calender_icon.png 3 October, 2024 | 8:08 AM

ఈవోడీబీ ర్యాంకింగ్‌లో రాష్ట్రం ఢమాల్

03-10-2024 02:45:00 AM

2022 వరకు 2వ స్థానం.. 2023లో మొదటి స్థానం

2024లో రాష్ట్రానికి దక్కని ర్యాంకు

తొలిసారి జాబితాలో చోటు గల్లంతు

హైదరాబాద్, అక్టోబర్ 2 (విజయక్రాంతి): ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్.. అంటే దేశంలో లేదా రాష్ట్రంలో వ్యాపారం చేసేందుకు ఉన్న అనుకూల వాతావరణం. దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వారి రాష్ట్రంలో వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు, వనరులు అందుబాటులోకి తీసుకొ చ్చేందుకు కృషిచేస్తాయి.

ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో వ్యాపార అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించి అభివృద్ధిని సాధిస్తాయి. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్న వ్యాపార అనుకూలతల వారీగా ఏటా కేంద్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులను ప్రకటిస్తుంది. ఈ అంశంలో తెలంగాణ అద్భుత ప్రదర్శన కనబరుస్తూ వస్తుంది.

రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అన్ని వనరులను సమర్థంగా ఉపయోగించుకుం టూ వ్యాపార అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నది. వ్యాపారంపై ఆసక్తి గల ఔత్సాహికులకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నది. ప్రస్తుత ప్రభుత్వం కూడా వ్యాపార అనుకూల ధోరణిని కొనసాగిస్తున్నది. గత పదేళ్లలో టాప్ ౨గా కొనసాగిన తెలంగాణ.. ఈసారి స్థానాన్నే కోల్పోయింది. 

గత సంవత్సరం నంబర్ వన్

2015 నుంచి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ జాబితాలో అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన తెలంగాణ 2024 జాబితాలో స్థానమే దక్కకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. 2015లో ఈవోడీబీ జాబితాలో 13వ ర్యాంకు సాధించిన తెలంగాణ.. 2019 నుంచి 2022 వరకు 2వ ర్యాంకులో కొనసాగింది. 2023లో ఏకంగా మొదటి స్థానంలో నిలిచింది.

ఒక సంవత్సరంలోనే ఈవోడీబీ జాబితాలో ఈ స్థాయిలో ర్యాంకు పడిపోవడం గమనార్హం. గత ప్రభుత్వం కంటే అద్భుతంగా ప్రస్తుత ప్రభుత్వం వ్యాపార రంగానికి, పారిశ్రామిక రంగానికి కావాల్సిన అన్ని వసతులను కల్పిస్తున్నది. అవసరమైన వనరులను అందిస్తున్నది. కానీ, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ జాబితాలో తెలంగాణ స్థానమే లేదు.  

2024లో టాప్‌లో కేరళ, ఏపీ 

ఈవోడీబీ జాబితాలో కేరళ, ఏపీ మినహా మిగిలిన దక్షిణాది రాష్ట్రాలకు చెప్పుకోదగ్గ ర్యాంకులు రాలేదు. ఈ జాబితాలో కేరళ మొదటి స్థానంలో నిలువగా, ఏపీ రెండో స్థానంలో నిలిచింది. కేరళలో ఏడు సిటిజన్ సెంట్రిక్, రెండు బిజినెస్ సెంట్రిక్ సంస్కరణలను చేపట్టినందుకు మొదటి ర్యాంకు దక్కింది.

ఏపీలోనూ ఐదు సిటిజన్ సెంట్రిక్, ఐదు బిజినెస్ సెంట్రిక్ సంస్కరణలకు చేపట్టినందుకు రెండో ర్యాంకు సాధించింది. కర్ణాటక 12వ స్థానం సాధించింది. గుజరాత్ 3వ స్థానం, రాజస్థాన్ 4వ స్థానం, త్రిపుర 5వ స్థానం సహా జాబితాలోని మిగిలినవన్ని ఉత్తరాది రాష్ట్రాలే కావడం గమనార్హం.