calender_icon.png 6 January, 2025 | 3:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సేఫ్ సిటీ ప్రాజెక్ట్ స్టేటస్‌పై డీజీపీ ఆరా

03-11-2024 02:12:30 AM

సమీక్షలో అధికారులకు సూచనలు

హైదరాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి): రాష్ట్ర పోలీస్ శాఖలో అమలు చేస్తున్న సేఫ్ సిటీ ప్రాజెక్ట్ స్టేటస్‌ను డీజీపీ డాక్టర్ జితేందర్ సమీక్షించారు. శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఐడీ డీజీపీ శిఖా గోయల్, శాంతి భద్రతల అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్, పోలీస్ కమిషనర్లు అవినాశ్ మహంతి, సుధీర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ సేఫ్ సిటీ ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితులపై రివ్యూ చేశారు. ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లు, భరోసా కేంద్రాలు, సీసీటీవీ కెమెరాలు, ఫోరెన్సిక్ ల్యాబ్స్ పెలికాన్ సిగ్నల్స్ తదితర ఏర్పాట్ల పనితీరు గురించి సంబంధిత అధికారులతో చర్చించారు.

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ ఉమెన్ సెంటర్లలో అదనంగా మరో మూడింటిని మంజూరు చేయాలని సూత్రప్రాయంగా అంగీకరించారు. రాచకొండ పరిధిలోని చౌటుప్పల్, భువనగిరి, సైబరాబాద్ పరిధిలోని కూకట్‌పల్లిలో ఆయా కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించారు.

నాంపల్లి ప్రాంతంలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ కేంద్రాన్ని, జెహ్రానగర్‌లోని సీడీఈడబ్ల్యూ కేంద్రాన్ని పూర్తి చేయాలని పోలీస్ హౌసింగ్ అధికారులను ఆదేశించారు. డీసీపీలు ఉషా విశ్వనాథ్, కే సృజన, డీ సాయిశ్రీ, జీహెచ్‌ఎంసీ డీఈ మమత తదితరులు పాల్గొన్నారు.