కలెక్టర్ జితేష్ వి పటేల్...
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వైకుంఠ ద్వార దర్శనంనకు వచ్చే భక్తులు తప్పనిసరిగా జిల్లాలోని పర్యాటకానికి సంబంధించిన దర్శనీయ స్థలాలు సందర్శించే విధంగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్(Collector jithesh V. Patil) అన్నారు. బుధవారం నాడు సాయంత్రం ఐటిడిఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియంను ఆయన సందర్శించి మ్యూజియంలో ఏర్పాటు చేసిన పాతకాలపు ఇండ్లు, మ్యూజియం అలంకరణ ఏర్పాట్లు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీతారామచంద్ర స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం కాగానే పర్యాటకులు కిన్నెరసాని లోని జింకల పార్కు, బోటింగ్ షికారు చేసి తిరిగి ఐటిడిఏ లోని మ్యూజియం సందర్శించి పర్యాటక ప్రాంతాలైన బొజ్జిగుప్ప కనిగిరి బెండలపాడు సందర్శించి వెళ్లే విధంగా ప్రత్యేక ప్యాకేజీ నిర్వహించినందున సంబంధిత అధికారులు పర్యాటకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని అన్నారు.
ఈ ఫెస్టివల్ వరకే కాదని వారం వారం తప్పనిసరిగా పర్యాటకులు సందర్శించేలా ప్రత్యేక ప్యాకేజీ ద్వారా పర్యాటకులు వచ్చేలా ప్రణాళికల రూపొందిస్తున్నామని అన్నారు. అనంతరం మ్యూజియంలోని పాతకాలపు గిరిజన కల్చర్ కు సంబంధించిన వస్తువులను పరిశీలించారు. అదిలాబాద్ జిల్లా నుండి భద్రాచలంలోని గిరిజన కల్చర్ సంబంధించిన విధివిధానాలను పరిశీలించడానికి వచ్చిన గిరిజనులతో ఆయన మాట్లాడుతూ.. గిరిజన కల్చర్ ప్రాచుర్యంలోకి తేవడానికి రివర్ ఫెస్టివల్ తరహాలో కార్యక్రమాల రూపొందిస్తున్నామని, ఈ కల్చర్ కు సంబంధించిన ప్రతీది తిలకించి తప్పనిసరిగా మీ జిల్లాలో అమలయ్యే విధంగా కృషి చేయాలని గిరిజనులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఏవో సున్నం రాంబాబు, డి ఈ హరీష్, మేనేజర్ ఆదినారాయణ, జేడీఎం హరికృష్ణ, మ్యూజియం క్యూరేటర్ వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.