calender_icon.png 9 November, 2024 | 6:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బస్తీల అభివృద్ధికి పాటుపడాలి

09-11-2024 01:40:14 AM

  1. కేంద్ర, రాష్ట్ర పథకాల అమలు కోసం అధికారులు కృషి చేయాలి
  2. రాష్ట్రానికి హైదరాబాద్ నుంచే 70 శాతం ఆదాయం 
  3. దిశ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి 
  4. పలుశాఖల అధికారుల పనితీరుపై ఆగ్రహం

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 8 (విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలు కోసం అధికారులు కృషి చేయాలని కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి అన్నారు. మూడు నెలలకు ఒకసారి పథకాల అమలుపై సమీక్షించాలని సూచించారు.

రాష్ట్రానికి హైదరాబాద్ నుంచే 70 శాతానికి పైగా ఆదాయం వస్తోందని, నగరంతో సమాంతరంగా హైదరాబాద్‌లోని బస్తీలను అభివృద్ధి చేయాలన్నారు. శుక్రవారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో దిశ (డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ) సమావేశం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది.

దాదాపు 5 గంటల పాటు జరిగిన సమావేశంలో దిశ కమిటీ వైస్ చైర్మన్, మేడ్చల్ ఎంపీ ఈటల రాజేందర్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, వివిధ శాఖల అధికారులు, దిశ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వివిధ శాఖల పరిధిలో జరుగుతున్న పనులు, పథకాల అమలుపై సమీక్షించారు.

పలుశాఖల అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ కమిటీలో సభ్యులైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలకు చెందిన నగర ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరు కాలేదు. 

పీఎం విశ్వకర్మ అమలు తీరుపై అసహనం

ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్ మిషన్, ముద్ర లోన్లు, ఎడ్యుకేషన్ లోన్లు, ఎంఎస్‌ఎంఈలు సహా పలు పథకాలపై కిషన్‌రెడ్డి సమీక్షించారు.  నగరంలోని రైల్వేలు, విద్యుత్, నేషనల్ హైవేలు, బ్రిడ్జిల నిర్మాణం తదితర అంశాలపై వివిధ శాఖల అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా విశ్వకర్మ పథకం లక్ష్యం నీరుగారుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జిల్లాలో 18 వేల దరఖాస్తులు వస్తే కేవలం 620 మందికే లబ్ధి చేకూరడంపై అసహనం వ్యక్తం చేశారు. 45 రోజుల్లో ఈ పథకాన్ని పూర్తిగా గ్రౌండింగ్ చేయాలని, లేదంటే చర్య లు తప్పవని హెచ్చరించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో స్వచ్ఛభారత్‌లో భాగంగా నిర్వహిస్తున్న టాయిలెట్స్ మెయింటనెన్స్‌పై  అసం తృప్తి వ్యక్తం చేశారు. నగరంలోని 2,251 టాయిలెట్స్‌పై దృష్టి సారించాలని సూచించారు.

నగరంలోని ప్రజల అవసరాల కోసం ఆర్‌ఈఎస్ ఆధ్వర్యంలో వేస్తున్న బోర్లలో నిర్లక్ష్యం వహిం చడం సరికాదని ఎస్‌ఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భూసేకరణ ఇబ్బందులను తొలగించుకొని ఉప్పల్ ఎలివేటెడ్ ఫ్లు ఓవర్ పను లను త్వరగా పూర్తి చేయాలని, అంబర్‌పేట ఫ్లు ఓవర్‌ను జనవరి నాటికి ప్రారంభించాలని సూచించారు.

సదరం సర్టిఫికెట్ల జారీలో ఎందుకు కాలయాపన జరుగుతోందని ప్రశ్నించారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు రుణాలు అందించడంలో అధికారులు ఇబ్బందులు పెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. టీబీ బాధితులను అధికారులు దత్తత తీసుకోవాలని.. తాను, ప్రధాని మోదీ కూడా పలువురు బా ధితులను దత్తత తీసుకున్నట్లు వెల్లడించారు. 

విద్యాసంస్థలకు భూములు లేవా?

నగరంలోని కొన్ని భూములను అమ్మేందుకు రాష్ట్ర ప్రభుత్వం బ్లాకులు చేసిందని, విద్యాసంస్థలకు భూములు లేవా అని అధికారులను ప్రశ్నించారు. ఏ బ్యాంకు ద్వారా ఎన్ని ముద్ర రుణాలను అందించారో వివరాలు అందించాలని బ్యాంకర్లను కోరారు. రైల్వేకు సంబంధించిన సమస్యలను తనకు తెలపాలని సంబంధిత అధికారులకు చెప్పా రు. సమావేశానికి హాజరు కాని అధికారులపై ఉన్నతాధికారులకు రిపోర్టు చేయాలని కలెక్టర్‌కు సూచించారు. 

నిధుల కొరత 

దిశ సమావేశం అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ, జలమండలిని నిధుల కొరత వేధిస్తోందన్నా రు. రాష్ట్ర ప్రభుత్వ టెండర్లు వేసేందుకు కాం ట్రాక్టర్లు ముందుకు రావడం లేదని చెప్పా రు. నగరంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్స్, అంగన్వాడీ కేంద్రాలు, పలు పోలీస్ స్టేషన్ల భవనాలకు భూమి కొరత ఉ ందన్నారు. 2018లో కేంద్రం నగరంలోని మైనార్టీ రెసిడెన్షియల్స్‌కు సొంత భవనాల నిర్మాణానికి నిధులు విడుదల చేసిందని, నిర్మాణాలపై నిర్లక్ష్యం తగదన్నారు. నగరంలో పిల్లలు, యువకులకు మైదానాలు లేకపోవడం బాధాకరమని, స్పోర్ట్స్ డిపార్ట్‌మెంట్ మూతపడే పరిస్థితి ఉందన్నారు.  

అధికారులు జవాబుదారీగా ఉండాలి : ఎంపీ ఈటల

ప్రజలకు అధికారులు జవాబుదారీగా ఉండాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. సదరం క్యాంపునకు రాలేని వారిపట్ల సానుకూలంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏ పార్టీ వారైనా ప్రజాసేవలోనే ఉంటారని, ప్రజాప్రతినిధులు చెప్పిన పనుల ను అధికారులు త్వరగా పూర్తి చేయాలన్నారు. అభివృద్ధి పనుల కోసం నిధులు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా తాము సిద్ధంగా ఉన్నామని, వాటికి సంబంధించిన వివరాలను ఇవ్వాలని అధికారులకు సూచించారు.