- తెలంగాణను దోచుకున్న బీఆర్‌ఎస్, కాంగ్రెస్
- వంద రోజుల్లో హామీల అమలు ఏమైంది?
- కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
హైదరాబాద్, జనవరి 19 (విజయక్రాంతి): రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, దోపిడీకి బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలే కారణమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో అవినీతి రహిత పాలన అందాలంటే రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
కేంద్రంలో పదేండ్లుగా బీజేపీ అధికారంలో ఉన్నదని, కానీ ఏ ఒక్క కేంద్ర మంత్రిపైనా, ప్రభుత్వంపైనా ఒక్క రూపాయి అవినీతి ఆరోపణలు రాలేదని స్పష్టంచేశారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు, కార్యకర్తలు కిషన్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరా రు.
ఈ సందర్భంగా ఆయన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా కాంగ్రెస్ పాలన కొనసాగుతోందని ఆరోపించారు. అందుకే రాష్ట్ర ప్రజలు బీజేపీని ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారని, ఫలితంగానే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 8 ఎంపీ స్థానాలు ఇచ్చారని గుర్తుచేశారు.
రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వస్తామని భరోసా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తెలంగాణలో అధికారం చేపట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా అవినీతి రహితంగా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని తెలిపారు. తెలంగాణ గడ్డపై రాజ్యాంగ పరిరక్షణ పేరిట రాహుల్‌గాంధీకి యాత్ర చేపట్టే అధికారమే లేదని పేర్కొన్నారు.
ప్రజలకు వంద రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు ఏమయ్యాయో సమాధానం చెప్పి.. తెలం గాణకు రాహుల్ రావాలని డిమాండ్‌చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ దొంగ యాత్రలు చేస్తున్నార ని ఆరోపించారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు యువత పెద్దఎత్తున బీజేపీ లోకి రావాలని ఆహ్వానించారు.