17-04-2025 12:42:13 AM
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): కేసీఆర్ కృషితోనే తెలంగాణలో బంజారాల బతుకులు మారాయని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేంద్రం సహాకరించకున్నా ఎస్టీలకు 10శాతం రిజర్వేషన్లు కేసీఆర్ కల్పించారన్నారు. హైదరాబాద్‌లోని కవిత నివాసానికి బుధవారం అఖిల భారత బంజారాల ఆధ్యాత్మక గురువు, పౌరాదేవి పిఠాధిపతి చంద్రశేఖర్ మహారాజ్ వచ్చారు.
వారికి సంప్రదాయబద్దంగా కవిత ఆహ్వానం పలికారు. సన్మానించి ఆశీర్వాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రాష్ట్రంలోని బంజారాల ఆశీస్సులు కేసీఆర్‌పై పార్టీపైనా ఉన్నాయన్నారు. బంజారాలకు విద్య, ఉపాధి అవ కాశాలు మెరుగుపర్చడానికి కేసీఆర్ ఎన్నో చర్యలు చేపట్టారని కవిత తెలిపారు.
బంజారాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మాణం, తాండాలను గ్రామ పంచాయితీలుగా మార్చడం వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు. దేశంలోనే సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారని కవిత చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యేలు చంద్రావతి, హారిప్రియ నాయక్ తదితరులు పాల్గొన్నారు.