calender_icon.png 26 October, 2024 | 5:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తీరం దాటిన దన

26-10-2024 02:49:00 AM

ఒడిశాలో కుంభవృష్టి

భీకర గాలులకు నేలకొరిగిన చెట్లు

బలహీనపడి బెంగాల్‌వైపు పయనం

భారీ వర్షాలకు బెంగాల్‌ల ఒకరు మృతి

తుఫాన్‌రోజే ఒడిశాల్లో 1600 ప్రసవాలు

భువనేశ్వర్, అక్టోబర్ 25: బంగాళాఖాతంలో ఏర్పడిన సూపర్ సైక్లోన్ దన ఒడిశాలో తీవ్ర విధ్వంసం సృష్టిస్తూ తీరం దాటింది. బిత్తర్‌కనిక నేషనల్ పార్కు, ధమ్రా మధ్య గురువారం అర్థరాత్రి మొదలైన తీరం దాటే ప్రక్రియ, శుక్రవారం ఉదయం 8 గంటల వరకు కొనసాగింది. తీరం దాటిన తర్వాత అతి తీవ్ర తుఫాను నుంచి తీవ్ర తుఫానుగా బలహీనపడి ఉత్తరం దిశగా కదులుతూ బెంగాల్ వైపు వెళ్తున్నది. 

ఒడిశాలో జీరో క్యాజువల్టీ సక్సెస్

ఒకప్పుడు తుఫాన్లు వస్తే ఒడిశాలో ప్రజల మరణాలు వందలు, వేలల్లో ఉండేవి. క్రమంగా వ్యూహం మార్చిన ఒడిశా ప్రభుత్వం ‘జీరో క్యాజువల్టీ’ విధానాన్ని తీసుకొచ్చింది. బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడిందని తెలిసిన మరుక్షణం నుంచే రాష్ట్రంలోని అన్ని శాఖల సిబ్బంది కట్టుదిట్టమైన చర్యలు చేపడుతారు. దన తుఫాను సమయంలో కూడా ఆ వ్యూమాన్ని పక్కాగా అమలుచేయటంతో ఇంత భారీ తుఫాను వచ్చినా ఒక్క ప్రాణ నష్టం కూడా కలుగకుండా కాపాడగలిగారు.

శుక్రవారం నాటికి 6 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తీరం దాటిన తర్వాత తుఫాను తీవ్ర విధ్వంసం సృష్టించినప్పటికీ ఈ రాష్ట్రంలో ఆస్తి నష్టం సంభవించిందే తప్ప ప్రాణనష్టం జరుగలేదు. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళులు వీచాయి. తుఫాను గంటకు 10 కిలోమీటర్ల వేగంతో తీరం దాటింది. ఈదురుగాలుల దెబ్బకు అనేక చోట్ల చెట్లు కూకటివేళ్లతో సహా కూలిపోయాయి.

రోడ్లు దెబ్బతిన్నాయి. విద్యుత్తు సరఫరా వ్యవస్థ ప్రభావితమైంది. భారీ వర్షాలు, గాలులకు పొరుగునే ఉన్న బెంగాల్ రాష్ట్రంలో ఒకరు మరణించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ తుఫాను ఆ రాష్ట్రం వైపుగానే వెళ్తున్నది. తుఫాను కారణంగా గురువారం మూసివేసిన భువనేశ్వర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని శుక్రవారం తిరిగి తెరిచారు. తుఫాను ఉత్తరం దిశగా ప్రయాణిస్తూ బలహీనపడుతున్నదని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. 


1600 శిశువులు జననం

తుఫాను నుంచి రక్షణ చర్యల్లో భాగంగా ఒడిశా తీర ప్రాంత జిల్లాల నుంచి వేలమందిని ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. వారిలో 4,500 మంది గర్భిణిలు కూడా ఉన్నారు. వారిలో 1600 మంది గురు, శుక్రవారాల్లో బిడ్డలకు జన్మనిచ్చినట్లు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి తెలిపారు.