calender_icon.png 22 October, 2024 | 7:19 AM

‘రాయన్’తో ధనుష్ దర్శకుడిగా జాతీయ పురస్కారం గెలవాలి

23-07-2024 12:05:00 AM

“నటుడిగా, నిర్మాతగా జాతీయ పురస్కారాలు అందుకున్న ధనుష్.. ‘రాయన్’ సినిమాతో దర్శకుడిగా జాతీయ అవార్డు గెలుచుకోవాలని కోరుకుంటున్నా” అన్నారు కథానాయకుడు సందీప్ కిషన్. ధనుష్ నటిస్తూ దర్శకత్వం వహించిన ‘రాయన్’ సినిమాలో సందీప్ కీలక పాత్రలో కనపడనున్నారు. ప్రకాశ్ రాజ్, కాళిదాస్ జయరామ్, అపర్ణ బాలమురళి, దుషారా విజయన్ ఇతర తారాగణంతో రూపొందిన ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ స్వరకర్త. నటుడిగా ధనుష్ 50వ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా జూలై 26న విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేయగా,  హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి నిర్మాతలు దిల్ రాజు, సురేశ్‌బాబు, సునీల్ నారంగ్, దర్శకుడు గోపీచంద్ మలినేని అతిథులుగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ధనుష్ మాట్లాడుతూ “సెల్వ రాఘవన్, వెట్రిమారన్  వంటి దర్శకులతో పనిచేసే అవకాశం నాకు దొరికింది. ఈ విషయంలో నేను అదృష్టవంతుడిని. నాతో సినిమాలు చేసిన దర్శకులందరికీ ధన్యవాదాలు. వాళ్లందరి దగ్గర నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నా తప్పుల నుంచి కూడా ఎంతో నేర్చుకున్నా. దర్శకత్వం చాలా బాధ్యతతో కూడుకున్నది. నటనపైన నాకు ఎంత ఇష్టం ఉందో దర్శకత్వంపైనా అంతే ఇష్టముంది. నేను దర్శకత్వం వహించిన రాయన్ 26న వస్తోంది. ఇది నా 50వ చిత్రం. దీనిని ఓ ఆశీర్వాదంగా భావిస్తున్నాను” అన్నారు. “ఈ సినిమాలో నన్ను  నటించమని అడిగినప్పుడే అదొక అవార్డ్‌లా ఫీల్ అయ్యా. ధనుష్ అన్న నాకు ఒక బ్రదర్ అండ్ గురువు లాంటి వారు.

తనకోసం రాసుకున్న క్యారెక్టర్‌లో నన్ను యాక్ట్ చేయమని ఆయన డైరెక్ట్ చేశారు. ఇంతకంటే నాకు గొప్ప అవార్డ్ ఉండదు. ఫిల్మ్ అకాడమీల్లోనూ చెప్పని ఎన్నో కొత్త విషయాలు నేర్పించారు. ప్రకాశ్ రాజ్ గారితో కలిసి నటించడం కూడా గొప్ప అనుభూతి. రెహమాన్ గారు నాకో పాటిచ్చారు” అని సందీప్ ఈ సినిమాతో ఉన్న తన అనుభవాలను పంచుకున్నారు. ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ “కళాకారుడు తన ప్రతిభ వల్లే పెద్దవాడు కాలేడు, ప్రేక్షకుల ప్రేమ, నమ్మకం వలన అవుతాడు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ధనుష్ ఆ కోవలోనివాడే.

సందీప్ కిషన్, కాళిదాస్, అపర్ణ, దుషారా వంటి యువ ప్రతిభను ఎలా బయటకి తీయాలో నటుడిగా ఆయనకు బాగా తెలుసు. ఈ ప్రస్థానంలో ఎన్నో పాత్రలు చేస్తూ తన పనితో మరింత మెరుగవ్వటం చూస్తున్నాం. ధనుష్‌కి దర్శకుడిగా చాలా స్పష్టత ఉంది. అది దర్శకుడికి ఎంతో అవసరం” అన్నారు. ఏషియన్ సురేశ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పీ సంస్థ తెలుగులో ఈ సినిమాని విడుదల చేయనుంది.