calender_icon.png 5 February, 2025 | 3:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చారిత్రిక పర్యాటక ప్రాంతాల అభివృద్ధి

04-02-2025 10:53:47 PM

జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్...

ఖమ్మం (విజయక్రాంతి): జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను చరిత్ర ప్రతిబింబించేలా  అభివృద్ధి చేయాలని, ఆ దిశగా అధికారులు అవసరమైన చర్యలను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య లతో కలిసి కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో పురావస్తు, పర్యాటక శాఖ అధికారులతో నేలకొండపల్లి బౌద్ధ స్థూపం, పాలేరు లేక్, ఖమ్మం ఖిల్లా పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై సమీక్షించారు. నేలకొండపల్లి బౌద్ధ స్థూపం, పాలేరు పార్క్, ఖమ్మం ఖిల్లా వంటి పలు పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి చేపడుతున్న చర్యల గురించి కలెక్టర్ వివరాలు తెలుసుకుని అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, చారిత్రాత్మక ప్రాంతాల వద్ద సిమెంట్ కట్టడాలను తగ్గించాలని, అక్కడ చేపట్టే ప్రతి అభివృద్ధి పనిలో మన చరిత్ర ప్రతిబింబించేలా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. చారిత్రక ప్రాంతాల సందర్శకులకు మన చరిత్ర తెలిసే విధంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని అన్నారు.

బౌద్ధ స్తూపం వద్ద ఓపెన్ ఎయిర్ మ్యూజియం ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు తయారు చేయాలని, అక్కడ వాకింగ్ పార్క్ ఏరియా అభివృద్ధి చేయాలని కలెక్టర్ సూచించారు. రాతి శిల్పాల ప్రదర్శనకు చర్యలు తీసుకోవాలన్నారు.   జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు అధికంగా పర్యాటకులు వచ్చే విధంగా జాతీయ రహదారులలో, ముఖ్యమైన కూడలీల వద్ద సమాచార బోర్డులు, పర్యాటక ప్రాంతాలకు దారి చూపించే సైనేజ్ బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. మన చరిత్ర తెలిసే విధంగా చారిత్రాత్మక ప్రాంతాల వద్ద బోర్డులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. టాయిలెట్ బ్లాకులు, వసతుల కల్పన చేయాలన్నారు. ప్రపంచంలోని ఎథెన్స్ లోని పార్థినన్, ఈజిప్టు కర్నాక్ టెంపుల్ వద్ద అక్కడి చరిత్ర తెలిసే విధంగా అద్భుతంగా ఏర్పాట్లు చేశారని, అదేవిధంగా మన జిల్లాలోని చారిత్రక ప్రాంతాలలో కూడా ప్రజలకు సులువుగా చరిత్ర అర్థమయ్యే విధంగా ఏర్పాట్లు చేయుటకు ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. పాలేరు లేక్ పార్కు వద్ద ఉన్న పాత నిర్మాణాలకు కావాల్సిన మరమ్మత్తులను వెంటనే పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సందర్శన ప్రాంతాలుగా తీర్చి దిద్ది, చక్కటి ప్రాంతం సందర్శించిన అనుభూతి కలిగే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు.

పాలేరు పార్క్ వద్ద అవసరమైన టాయిలెట్ బ్లాక్, టికెట్ కౌంటర్, ముఖ్యమైన మరమ్మతులు వెంటనే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సందర్శకుల బోటింగ్ కు చర్యలు చేపట్టాలని, కాటేజీ ల నిర్మాణానికి ప్రణాళిక చేయాలని తెలిపారు. ఖమ్మం ఖిల్లా వద్ద సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు కార్యాచరణ తయారు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. పాత్రికేయులు, ఉద్యోగులు, జిల్లాలోని ఇతర ప్రముఖులు పలుమార్లు ఖమ్మం ఖిల్లాను సందర్శించేలా కార్యక్రమాలు రూపొందించాలన్నారు. ఈ సమావేశంలో ఖమ్మం ఆర్డీఓ నరసింహా రావు, ఆర్కిటెక్చర్ వి. సత్య శ్రీనివాస్, సీనియర్ ఇంజనీర్ వెంకటేష్, టూరిజం శాఖ డిఇ లు ఎన్. రామకృష్ణ, ఎం. వి. శ్రీధర్, పురవాస్తు శాఖ ఏడి లు బి. మల్లు నాయక్, ఎన్. నర్సింగ్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.