calender_icon.png 7 November, 2024 | 3:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచంతో పోటీ పడేలా హైదరాబాద్ అభివృద్ధి

03-08-2024 05:29:55 AM

  1. నగరంలో అక్రమాల నివారణ కోసమే ‘హైడ్రా’ 
  2. 30 ఎకరాల్లో ఉస్మానియా ఆసుపత్రి నిర్మిస్తాం.. 
  3. కేంద్రం నుంచి నిధుల విడుదల కోసం ప్రయత్నాలు ఆపం..  శాసన సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): ప్రపంచంతో పోటీ పడేలా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీలో శుక్రవారం హైడ్రాపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన ప్రసంగించారు. నగరంలో అక్రమాల నివారణ కోసమే హైడ్రా తెస్తున్నామన్నారు. దీని పరిధి 2 వేల కిలోమీటర్లకు ఉంటుందని స్పష్టం చేశారు. ఎస్వోటీ, గ్రే హౌండ్స్ తరహాలోనే  హైడ్రా పని చేస్తుందని, శాంతి భద్రతల విషయంలో తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. బీఆర్‌ఎస్ నేతలు ప్రవర్తిస్తు న్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. బీఆర్‌ఎస్ హయాంలో దేశంలో ఎక్కడా జరగని విధంగా హత్యలు, అత్యాచారాలు జరిగాయని దుయ్యబట్టారు.

గోషామ హాల్‌లోని పోలీసు క్వార్టర్స్ 30 ఎకరాల స్థలంలో కొత్త ఉస్మానియా ఆసుపత్రిని నిర్మిస్తామరన్నారు. పాత ఉస్మానియా భవనాన్ని హెరిటేజ్ బిల్డిండ్‌గా ఉంచుతామన్నారు. నగరాభివృద్ధికి నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంలు చంద్రబాబు,  వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎంతో కృషి చేశారని కొనియాడారు. మూసీ అభివృద్ధిపై బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. మూసీ ప్రక్షాళనకు  డీపీఆర్ ఉంటుందని, త్వరలోనే మూసీ ప్రక్షాళనకు కన్సల్టెంట్లను నియమిస్తామన్నారు. త్వరలో అంతర్జాతీయ టెండర్లను ఆహ్వానిస్తామన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం సచివాలయం, ప్రగతి భవన్ నిర్మించిందన్నారు. గంటకు 2 సెంటిమీటర్ల వర్షం పడితే హైదరాబాద్ అతలాకుతలమయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. నగరానికి తాగునీరు తీసుకొచ్చిందని కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు.  

హైదరాబాద్‌లో గంజాయి అమ్మే దమ్ముందా..? 

రాత్రి 11 గంటల తర్వాత గతంలో హైదరాబాద్‌లో విచ్చలవిడిగా గంజాయి దొరికేదని, ఇప్పుడు ఇక్కడ గంజాయి అమ్మే దమ్ము ఎవరికీ లేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పబ్బులు, ఫాంహౌస్‌ల్లో డ్రగ్స్ రాకెట్లతో ఎవరికి సంబంధం ఉందో చర్చించే దమ్ముందా..? బీఆర్‌ఎస్ నేతలు సభలో ఉన్నప్పుడు డ్రగ్స్ రాకెట్‌పై చర్చకు సిద్ధమన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కేంద్రాన్ని నిధులు ఇవ్వాలని అడగడం తమ బాధ్యత అన్నారు. కేంద్రం ప్రభుత్వం నిధులు ఇస్తుందా..? ఇవ్వదా..? అనేది కేంద్ర ప్రభుత్వ విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఇదే అంశంపై తాను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి రెండుసార్లు ఫోన్ చేశానని, కానీ ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. నిధుల కోసం కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తో కూడా కలిసి తాను ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించారు.

గాడిద పని గాడిద చేయాలి.. 

‘గాడిద పని గాడిద చేయాలి.. కుక్క పని కుక్క చేయాలి ’ సీఎం రేవంత్‌రెడ్డి అని కేసీఆర్‌ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. తాను 80 వేల పుస్తకాలు చదివానని, అందుకే తనకు అంతా తెలుసనే విధంగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వ్యవహార శైలి ఉంటుందన్నారు. తన  మేధస్సును రంగరించి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించానని కేసీఆర్ గొప్పగా ఫీల్ అవుతారని, కానీ మేడిగడ్డ సంగతి ఏమైందో.. ప్రజలందరూ చూస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ సచ్చిన పాము కింద లెక్క అని.. ఎందుకు ఎలా మళ్లీ చంపడమని తాము ఆలోచిస్తుంటే, బీఆర్‌ఎస్ సభ్యులు మాత్రం రెచ్చిపోతున్నారని దుయ్యబట్టారు.

కొందరు నాలుగు ఇంగ్లిష్ ముక్కలు మాట్లాడి తానే మేధావి ఫీల్ అవుతారని, హైదరాబాద్‌లో ఏ హోటల్‌కు వెళ్లినా వెయిటర్ కూడా ఇంగ్లిష్  మాట్లాడతాడని బీఆర్‌ఎస్ సభ్యుడు కేటీఆర్‌ను ఉద్దేశించి సీఎం వ్యాఖ్యలు చేశారు. 30 ఏళ్లుగా దానం నాగేందర్ ప్రజాసేవలో ఉన్నారని, ఆయన హైదరాబాద్ అభివృద్ధిపై మాట్లాతుంటే.. బీఆర్‌ఎస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేయడమేంటని సీఎం మండిపడ్డారు.