calender_icon.png 26 February, 2025 | 6:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముస్తాబైన పిల్లలమర్రి

26-02-2025 12:54:28 AM

 శివపార్వతుల కల్యాణానికి సర్వం సిద్ధం

 ఏటేటా పెరుగుతున్న భక్తులు

సూర్యాపేట, ఫిబ్రవరి 25 (విజయక్రాం తి) : పిల్లలమర్రి శివాలయాలు కాకతీయుల వైభవానికి చిహ్నాలుగా నిలుస్తున్నాయి. నాటి రాజుల అభిరుచి, భక్తి పరవశ్యానికి తగినట్లు పెద్దపెద్ద బండరాల్లతో, నల్లని రాయిపై అందమైన శిల్పాలను చెక్కి అందంగా దేవాలయాలను నిర్మించారు. అప్పటి నుంచి భక్తుల కోరికలను తీరుస్తూ శివాలయాలు శోభాయమానంగా వెలుగొందుతున్నాయి. మహా శివరాత్రి సందర్భంగా జరిగే అభిషేకాలు, ప్రత్యేక పూజలతో పాటు రాత్రి జరిగే శివపార్వతుల కళ్యాణానికి సర్వం సిద్ధం చేశారు. 

 దేవాలయాల నిర్మాణం..

రెండవ ప్రోల రాజు కాకతీయ రాజ్యమును క్రీస్తుశకం 1110 నుంచి క్రీస్తు శకం 1158 వరకు పాలించాడు. ఆయన దగ్గర కామిరెడ్డి సైన్యాధిపతిగా పనిచేసేవాడు. ఆయనకు కాట్రెడ్డి, బేతిరెడ్డి మరియు నామిరెడ్డి ముగ్గురు సంతానం. బేతిరెడ్డి కాకతీయ రుద్ర రాజుకు సమకాలికుడై అనేక యుద్ధాలలో విజయం చేకూర్చారని ప్రసిద్ధి. క్రీస్తు శకం 1195లో త్రికుటాలయం, క్రీస్తుశకం 1202లో శ్రీ పార్వతీమహదేవ నామేశ్వర స్వామి ఆలయాలను నామిరెడ్డి తల్లి,తండ్రి, తన పేరున మరియు క్రీస్తు శకం 1208లో బేతిరెడ్డి ఆయన భార్య ఎరకసానమ్మ పేరుమీద ఎరకేశ్వర ఆలయంను నిర్మించినట్లు- శాసనాల ఆధారంగా తెలుస్తుంది.

ముస్తాబైన పిల్లలమర్రి శివాలయాలు.. 

ఈనెల 25 నుండి మార్చి 1  వరకు జరగనున్న మహాశివరాత్రి వేడుకలకు పిల్లలమర్రి శివాలయాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. అందమైన విద్యుత్ కాంతులతో  చారిత్రక శివాలయాలు అందంగా ముస్తాబు చేశారు. వేలాదిగా తరలిరానున్న భక్తులను దృష్టిలో ఉంచుకొని ఇబ్బందులు కలగకుండా దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే  సంబంధిత అధికారులు పరిశీలించి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పనులు పూర్తి చేశారు. సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్‌ఐ బాలు నాయక్ ఆధ్వర్యంలో బందోబస్తుతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకునేందుకు దేవాలయాల సందర్శించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.

కార్యక్రమాల వివరాలు.. 

ఈనెల 26న తెల్లవారు జామునుండి  మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, మధ్యాహ్నం 1: 30 వరకు సామూహిక అభిషేకాలు, ధ్వజారోహణ, బసవ ముద్ద, జాగరణ, రాత్రి 12 గంటలకు స్వామివార్ల కళ్యాణ మహోత్సవం, 27న తెల్లవారుజామున 3 గంటలకు రథోత్సవం, రుద్ర హోమం, నవగ్రహ హోమం, 28న తెల్లవారుజామున 3 గంటలకు అగ్నిగుండాలు, ఉదయం ఏడు గంటలకు పూర్ణాహుతి, మార్చి 1న ఉదయం అభిషేకం, సాయంత్రం త్రిశూల స్నానం, స్వామివారి ఏకాంత సేవతో కార్యక్రమాలు ముగుస్తాయి..