calender_icon.png 7 March, 2025 | 12:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పొంగులేటి ఆశీస్సులతో అభివృద్ధి

06-03-2025 01:08:31 AM

పాలేరు నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో వక్తలు దయాకర్ రెడ్డి, రామ్మూర్తి నాయక్, హరినాథబాబు, వెంకట్ రెడ్డి

కూసుమంచి , మార్చి 5 (విజయ క్రాంతి): పంచాయతీలతో పోలిస్తే పురపాలకంతో పాలన మరింత సౌలభ్యంగా మారుతుందని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆశీస్సులతో ఏదులాపురం నూతన మున్సిపాలిటీని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి, టీపీసీసీ మెంబర్ ధరావత్ రామ్మూర్తి నాయక్, మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బైరు హరినాథబాబు, ఖమ్మం రూరల్ మండల అధ్యక్షుడు కల్లెం వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.

ఖమ్మంలోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో నూతనంగా ఏర్పడ్డ ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 12 గ్రామాల ముఖ్యనాయకుల సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో తొలుత ఆయా గ్రామాల నాయకులు వారి వారి అభిప్రాయాలను వ్యక్తపరిచారు. అనంతరం ముఖ్యఅతిథులుగా హాజరై దయాకర్ రెడ్డి, కల్లెం వెంకట్ రెడ్డి, బైరు హరినాథబాబు, ధరావత్ రామ్మూర్తి నాయక్ మాట్లాడుతూ....

ఖమ్మం రూరల్ మండలంలో విలీనమై ఉన్నప్పుడే పై 12 గ్రామాలను గడిచిన ఏడాది కాలంలో కాంగ్రెస్ హయంలో శీనన్న నేతృత్వంలో అభివృద్ధి పరుచుకున్నామని తెలిపారు. ప్రస్తుతం అవి మున్సిపాలిటీలోకి రావడం ద్వారా పాలన మరింత సౌలభ్యమై అన్ని రకాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. త్వరలోనే మున్సిపాలిటీకి ఎన్నికలు వస్తాయని అప్పటిలోగా పార్టీని ఇంకా మరింత పటిష్ట పరుచుకోవాలని ఆయా ప్రాంతాల నాయకులకు సూచించారు.

తాజా సమాచారం ప్రకారం 32వార్డులుగా ఏదులాపురం మున్సిపాలిటీ ఏర్పడిందన్నారు. అంటే ఒక్కో ప్రాంతం నాలుగైదు డివిజన్ లుగా విభజించబడిందని తెలిపారు. దీని ద్వారా ఆయా ప్రాంతాల్లో పాలన మరింత మెరుగుపడి ప్రజలకు అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో వచ్చే అవకాశం ఉందన్నారు. నాయకుల సమిష్టి కృషితో ఏదులాపురం మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకుందామని వారు పేర్కొన్నారు.