08-03-2025 11:31:52 PM
ఇండియా టుడే కంక్లేవ్‌లో యోగి
న్యూఢిల్లీ: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇండియా టుడే నిర్వహించిన కంక్లేవ్‌లో పాల్గొన్నారు. ‘యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో ఇటీవల జరిగిన మహాకుంభ్‌ను కొంత మంది ‘మృత్యుకుంభ్’ అంటూ ఎగతాళి చేశారు. కానీ భక్తులు ‘మృత్యుంజయ్ మహాకుంభ్’ అని సమాధానం ఇచ్చారు. కుంభమేళాకు ముందు ప్రజల నుంచి వచ్చిన స్పందనను బట్టి 40 కోట్ల మంది వస్తారని నేను అంచనా వేశాను. వ్యతిరేఖతను ప్రచారం చేసేందుకు ఎలాగూ కొందరు ఉండనే ఉన్నారు. కానీ జనాలు వారికి సరైన గుణపాఠం నేర్పుతారని నేను భావించాను. సరిగ్గా అదే జరిగింది. సనాతన ధర్మం గురించి ఎవరైతే పిచ్చి కూతలు కూశారో.. కుంభమేళా తర్వాత వారి నోళ్లు మూతపడ్డాయి.
కుంభమేళా తొక్కిసలాట ఘటన దురదృష్టకరం. ఈ ఘటన తర్వాత ప్రభుత్వం మరింత అప్రమత్తం అయింది. తొక్కిసలాట జరిగినపుడు కుంభ్ ఏరియాలో అప్పటికే నాలుగు కోట్ల మంది భక్తులు ఉన్నారు. మౌని అమావాస్య పుణ్యస్నానానికి 8 కోట్ల మంది వస్తారని మేము అంచనా వేశాం. కానీ ఇంకా రెండు కోట్ల మంది భక్తులు జౌన్‌పూర్, మిర్జాపూర్, బడోహి, ప్రతాప్‌ఘర్, రాయ్‌బరేలీ, కౌసంబి ప్రాంతాల్లోనే ఉండిపోయారు. మేము ఈ ప్రాంతాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాం. తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారిని 15 నిమిషాల్లోనే ఆసుపత్రులకు తరలించాం.’ అని అన్నారు.