24-03-2025 01:20:46 AM
ఏదులాపురం మున్సిపల్ ప్రాంతంలో పర్యటించి పలు రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మం, మార్చి -23 ( విజయక్రాంతి ):-వర్షాకాలంలోపు ఏదులాపురం మునిసిపాలిటీలో చేపట్టిన రోడ్డు అభివృద్ధి పనులు పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.ఆదివారం మంత్రి ఏదులాపురం మునిసిపల్ ప్రాంతంలో పర్యటించి పలు రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.గుర్రాలపాడులో 2 కోట్ల 85 లక్షలతో గుర్రాలపాడు నుండి కొత్త నారాయణపురం వరకు బీ.టీ. రోడ్డు నిర్మాణం, వెంకటగిరిలో 2 కోట్ల 4 లక్షలతో వెంకటగిరి ఎస్సీ, బీసీ కాలనీ నుండి ఖమ్మం గుదిమళ్ళ జెడ్పీ రోడ్డు వరకు బిటి రోడ్డు, గుదిమళ్ళలో కోటి 95 లక్షలతో గుదిమల్ల నుండి తొర్రివాగు డొంక రైస్ మిల్లు వరకు చేపట్టిన బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఏదులాపురం ప్రాంతంలో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని వచ్చే వర్షాకాలం లోపు పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని అన్నారు. ప్రజల అవసరాల మేరకు చేయవలసిన రోడ్డు నిర్మాణ పనులకు ప్రతిపాదనలు అందించాలని మంత్రి అధికారులకు సూచించారు. అనంతరం మంత్రివర్యులు గుదిమల్లలోని తిరుపతమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, ఆర్ అండ్ బి ఎస్‌ఇ హేమలత, ఆర్డీఓ నరసింహారావు, పంచాయతీ రాజ్ ఈఈ వెంకట్ రెడ్డి, మునిసిపల్ కమీషనర్ ఏ. శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం రూరల్ మండల తహసీల్దార్ రాంప్రసాద్, వివిధ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.