27-02-2025 01:35:31 AM
సంగారెడ్డి, ఫిబ్రవరి 26 (విజయ క్రాంతి)/ ఝరాసంగం/ పటాన్ చెరు: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. బుధవారం తెల్లవారుజాము నుంచి ఝరా సంఘంలో ఉన్న కేతకి ఆలయానికి తెలంగాణ రాష్ట్రం తో పాటు కర్ణాటక మహారాష్ట్రకు చెందిన భక్తులు వేలాదిగ తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయ ఆవరణ హర హర మహాదేవ్ నామస్మరణంతో మార్మోగుతుంది.
భక్తులు భారీ సంఖ్యలో క్యూలైన్ లో ఉండి స్వామి వారి దర్శనం చేసుకుంటున్నారు. దేవాలయ ఆవరణలో ఉన్న అమృత గుండంలో వేలాది మంది భక్తులు స్థానాలు ఆచరిస్తున్నారు. స్వామివారి దర్శనం కోసం భారీ క్యూ లైన్ ఉండడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయ ఆవరణలో ఉన్న శివలింగాలకు ప్రత్యేక పూజలు చేశారు.
వేద పండితులు తెల్లవారుజాము నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు చేయడం ప్రారంభించారు. ఎక్కడ చూసినా జనం కనిపించడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. భారీ సంఖ్యలో వాహనాలు రావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. పోలీసులు ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తడంతో స్వామివారి దర్శనానికి గంటల తరబడి క్యూ లైన్ లో ఉన్నారు.
శైవ క్షేత్రాలు శివనామ స్మరణంతో మార్మోగాయి
మహాశివరాత్రి నేపథంలో సంగారెడ్డి జిల్లాలో ఉన్న శైవ క్షేత్రాలు శివనామస్మరణంతో మార్మోగిన్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ఝరా సంఘంలో ఉన్న కేతకి సంగమేశ్వర స్వామి, జహీరాబాద్, సంగారెడ్డి, సదాశివపేట్, పటాన్ చెరు, ఆందోల్, నారాయణఖేడ్ పట్టణాలలో ఉన్న శివాలయాలకు భక్తులు పోటెత్తారు.
మహాశివరాత్రి వేడుకలతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దేవాలయ ఆవరణలో ఉన్న అమృత గుండాలలో పుణ్య స్నానాలు ఆచరించారు. రామచంద్రపురం మండలంలోని బీరంగూడ లో ఉన్న భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. శివాలయాలకు భారీ సంఖ్యలో భక్తులు చేరుకుని పూజలు చేశారు.
దారులన్నీ వనదుర్గమ్మ చెంతకే..!
పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి దామోదర రాజనర్సింహా అట్టహాసంగా ఏడుపాయల జాతర ప్రారంభం అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్, ఇతర ప్రముఖులు
మెదక్(విజయక్రాంతి)/ పాపన్నపేట, ఫిబ్రవరి 26: పల్లెలు, పట్నం అనే తేడా లేకుండా దారులన్నీ దుర్గమ్మ చెంతకే చేరుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఏడుపాయల శ్రీ వనదుర్గా భవానీ క్షేత్రం నందు మూడు రోజలపాటు నిర్వహించే వేడుకలను తిలకించేందుకు గాను భక్తులు అధిక సంఖ్యలో పోటేత్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండే కాకుండా పోరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర నుండి సైతం అనేక మంది భక్తులు అమ్మవారి దర్శానార్థం ఏడుపాయలకు చేరుకుంటారు.
ఈ జాతరను బుధవారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సి.దామోదర రాజనర్సింహా ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించి అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను అమ్మవారికి సమర్పించి, సాంప్రదాయ బద్ధంగా పూజలను నిర్వహించారు. ప్రతి ఏటా మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలకు ఈ సారి రెండు కోట్ల రూపాలయను కేటాయించడం జరిగిందని మంత్రి తెలిపారు.
రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో. పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో జీవించేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సుహాసినిరెడ్డి, జిల్లా డిసిసి అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, కాంగ్రెస్ నాయకులు ఆవుల రాజిరెడ్డి, సుప్రభాతరావు, పబ్బతి ప్రభాకర్రెడ్డి, గోవింద్ నాయక్ తో పాటు ఇతరులు పాల్గొన్నారు.
అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఏడుపాయల జాతరకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు గాను అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలను అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏడుపాయల ఈవో చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. ఇలావుండగా జాతర బందోబస్తును జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్రెడ్డి పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈయన వెంట మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ ఉన్నారు.
మారు మ్రోగిన శివనామ స్మరణ...
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా మెదక్ జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల్లోని శైవ క్షేత్రాల్లో శివ నామస్మరణ మారుమ్రోగింది. చేగుంట, వెల్దుర్తి, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్, కొల్చారం, మనోహరాబాద్, కౌడిపల్లి మండలాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఉపవాసాలు ఉండి రాత్రి వేళ్ళలో జాగారం చేశారు.