calender_icon.png 16 November, 2024 | 4:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధనాధన్ దీపిక

15-11-2024 12:00:00 AM

  1. ఐదు గోల్స్‌తో మెరిసిన భారత స్టార్
  2. ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీ

రాజ్‌గిర్ (బిహార్): ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య హోదాలో బరిలోకి దిగిన భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. తాజాగా గురువారం థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 13-0 తేడాతో ఘన విజయం అందుకుంది. దీపికా కుమారి ఐదు గోల్స్‌తో రఫ్పాడించిన వేళ సలీమా టిటే సేన థాయ్‌లాండ్‌పై సునాయాస విజయాన్ని అందుకుంది. హ్యాట్రిక్ విజయాలతో సెమీస్‌కు దగ్గరైన టీమిండియా శనివారం పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత చైనాతో ఆడనుంది. చైనా, భారత్ మూడు విజయాలతో సమానంగా ఉన్నప్పటికీ గోల్స్ వ్యత్యాసం కారణంగా చైనా మొదటి స్థానంలో ఉంది.

రెండు గ్రూపుల్లో నుంచి టాప్-2లో నిలిచిన రెండు జట్లు సెమీస్ ఆడనున్నాయి.  గంట పాటు సాగిన పోరులో ప్రతీ క్వార్టర్స్‌లోనూ భారత్‌దే ఆధిపత్యం. దీపికా కుమారి (ఆట 3వ, 19వ, 43వ, 45వ, 47వ నిమిషంలో), ప్రీతి దూబే (9వ, 40వ ని.లో), లార్లేమ్‌సియామి (12వ, 56వ ని.లో), మనీశా (55వ, 58వ ని.లో), బ్యూటీ డంగ్ డంగ్ (30వ ని.లో), నవ్‌నీత్ కౌర్ (53వ ని.లో) గోల్స్ సాధించారు.

మ్యాచ్‌లో భారత్ 12 పెనాల్టీ కార్నర్స్‌లో ఐదింటిని గోల్‌గా మలచడంలో విజయవంతమైంది. ఆట ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన దీపికా మూడో నిమిషంలోనే గోల్ కొట్టి భారత్ ఖాతా తెరిచింది. ఇక టాప్ ఆఫ్ సర్కిల్ దిశగా దీపిక కొట్టిన గోల్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. మిగిలిన మ్యాచ్‌ల్లో మలేషియా 2-1 కొరియాను,  చైనా 2-1 జపాన్‌ను మట్టికరిపించింది.