calender_icon.png 7 November, 2024 | 6:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమాల పుట్ట ‘ధరణి’

03-08-2024 05:32:39 AM

బీజేపీ ఎల్పీ ఏలేటీ మహేశ్వర్‌రెడ్డి 

హైదరాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): ధరణి అక్రమాల పుట్ట అని బీజేపీ ఎల్పీ ఏలేటీ మహేశ్వర్‌రెడ్డి అభివర్ణించారు. ధరణిపై శుక్రవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. బీఆర్‌ఎస్ నేతలను కాపాడటానికి కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ధరణి ద్వారా బీజేపీ నేతలు లక్షల ఎకరాల భూములను కాజేశారని పీసీసీ అధ్యక్షుడిగా నాడు రేవంత్ రెడ్డి ఆరోపించారని, సీఎం అయ్యాకైనా తమపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. నిజమైన కబ్జాదారులు ‘కేసీఆర్ అండ్ టీం’ అని ఆరోపించారు. వారు కబ్జా చేసిన లక్షలాది ఎకరాల భూములను స్వాధీనం చేసుకుని, వాటి ద్వారా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారని, ఆ వ్యవహారం ఎంతవరకు వచ్చిందో సీఎం రేవంత్ బదులివ్వాల్సిన అవసరం ఉందన్నారు.

రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి భూసమస్యలకు పరిష్కారం చూపించాలని తాము డిమాండ్ చేస్తున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిషేధిత జాబితాలో చేర్చిన పట్టా భూములను తొలగిస్తామని చెప్పిందని, మరి అధికారంలోకి వచ్చినా ఎందుకు అమలు చేయడం లేదని విమర్శనాస్త్రాలు సంధించారు. బీఆర్‌ఎస్ పాలనలో సుమారు రూ.2 లక్షల కోట్లు విలువ చేసే వేల ఎకరాల భూమి అన్యాకాంత్రం అయ్యిందని ఆరోపించారు. ఈ స్కాం దేశంలోనే అతిపెద్ద కుంభకోణమవుతుందన్నారు. స్కాంను వెలికితీసే చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం వెంటనే విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.