బూర్గంపాడు (విజయక్రాంతి): మారుమూల గిరిజన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పిస్తామని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. బుధవారం బూర్గంపాడు మండలం సారపాక గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీరాంపూర్ ఎస్టీ కాలనీకి వెళ్లడానికి నిర్మాణం చేపట్టవలసిన రహదారిని ఫారెస్ట్ అధికారులు, పంచాయతీ అధికారులతో ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శ్రీరాంపూర్ ఎస్టీ కాలనీలో 67 కుటుంబాలు 270 మంది నివసించే గిరిజనులకు రోడ్డు సౌకర్యం లేక వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్నారని నా దృష్టికి వచ్చినందున పరిశీలించడం జరిగిందని, ఆ గ్రామానికి వెళ్లాలంటే తప్పనిసరిగా అడవి ప్రాంతం గుండా వెళ్లవలసి వస్తున్నందున ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి అనుమతి తప్పనిసరి అని, ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ రావడం వలన రోడ్డు నిర్మాణం చేపట్టలేకపోతున్నామని, ఫారెస్ట్ వారి క్లియరెన్స్ కొరకు 2.37 కిలోమీటర్లు రోడ్డు కొరకు ప్రతిపాదనలు పంపించడం జరుగుతుందని అన్నారు.
ప్రస్తుతం ఆ గ్రామంలో సోలార్ విద్యుత్ తో మంచినీటి సరఫరా జరుగుతున్నదని, మంచినీటి సౌకర్యం కొరకు ట్యాంకుల నిర్మాణం జరుగుతున్నందున అవి పూర్తి కాగానే సోలార్ తో కనెక్షన్ ఇప్పించి మంచినీటి సమస్య లేకుండా చూస్తామని అన్నారు. రోడ్డు సౌకర్యం కాగానే తప్పకుండా గ్రామాన్ని సందర్శించి గ్రామంలో ఉన్న సమస్యలన్నీ దశలవారీగా పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఎఫ్డిఓ మసూద్, తహశీల్దార్ ముజాహిద్, ఎంపీఓ సునీల్, ఎఫ్ఆర్ఓ రమేష్, జిపిఈఓ మహేష్, ఫారెస్ట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.