19-04-2025 10:43:05 PM
రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డి. అనసూయ సీతక్క...
నిర్మల్ (విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంచాయతీ రాజ్, మిషన్ భగీరథ, మహిళా, శిశు సంక్షేమం పై ఉమ్మడి జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ముందుగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న మంత్రికి పోలీసులు గౌరవ వందనం ఇచ్చారు. అనంతరం మహిళా పోలీసులచే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘శివాంగి’ బృందాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు.
ఇది రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు. జిల్లాలోని సమాఖ్య సంఘాలకు, మెప్మాలకు మంజూరైన చెక్కులను మంత్రి, కలెక్టర్ అభిలాష అభినవ్, ప్రజాప్రతినిధుల సమక్షంలో పంపిణీ చేశారు. బ్యాంకు లింకేజీ, రుణాల మంజూరు, వసూలులో నిర్మల్ జిల్లా ప్రగతిశీలంగా ఉందని మంత్రి ప్రశంసించారు. అనంతరం పలు అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి, టెండర్ దశ నుంచే పనులు వేగవంతంగా ప్రారంభించి, వర్షాకాలానికి ముందే పూర్తి చేయాలన్నారు. ఇప్పటికీ ప్రారంభం కాని పనులకు వెంటనే కొత్త టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. ఆలస్యం చేస్తున్న గుత్తేదారులకు నోటీసులు జారీ చేసి పనులు పూర్తి చేయించాల్సిన అవసరం ఉందని సూచించారు.
పనులన్నీ నాణ్యతతో ఉండాలని స్పష్టం చేశారు. వర్షాకాలం ప్రారంభానికి ముందు అభివృద్ధి పనులను పూర్తిచేయడం ఇంజనీరింగ్ అధికారుల బాధ్యత అని తెలిపారు. కాంట్రాక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారికి తగిన సూచనలు ఇవ్వాలని పేర్కొన్నారు. సాగునీరు చివరి తడి వరకు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో త్రాగునీటి సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ... నిర్మల్ జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పనులను వేగంగా పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. త్రాగునీటి సమస్యలు ఎదురవకుండా ముందస్తు ఏర్పాట్లు చేశామని, సాగునీరు అందించేందుకు కార్యాచరణ రూపొందించామని తెలిపారు.
అనంతరం జిల్లాల వారీగా అభివృద్ధి పనులపై మంత్రి చర్చించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ దండే దండే విటల్, పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్, ఆదిలాబాద్, నిర్మల్, ముధోల్, ఖానాపూర్, సిర్పూర్, అసిఫాబాద్, బోథ్ ల శాసనసభ్యులు మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్, పవార్ రామారావు పటేల్, వెడ్మా బొజ్జు పటేల్ పటేల్, పాల్వాయి హరీష్ బాబు, కోవ లక్ష్మి, అనిల్ జాదవ్, ఇతర ప్రజా ప్రతినిధులు, ఐ సి డి ఎస్ సెక్రటరీ అనితా రామచంద్రన్, ఉమ్మడి జిల్లా అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కుష్బూ గుప్త, దీపక్ తివారి, కిషోర్ కుమార్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.