18-02-2025 01:42:25 AM
సూర్యాపేట, ఫిబ్రవరి 17 (విజయ క్రాంతి) ః శ్రీ లింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతరకు భక్తులు అధిక సంఖ్యలో హాజరుకావడంతో గట్టు ప్రాంతం జనసంద్రంగా మారింది. లింగమంతుల స్వామికి, చౌడమ్మ తల్లికి భక్తులు మొక్కులు చెల్లించారు. రెండవ రోజు సోమవారం తెల్లవారుజాము మొదలుకొని రాత్రి వరకు భక్తులు పెద్దఎత్తున గట్టుకు చేరుకుని లింగమంతుల స్వామిని దర్శించుకున్నారు.
సుమారు 5 లక్షల మంది భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మొక్కులు చెల్లించుకున్న అనంతరం భక్తులు గండదీపాలు వెలిగించి ప్రదక్షిణలు చేశారు. వేడుకో లులో భాగంగా ప్రత్యేకంగా వండిన బోనాలపై ఉన్న మట్టిచిప్పలో ఒత్తులు వెలిగిం చి గుడిచుట్టూ ప్రదక్షిణలుచేసి దీపాలను స్వామి వారికి అప్పగించారు.
రాత్రి వరకు తరలివచ్చిన గంపలు
లింగమంతుల స్వామి జాతరలో ప్రధానంగా మొక్కుల చెల్లింపులో భాగంగా గం పలు చేయడం అనవాయితీ. ఏటా మధ్యాహ్నం వరకే పూర్తయ్యే కార్యక్రమం ఈ సారి రాత్రి 7, 8 గంటల వరకు కూడా గంపలతో కత్తి కటారుల విన్యాసాలతో గట్టుపైకి భక్తులు తరలి రావడం కనిపించింది. యాదవుల సాంప్ర దాయ నృత్యాలు, కత్తి కటారు విన్యాసాలను భక్తులు ఆసక్తిగా తిలకించారు.
రెండు చోట్ల షవర్లు
భక్తులదంరికీ ఆలయ ప్రాంగణంలో రెండు చోట్ల మాత్రమే షవర్లు ఏర్పాటు చేశారు. స్నానాలు చేసేందుకు సరిపడా షవర్లు లేక, ఉన్నవి కూడా ఒకే చోట ఏర్పాటు చేయడం తో మహిళలు ఇబ్బందులు పడ్డారు.
ఒక్క రోజుకే తిరుగు ముఖం
పదేళ్ల క్రితం భక్తులు ఎడ్లబండ్లతో జాతరకు వచ్చి మూడు నుంచి నాలుగు రోజులపాటు గుడారాలతో అక్కడే ఉండేవారు. ఈ ఏడు జాతరకు ఆదివారం సాయంత్రం వచ్చిన భక్తులు గంపలు బోనాలు చేసుకొని స్వామి అమ్మ వాళ్లకు అర్ధరాత్రి వరకు చెల్లించుకున్నారు. ఆ తర్వాత యాటలను బలిచ్చి సోమవారం సాయంత్రానికి ఇంటి ముఖం పట్టడం కనిపించింది.
ఎరుపెక్కిన గట్టు..
గొల్లగట్టు ఎర్రబడ్డది. యాదవులు స్వామివారికి కొబ్బరి కాయలు, బోనాలు చెల్లించి మొక్కులు చెల్లించుకోగా, అమ్మవారికి యాటలు బలి ఇచ్చారు. గతంలో గట్టుకు ఒకవైపు కేటాయించిన ఒక ప్రదేశంలో మాత్రమే యాటలను బలి ఇచ్చే వారు. కానీ ఈ జాతరలో తమకు నచ్చిన చోట గుట్టచుట్టూ యాటలను బలి ఇచ్చారు. దీంతో గుట్ట పరిసర ప్రాంతాల్లో రక్తపు మరకలే కనిపించాయి.