calender_icon.png 3 April, 2025 | 3:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రణాళిక ప్రకారం జగిత్యాల అభివృద్ధి

02-04-2025 12:51:55 AM

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ 

జగిత్యాల, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): జిల్లా కేంద్రమైన జగిత్యాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. మోతే రోడ్డులో గల పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల అభివృద్దే ధ్యేయంగా ముఖ్యమంత్రి తో కలిసి పనిచేస్తున్నానని తెలిపారు.

జగిత్యాల జిల్లా కేంద్రం నలువైపులా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని, దానికనుగుణంగా పట్టణ శివారులో అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. గతంలో కాంగ్రెస్ హయంలో ఎస్సారెస్పీ ప్రాజెక్టులో భాగంగా జగిత్యాలలో 300 ఎకరాలలో కాడా ఏర్పాటైందన్నారు. 1973-74లో చలిగల్ వాలంతరీ కేంద్రం, 1980లో పొలాస వ్యవసాయ పరిశోధన కేంద్రం స్థాపనకు బీజం పడిందని గుర్తు చేశారు. జగిత్యాల పట్టణంలో 14 జోన్ల లో 121 సర్వే నంబర్లను మార్పు చేయడం వల్ల గృహ నిర్మాణ అనుమతులు సులభంగా వస్తున్నాయన్నారు.

కాంక్రీట్ జంగల్’గా మారిన జగిత్యాలను, పరిసర గ్రామాలను సైతం కలిపి అభివృధి విస్తరణకు కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోని అభివృద్ధి చేయటం తన బాధ్యతన్నారు. రాష్ట్రంలో అతి పెద్ద ప్రాజెక్ట్ 4 వేల 5 వందల 20 డబల్ బెడ్రూమ్ ఇండ్ల ఇందిరమ్మ కాలనీ అని, ఈ కాలనీతో పాటూ నూకపల్లి, నర్సింగాపూర్ 188 ఎకరాలను జగిత్యాల మున్సిపల్లో కలపడం కోసం క్యాబినెట్, అసెంబ్లీలో తీర్మానం చేయటం జరిగిందని, గవర్నర్ ఆమోదం మాత్రమే మిగిలి ఉందన్నారు.

కేంద్ర పట్టణ, గృహ నిర్మాణ అభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్’ను గతంలో కలిసి అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వినతిపత్రాన్ని అందజేటం జరిగిందన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం ఎస్.కే. కన్సల్టెన్సీ ఆద్వర్యంలో సర్వే పూర్తయిందన్నారు. రూ. 350 కోట్లకు పైగా నిధులతో అధికారులు డిపిఆర్ సిద్ధం చేశారన్నారు. రైతులకు నష్టం కాకుండా మాస్టర్ ప్లాన్ అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నామన్నారు.

అమృత్ స్కీమ్ ద్వారా 3 ఏండ్లలో ప్రతి ఇంటికి త్రాగు నీరు అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్’కుమార్ వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు అడువల జ్యోతి లక్ష్మణ్, గోలి శ్రీనివాస్, నాయకులు క్యాదసు నాగయ్య, పద్మావతి పవన్, మల్లవ్వ, తిరుమలయ్య, అనిల్ తదితరులు పాల్గొన్నారు.