26-02-2025 06:43:53 PM
బూర్గంపాడు (విజయక్రాంతి): బూర్గంపాడు మండలంలోని మోతెగడ్డలో కొలువు తీరిన శ్రీ వీరభద్ర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పురాతన చరిత్ర కలిగిన దేవాలయం కావడంతో శివరాత్రి పర్వదినాన ఉదయం నుంచే వీరభద్రుని ఆలయానికి జనం తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నాటుపడవల ద్వారా గోదావరిని దాటి ద్వీపకల్పంలో ఉన్న ఆలయానికి భక్తులు చేరుకున్నారు. భక్తులు గోదావరిలో స్నానాలు ఆచరించి దర్శనానికి బారులు తీరారు. స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ముందుగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.అధికారులు ఏర్పాట్లులను పర్యవేక్షించి భక్తులకు పలు సూచనలు చేశారు. బూర్గంపాడులోని గోవిందమాంబా సమేత వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయంలో మండల విశ్వబ్రహ్మణ సంఘం ఆధ్వర్వంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలంగాణ సరిహద్దు ఏపీలోని ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం పెదరావిగూడెం గ్రామంలోని గోదావరి ఒడ్డున ఉన్న పార్వతి సమేత కేదారేశ్వర స్వామివార్ల ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రానికి భక్తులు బారులు తీరారు.
వీరభద్రుడికి రూ.20 లక్షల విలువైన స్వర్ణ కిరీటాలు బహుకరణ
మోతెగడ్డ శ్రీ వీరభద్రుడికి తాళ్లూరి చారిటబుల్ ట్రస్టు అధ్యక్షుడు తాళ్లూరి పంచాక్షరయ్య కుమారుడు, ప్రవాస భారతీయులు తాళ్లూరి జయశేఖర్-నీలిమ దంపతులు రూ.20 లక్షల విలువైన స్వర్ణ కిరీటాలను బహుకరించారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజల అనంతరం స్వామి వారికి కిరీటాలను అందించారు. ఈ సందర్భంగా ఆలయం తరపున ధాతలను శాలువాలతో సత్కరించారు. అనంతరం తాళ్లూరి జయశేఖర్ మాట్లాడుతూ... శివరాత్రి సందర్భంగా వీరభద్రుడికి స్వర్ణ కిరీటాలు అందించడం ఆనందంగా ఉందన్నారు. గతంలోనూ ఆలయ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేశామని వివరించారు. భవిష్యత్తులో పురాతన ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి తమవంతు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో తాళ్లూరి ట్రస్టు డైరెక్టర్ వల్లూరిపల్లి వంశీకృష్ణ, బూర్గంపాడు సొసైటీ ఛైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, చిగురుమళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.