calender_icon.png 27 October, 2024 | 2:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పసిడికి ధన్‌తేరస్ కళ!

27-10-2024 01:10:00 AM

ఆఫర్లను ప్రకటించిన జ్యూవెల్లరీ షాపులు

ధన త్రయోదశి రోజు బంగారం కొంటే కలిసొస్తుందని ప్రజల విశ్వాసం

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 26(విజయక్రాంతి): గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. శనివారం హైదరాబాద్‌లో 1 గ్రాము (24 క్యారెట్లు) బంగారం ధర రూ.8,029 పలికింది. తులం బంగారం ధర దాదాపు రూ.80 వేలు దాటింది.

శ్రావణమాసంలో పెళ్లిళ్ల సందడి, అనంతరం వచ్చిన దసరా, దీపావళి పండుగల సీజన్‌లో బంగారం కొనుగో ళ్లు కొంతమేరకు పెరిగినట్లు నగరంలోని వ్యాపారు లు చెబుతున్నారు. దీనికి తోడు దీపావళికి రెండు రోజుల ముందు వచ్చే ధన్‌తేరస్ (ధన త్రయోదశి) రోజున బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేసేందు కు ప్రజలు ఆసక్తి చూపుతారు.

ధన్‌తేరస్‌కు ఇంకా రెండు రోజులు ఉన్నప్పటికీ నగరంలోని జ్యూవెల్లరీ షాపుల్లో వినియోగదారుల రద్దీ కనిపిస్తోంది. ధర పెరిగినప్పటికీ ఎంతోకొంత బంగారం కొనాలనే ఆసక్తితో సగటు ప్రజలు ఉంటారని పలువురు బంగారం షాపుల యజమానులు చెబుతున్నారు. ఇదిలా ఉం డగా ఇప్పటికే పలు జ్యూవెల్లరీ షాపుల యాజమా న్యాలు బంగారు ఆభరణాలపై ఆఫర్లను ప్రకటించాయి. పసిడి కొనుగోలును బట్టి వినియోగదారులకు బహుమతులను కూడా ఇస్తున్నారు. 

లక్ష్మీదేవిని ఇంట్లోకి తెచ్చుకోవాలని..

కార్తీక మాసం ప్రారంభానికి నాలుగు రోజుల ముందు ధన్‌తేరస్(ఆశ్వయుజ మాసంలో) వస్తుంది. ఈ ఏడాది అక్టోబర్ 29న ధన త్రయోదశి ఉంది. ధన త్రయోదశి రోజు న చాలామంది లక్ష్మీపూజ చేస్తారు. పలువురు కుబేరుడి పూజ, ధన్వంతరి పూజలు కూడా చేస్తారు. ఆ పూజ కోసం ప్రజలు ధన త్రయోదశి రోజు బంగారం, వెండి ఆభరణాలు, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు.

ధన త్రయోదశి నాడు బంగారం కాయిన్లు, గాజులు, హారాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారని తెలుస్తోంది. ఆ రోజున ఒక గ్రాము బంగారమైనా కొనాలనుకునే వారు ఎక్కువే ఉంటారు. ధన త్రయోదశి రోజున బంగా రం, వెండి ఆభరణాలు కొంటే ఏడాది పొడవునా లక్ష్మీదేవి తమ ఇంట్లోకి వస్తుందని పలువురి విశ్వాసంగా ఉంది. ఆ రోజు ఇం ట్లోకి సంపద వస్తే ఐశ్వర్యం కలుగుతుంది, ఆ రోజు కొన్న ఆభరణాల ధరలు ఎన్నో రెట్లు పెరుగుతాయని నమ్మకం.

అలాగే ఆనందం, శ్రేయస్సు పెరుగుతుందని విశ్వాసం. కొనుగోలు చేసిన బంగారం, వెండి ఆభరణాలను లక్ష్మీదేవి ఎదుట ఉంచి పూజలు చేస్తారు. కాగా ఆర్థిక స్తోమత సరిగా లేనివారు కూడా ధన త్రయోదశి రోజున ఏదో ఒక వస్తువును కొనేందుకు ఆసక్తి చూపుతారు. చివరకు ఒక చీపురు, ఉప్పును అయినా కొనుగోలు చేయడం గమనార్హం. ఈ నెల 29న ధన త్రయోదశి రోజున వేకువజామున 1.01 గంటలకు తిథి ప్రారంభమై మరుసటిరోజు వేకువ జామున 3.45 గంటలకు ముగియనుంది. 

ధర పెరిగినా.. 

అక్టోబర్ 1న రూ.77 వేలు ఉన్న తులం బంగారం ధర శనివారం నాటికి రూ.80 వేలకు చేరింది. అయినప్పటికీ ధన్‌తేరస్ రోజు బంగారం కొనుగోళ్లపై ఈ ధర ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని పలువురు వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ధన్‌తేరస్ రోజు బంగారం, వెండి అమ్మకాలు సాధారణం కంటే రెండు, మూడింతలు ఎక్కువ ఉంటుందని షాపుల నిర్వాహకులు చెబుతున్నారు. బంగారం రేట్లు పెరగడంతో ఈ ఏడాది కొనుగోళ్లపై మధ్యతరగతి ప్రజలు ప్రభావం చూపుతారని, వారి ప్రభావంతో గతేడాది కంటే 10 శాతం హెచ్చు తగ్గులుండొచ్చని ఓ జ్యూవెల్లరీ షాపు నిర్వాహకుడు తెలిపారు.   

బంగారమే పెట్టుబడిగా..

కొన్నేళ్లుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. 2022 అక్టోబర్‌లో తులం బంగారం ధర దాదాపు రూ.47 వేలు ఉండగా, 2023 అక్టోబర్‌లో రూ.73 వేలకు చేరింది. ఈ నెలలో రూ. 80 వేలకు చేరింది. వచ్చే ఏడాది నాటికి బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. దీంతో గతంలో రియల్ ఎస్టేట్ సహా వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టిన వారు బంగారం కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. బంగారాన్నే పెట్టుబడిగా మార్చుకుంటున్నారని పలువురు చర్చించుకుంటున్నారు.