో ధరణి కారణంగా ఉత్పన్నమైన భూ సమస్యలన్నింటికీ త్వరలోనే మోక్షం లభిస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. టెర్రాసిస్ ఆధీనంలోని ధరణిని ఎన్‌ఐసీ అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

విదేశీ సంస్థ టెర్రాసిస్ ఆధీనంలో ఉన్న ధరణిని స్వదేశీ ప్రభుత్వ సంస్థకు అప్పగించామని తెలిపారు. ధరణి సమస్యల నుంచి రైతులకు త్వరలోనే పూర్తి విముక్తి కల్పిస్తామని పేర్కొన్నారు. నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం లోని పెద్దలు ముందు చూపు లేకుండా తీసుకువచ్చిన ధరణి డిజిటల్ పోర్టల్ వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు.

తెలంగాణలోని 1.56 కోట్ల ఎకరాల విస్తీర్ణం గల భూమిని విదేశీ కంపెనీకి తాకట్టు పెట్టారని అన్నారు. ఒడిశాలో టెర్రాసిస్ విఫలమైనప్పటికీ.. నాటి సీఎం కేసీఆర్ స్వార్థ ప్రయోజనాల కోసం అదే కంపెనీకి బాధ్యతలను అప్పగించారని ఆరోపించారు.

దీంతో ఐదేళ్లుగా రైతులు నానా అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌ఐసీకి ధరణిని అప్పగించామని తెలిపారు. 71 లక్షల ఖాతాలు కలిగిన రైతుల భూములకు పూర్తి రక్షణ లభించినట్లయిందని స్పష్టంచేశారు.