calender_icon.png 17 November, 2024 | 6:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధన్‌ఖడ్ వర్సెస్ జయా బచ్చన్

10-08-2024 12:53:13 AM

రాజ్యసభలో తీవ్ర వాగ్వాదం

చైర్మన్ వ్యాఖ్యలపై జయ ఆగ్రహం

అవమానిస్తున్నారంటూ మండిపాటు

పాఠాలు చెప్పొద్దంటూ చైర్మన్ కౌంటర్

సభ నుంచి ప్రతిపక్షాల వాకౌట్

న్యూఢిల్లీ, ఆగస్టు 9: రాజ్యసభలో పేరు వివాదం శుక్రవారం తీవ్ర గందరగోళానికి దారితీసింది. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయ అమితాబ్ బచ్చన్‌ను ఉద్దేశించి చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ చేసిన వ్యాఖ్యలతో ప్రతిపక్ష పార్టీల సభ్యులంతా ఒక్కసారిగా లేచి నిలబడి చైర్మన్‌కు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొన్నది. చైర్మన్ కూడ ఆగ్రహంతో ఊగిపోతూ విపక్ష సభ్యులను తీవ్రంగా మందలించారు. 

పేరుతో మొదలైన వివాదం

సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ, ప్రముఖ నటి జయా బచ్చన్ పేరు విషయంలో వివాదం మొదలైంది. ఆమె మాట్లాడుతుండగా చైర్మన్ ‘మీరు కూర్చోండి’ అని పదేపదే అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. అందుకు ఆమె అభ్యంతరం తెలిపారు. ‘సర్.. నా పేరు జయ అమితాబ్ బచ్చన్. నేను ఒక నటిని. బాడీ లాంగ్వేజ్, వ్యక్తీకరణలోని భావాలను నేను చక్కగా అర్థంచేసుకోగలను. క్షమించాలి.. మీ స్వరంలోని భావం సరిగా లేదు. అది ఆమోదనీయం కాదు’అని తెలిపారు.

దీంతో జయా బచ్చన్‌ను చైర్మన్.. ‘జయాజీ మీకు గొప్ప పేరుంది. కానీ, ఒక నటిగా డైరెక్టర్ పనులేమిటో కూడా మీకు తెలుసు.  ఇప్పుడు నేను స్కూలుకెళ్లి నేర్చుకోలేను. ఇక చాలు ఆపండి. మీరు ఎవరైనా కావచ్చు. అయినా నేను లెక్కచేయను. మీరు డెకోరాన్ని తెలుసుకోవాలి’ అని ఆగ్రహంతో ఊగిపోయారు. దీంతో జయాబచ్చన్‌కు మద్దతుగా కాంగ్రెస్ నేత సోనియాగాంధీ రంగంలోకి దిగారు. సోనియా నేతృత్వంలో విపక్ష సభ్యులంతా సభ నుంచి వాకౌట్ చేశారు. 

చైర్మన్ క్షమాపణ చెప్పాల్సిందే: జయ

సభ నుంచి వాకౌట్ చేసిన తర్వాత జయాబచ్చన్ పార్లమెంటు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. విపక్ష సభ్యులను చైర్మన్‌తోపాటు అధికార పార్టీ సభ్యులు తరుచూ అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. చైర్మన్ క్షమాపణ చెప్పాల్సిందేనని స్పష్టంచేశారు. ‘సభలో చైర్మన్‌తోపాటు అధికార పార్టీ సభ్యులు విపక్ష సభ్యులను తరుచూ అవమానిస్తున్నారు. మేం పాఠశాల విద్యార్థులం కాదు. మాలో కొందరు సీనియర్ సిటిజన్స్ కూడా ఉన్నారు. చైర్మన్‌కంటే ఎక్కువ పార్లమెంటరీ అనుభవం ఉన్నవారు ఉన్నారు. ముఖ్యంగా మల్లికార్జు ఖర్గే మాట్లాడేందుకు ప్రయత్నించినప్పుడు చైర్మన్ మైక్ కట్‌చేసి మాట్లాడిన వ్యంగ్యపు మాటలు మాకు తీవ్ర ఆవేదన కలిగించాయి.

ఆయన ప్రతిసారి అభ్యంతరకర భాష వాడుతున్నారు. న్యూసెన్స్ వంటి పదాలు ఉపయోగిస్తున్నారు. అధికార పార్టీ సభ్యులు కూడా మాపై బుద్ధిహీన్ వంటి పరుష పదాలతో విమర్శలు చేస్తున్నారు. సెలబ్రిటీ అయినా లెక్కచేయను అని చైర్మన్ అన్నారు. నా పట్ల శ్రద్ధ తీసుకోవాలని ఆయనను కోరటం లేదు. పార్లమెంటులో వీరిలాగా ఎవరూ.. ఎప్పుడూ మాట్లాడలేదు. సమస్య ఏంటి? ఈ పద్ధతి మహిళలను అవమానించటమే’ అని మండిపడ్డారు. విపక్షాల విమర్శలను బీజేపీ నేత, మంత్రి జేపీ నడ్డా తప్పబట్టారు. ప్రతిపక్షాలు దేశాన్ని బలహీన పరుస్తున్నాయని ఆరోపించారు.