calender_icon.png 1 November, 2024 | 5:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్షన్నర కోట్లతో మూసీ అభివృద్ధి

21-07-2024 12:43:52 AM

థేమ్స్ నదిలా తీర్చిదిద్దుతాం

‘హైడ్రా’ ఏర్పాటుతో సమస్యలకు పరిష్కారం 

అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలి

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

గోపన్‌పల్లిలో మంత్రులు కోమటిరెడ్డి, పొంగులేటితో కలిసి ఫ్లుఓవర్ ప్రారంభం

రంగారెడ్డి, జూలై 20 (విజయక్రాంతి): హైదరాబాద్ నగర అభివృద్ధికి చేయూతనిచ్చేందుకు హైడ్రా సంస్థను ఉన్నతంగా తీర్చి దిద్దుతామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. లండన్‌లోని థేమ్స్ నదిలా మూసీని సుందరీకరిస్తామని, త్వరలోనే మూసీ అభివృద్ధి కోసం రూ.1.50 లక్షల కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసి పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ గోపన్‌పల్లిలో రూ.28.5 కోట్లతో నిర్మించిన ఫ్లు ఓవర్‌ను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. నగరంలో సమస్యల పరిష్కారానికి, విపత్తుల నిర్వహణకు హైడ్రా అనే నూతన వ్యవస్థను తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు కబ్జాలకు గురికాకుండా ఈ సంస్థ నిరంతరం పర్యవేక్షిస్తుందని వివరించారు. రానున్న కాలంలో మూసీ నది అభివృద్ధిని చూడగానే ప్రజాప్రభుత్వం గుర్తొచ్చేలా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు రాకతో గోపన్‌పల్లి వంటి ప్రాంతాల దశ మారిందని, భూమి విలువ ప్రస్తుతం ఎకరానికి రూ.100 కోట్ల వరకు పలుకుతోందని పేర్కొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి మరిన్ని నిధులు కేటాయించి అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తామని హామీ ఇచ్చా రు. రానున్న రోజుల్లో హైదరాబాద్ నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, దీనిలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు..

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం తమ కు రెండు కళ్లని అన్నారు. ప్రజలకు ఇచ్చి న మాటకు కట్టుబడి ఉన్నామని.. హామీలో భాగంగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తున్నామని గుర్తుచేశారు. గత ప్రభుత్వం మాటలకే పరిమితమైందని, తాము మాత్రం చేతల్లో చూపెట్టామన్నా రు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రోడ్లను సంపూర్ణంగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఎంపీ కొండా విశ్వేశ్వరెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, కలెక్టర్ శశాం క, కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, ఏబీసీ చైర్మన్ జైపాల్, నాయకులు జగదీశ్వర్ రెడ్డి, రఘునాథ్ యాదవ్ పాల్గొన్నారు.