calender_icon.png 6 February, 2025 | 9:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తి గజల్ జ్ఞాన శ్రీనివాస్

09-12-2024 12:00:00 AM

వాఙ్మయానికి వాగ్గేయరూపం

గాన సరస్వతి ముద్దుబిడ్డ గజల్ శ్రీనివాస్ జీవితకాల పరివర్తన మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అసలు ‘గజల్’ అనే చైతన్యవంతమైన సాహిత్య ప్రక్రియ కోసమే తాను పుట్టాడా అన్నంతగా మమేకమై గజలే తాను, తానే గజల్‌గా మారారు. అక్కడితో ఆపేయకుండా, స్త్రీ సౌందర్య వర్ణనతో దాదాపు నాలుగు గోడలకే పరిమితమైన ఆ పద్య/గేయ ప్రక్రియ రూపురేఖలను, అర్థ పరమార్థాన్ని, చివరగా ప్రదర్శనా తీరుతెన్నులను నైతిక, మానవీయ, సామాజిక ప్రయోజనాత్మక పథంలోకి అనూహ్యంగా మార్చేశారు.

సాంప్రదాయ గజల్‌ను మరిపించేలా తాను చేసే గజల్ గేయ గానాలు లక్షలాది శ్రోతలను పరవశింపజేయడమేకాక ఆయన్ను ప్రపంచస్థాయిలో అత్యంత అరుదైన (మూడు) గిన్నిస్ బుక్ రికార్డులను అధిరోహించేలా చేశాయి. 

కాలం ఇక్కడితో ఆగలేదు. అనివార్యమైన, అత్యావశ్యకమైన పరివర్తనా పథంలోకి ఆయనను చేతులు పట్టుకొని నడిపించింది. సమాజాభివృద్ధికి మేలు చేసే దిశగా గజల్ సాహిత్య గానాలు తొలుత ఆయనలోనే స్వీయమార్పును తెచ్చాయి. తర్వాత బృహత్ గుణాత్మకమైన సామాజిక మార్పుకోసం కంకణం కట్టుకొన్నారు. మానవీయ, కుటుంబ, పల్లె పట్టణ నగర, జీవ జంతుజాతుల సహజ విలువలు, మమతానురాగాలు, బంధాలు మానవా ళి పోగొట్టుకుంటున్న ఉత్తమ ఉదాత్తరీతులను పునరుద్ధరించే దిశగా గజల్ గేయాలను సృష్టిస్తున్నారు.

ఈ పరిధిని మరింతగా విస్తరింపజేసుకొని, భారతీయ ఆధ్యాత్మిక, ధార్మిక వాఙ్మయానికి వాగ్గేయ రూపు నిచ్చే దిశగా గజల్ శ్రీనివాస్ సాగుతున్నారు. 

నాలుగు దశాబ్దాల కిందట యుక్తవయసులో ఉర్దూ సారస్వత సంస్కృతిలోని సుప్రసిద్ధ కవితాత్మక ప్రక్రియ అయిన గజల్ గానాన్ని అభిరుచిగా చేపట్టి, అలవోకగా ఆశుగానలీన నైపుణ్యం సాధించి, మహాకవి డా.సినారె వారి అపురూప వాత్సల్యాన్ని చూరగొన్న (గజల్) కేశిరాజు శ్రీనివాస్ జీవనయానం అతితక్కువ కాలంలోనే అనేక మలుపులు తిరిగి, అనితర సాధ్య విజయాలనే కైవసం చేసుకుంది.

అదంతా ఒక ఎత్తయితే, గత అయిదేళ్లుగా గజల్ సాహిత్యానికి (దైవ భక్తి జ్ఞానామృతాన్ని అద్దుతూ, సామాన్య ప్రజలకు పూర్తి ఉచితరీతిన పంచి పెడుతున్న తీరు మరింత ప్రశంసనీయం.ఇప్పటికి ఆయన స్వయంగా రచించి లేదా పలువురు సాహితీవేత్తలతో రచియింపజేసి గానం చేసిన భక్తి, ఆధ్యాత్మిక గజల్ గానాల పరంపరను ఒక పట్టాన కొలువలేం. గణేషుని పాట, హనుమాన్, షిరిడీ బాబాల చాలీసాలు, సుప్రభాతాలు, మంగళహారతులు, వివిధ ఆలయాలు, మహానుభావులు, స్వాతంత్య్ర సమరయోధుల ప్రత్యేక గేయాలనుంచి మొదలుపెట్టి ఇవాళ్టికి విస్తారమైన హైందవ వాఙ్మయంలోని రామాయణ, భారత, భాగవత, భగవద్గీతల వరకూ వచ్చేశారు. 

తాజాగా గత అక్టోబర్‌లో కవిత్రయ విరచితమైన శ్రీఆంధ్ర మహాభారతంలోని 108 ఎంపిక చేసిన విలక్షణమైన పద్యాలు, అత్యంత సరళమైన పద ప్రయో గాలతో డా.ముకుందశర్మ రాసిన ‘గేయ రామాయణం’, శ్రీ పోతన భాగవతంలోని ప్రసిద్ధ పద్యా లతోకూడిన ఆడియో కంపోజిషన్లను కేరళలోని తిరువనంతపురంలో బద్రినాథ్ జ్యోతిష్‌మఠం పీఠాధిపతి శంకరాచార్య శ్రీ అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామి విడుదల చేశారు.

గత నెల (నవంబర్)లో అయోధ్యలో హందీభాషలో ‘గేయ రామాయణం’ ఆడియో కంపోషిజన్‌ను కూడా శ్రీ విదుర్ ఆశ్రమ పీఠాధిపతి శ్రీ కుమారానంద గిరి మహారాజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గజల్ శ్రీనివాస్ శుక్రవారం ‘విజయక్రాంతి’ కేంద్ర కార్యాలయంలో ఈ రచయితకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులోని విశేషాలే ఇక్కడ.

మార్పు ఇలా మొదలైంది!

ఇరవై ఏళ్ల వయసులో 1986లో స్వగ్రామం, పరిసర ప్రాంతాలలో శ్రీనివాస్ మొదలుపెట్టిన ‘గజల్ గాన’ ప్రదర్శనలు ఆరేళ్ల తర్వాత మహాకవి, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా. సి.నారాయణరెడ్డి పరిచయంతో కీలకమైన మలుపు తిరిగాయి. గజల్ సాహిత్యంలో అనూహ్య మార్పులు అప్పుడే వచ్చాయని శ్రీనివాస్ తెలిపారు. “తన గజళ్లను గానం చేస్తున్న విధానం ఆయనకు బాగా నచ్చింది. ‘శ్రీనివాస్ నా మానస పుత్రుడు’ అని అప్పట్లో సభాముఖంగానే ఆయన ప్రకటించారు.

సుమారు తొమ్మిదేళ్లపాటు వారితో నా ప్రయాణం కొనసాగింది. ఆ మధ్య కాలంలో నా కోసమే సినారె వారు ప్రత్యేకించి మరో వంద గజళ్లు రచించి ఇచ్చారు. అవన్నీ పుస్తక రూపంలోకి వచ్చా యి” అని ఆయన అన్నారు. శ్రీనివాస్ ప్రత్యేక రచనలకు సినారె అద్భుత గజళ్లు కూడా తోడు కావడంతో ప్రదర్శనలు మరింతగా ప్రజలను ఆకట్టుకున్నాయి. 

సినారె అంతటి వారే శభాష్ అన్నాక..

నిన్నటి గజల్ శ్రీనివాస్‌కు, నేటి భక్తిజ్ఞాన శ్రీనివాస్‌కూ మధ్య జరిగిన మార్పు ఒక రకంగా ఆహ్వానించదగ్గది కూడా. స్వచ్ఛ మానవీయ జీవనం, కుటుంబ విలువలు, పల్లె జీవితాలు, కోల్పోయిన బంధాలు, అనుబంధాలు, భావోద్వేగాలు వంటి సామాజిక వెనుకబాటు తనం నుంచి ఎంతటి వాళ్ళకైనా అద్భుత సాంత్వనను ఇచ్చే ఆధ్యాత్మిక, ధార్మిక రంగంలోకి జరిగిన పరివర్తన నిజంగా ప్రశంసనీయం.

మొన్నటి ఒక చలం, నిన్నటి ఒక డా.రావూరి భరద్వాజ, నేటి ఒక మల్లాది వెంకట కృష్ణమూర్తి.. వంటి వారంతా ఇలాంటి అద్భుత పరివర్తనకు దాసోహమైన వారే. సినారె మార్గదర్శకత్వంలో శ్రీనివాస్ గజల్ గానాలలో మరింత రాటు తేలడమేకాక శ్రోతలను కట్టి పడేసే, హృదయాల్ని తాకేలా సరళమైన భాషలో రచనలు స్వయంగా చేసుకుని గానం చేయడం మొదలుపెట్టారు. డా.మంగళంపల్లి బాలమురళీ కృష్ణ అంతటి వారినుంచే ప్రశంసలు పొందే స్థాయికి ఆయన ఎదిగారు.

పాలకొల్లులో మొదలై ప్రపంచాన్నే చుట్టేసి..

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన శ్రీనివాస్, శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో 1966 అక్టోబర్ 14న జన్మించారు. ఒక దశాబ్దం పాటు భారతీయ విద్యాభవన్, భీమవరం సైనిక్ స్కూల్, కోరుకొండలో లైబ్రేరియన్‌గా పనిచేశారు. 1986లో తెలుగు గజల్స్ పాడటం ప్రారంభించారు. కంజీరా (వాద్య పరికరం)పై మునివేళ్లతో లయశ్రుతితాళ యుక్తంగా వాయిస్తూ గీతాలాపనలు చేస్తారు. పాలకొల్లులో మొదలుపెట్టిన ఆయన ఈ ప్రయాణం అచిరకాలంలోనే ప్రపంచాన్నంతా చుట్టేసింది.

దీని వెనుక ఆయన కృషి అనన్యసామాన్యం. “ఒక్క అంటార్కిటికాలో తప్ప నేను  ప్రదర్శన ఇవ్వని దేశం ప్రపంచంలో లేదు” అన్నారు సగర్వంగా శ్రీనివాస్. తెలుగుభాషకే పరిమితం కాకుండా దేశ విదేశాలలోని అత్యధిక భాషల్లో పాడిన వ్యక్తిగా (125 భాషల్లో) గిన్నిస్ బుక్ రికార్డులను మూడుసార్లు నెలకొల్పగలిగారు. “మరో పాతిక భాషల్లోనూ (150) పాడడానికి రెడీగా ఉన్నాను. కానీ, ఇప్పుడు ఈ తరహా గొప్పగొప్ప రికార్డులపైన ప్రేమ తగ్గిపోయింది..” అంటున్నారాయన. 

కంచి మహాస్వామి ఆదేశం

మానవీయ, నీతి నైతిక ప్రయోజనాలు వంటి భావజాలంతో కూడిన గజల్స్ రచనలతో గానం చేసిన శ్రీనివాస్ ప్రయాణం కంచికామకోటి పీఠాధిపతి జగద్గురువు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారి ఆదేశంతో భక్తి, ఆధ్యాత్మికత వైపు మళ్లారు. “రెండేళ్ల క్రితం కవిత్రయ విరచితమైన శ్రీమహాభారతంలో స్వామియే స్వయంగా ఎంపిక చేసిన ముఖ్యమైన 108 పద్యాలను గానం చేసి, రికార్డు ఇచ్చాను. నా ఈ పద్యగానం అందరినీ బాగా ఆకట్టుకోవడంతో రామాయణం వైపు దృష్టి మళ్లింది” అని చెప్పుకొచ్చారు శ్రీనివాస్.

“నాలో వచ్చిన ఈ ఆధ్యాత్మిక పరమైన మార్పు నాకు భగవంతుడు చూపిన మార్గంగా భావిస్తున్నాను. ప్రస్తు తం సనాతన ధర్మ పరిరక్షణకు అందరూ కట్టుబడ వలసిన అవసరం చాలా ఉంది. ఈ క్రమంలోనే నేను గోసంరక్షణ, పురాతన దేవాలయాల పునరుద్ధరణ, వేద పాఠశాలలకు సహాయాలు వంటి కార్యక్రమాలను ఎంచుకొని నా వంతు కృషి చేస్తున్నాను” అన్నారాయన పూర్తి చిత్తశుద్ధితో. అలాగని, ఆయన కేవలం భక్తి గజల్స్ గానాలకే పరిమితం కాలేదు. ప్రజలు, ప్రత్యేకించి యువత, పిల్లలు, మహిళలు, వృద్ధుల్లో దేశభక్తి, సామాజిక బాధ్యతలను గుర్తు చేసే చైతన్యవంతమైన గజల్స్ స్వీయరచనతో గాన ప్రదర్శనలు ఇస్తున్నారు. 

సాధారణ గాయకుణ్ణి కాను నేను!

భక్తి, ఆధ్యాత్మిక సంబంధమైన శ్రీనివాస్ ఆడియోలు వింటుంటే శ్రోతలు అలా పరవశించి పోవాల్సిందే. ఆయన గొంతులోని మాధుర్యం, ఆర్ద్రత, ఆర్తి, కరుణ, వేదన, మేల్కొలుపు, బుజ్జగింపు, ఆనందం.. ఇలా ఎన్నో భావోద్వేగాలు మనలను కదలనివ్వవు. ‘గేయ రామాయణం’లోని గానం వినగానే మనకు 1963 నాటి లవకుశ సినిమాలోని ‘వినుడు వినుడు రామాయణ గాధ..’ అమోఘమైన గీతం గుర్తుకు వస్తుంది.

మహా భారతం, భాగవతాలలోని పద్యాలు, రాబోయే (ఇంకా మార్కెట్లోకి రాని) భగవద్గీతలోని శ్లోకాలు ఆపాత మధురాలను తలపిస్తాయి. ఆయన రాగంలో ఎన్ని భావోద్వేగాలో. అందుకేనేమో, “నేను సాధారణ గాయకుణ్ణి కాదు, గానలీల ప్రదర్శనా కారుణ్ని” అంటున్నారాయన. 

రానున్నది ‘భగవద్గీత’! 

“౭౦౧ శ్లోకాలతో కూడిన సంపూర్ణ ‘భగవద్గీత’ పద్యాల గానం ఇప్పటికే పూర్తయింది. ఆడియో కంపోజిషన్‌ను 2026 జనవరిలో సుమారు 100 భాషల్లో విడుదల చేస్తాను. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగాలన్నది నా ఆకాంక్ష” అన్నారు గజల్ శ్రీనివాస్ ఈ సందర్భంగా. శ్రీనివాస్ అలా అలవోకగా ఆశువుగా ధారాపాతంగా పాడుతుంటే శ్రోతలు కదలకుండా ఉండటానికి కారణం ఆయనే చెప్పారు.

“నేను గజల్‌ను కంఠస్తం చేయను, హృదయస్తం చేస్తాను” అలాగే, “వాణిజ్య లాభాలతోకూడిన సినిమా రంగంలోకి మరింత ఎక్కువగా ఎందుకు వెళ్లడం లేదు?” అన్నపుడు, “నేను డబ్బు కోసం పనిచేయను. ఇప్పుడు ఈ భక్తి ఆధ్యాత్మిక రికార్డులను కూడా డబ్బుకు అమ్ముకోను. అందరికీ పూర్తి ఉచితంగా అందుబాటులో ఉండేలా చూస్తాను. సోషల్ మీడియా అన్ని ఫ్లాట్‌ఫామ్స్‌లోనూ డౌన్‌లోడ్ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తాను. నా చివరి శ్వాస వరకూ సనాతన ధర్మ పరిరక్షణ కోసమే పాటుపడతాను” అంటూ ముగించారాయన.