సదల్ పూర్ జంగి జాతరలో మాజీ మంత్రి రామన్న...
ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ... వారి అభ్యున్నతికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం విశేష కృషి చేసిందని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. బేల మండలంలోని సదల్ పూర్ లో జరుగుతున్న జంగి జాతరలో పార్టీ నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ముందుగా శ్రీ బైరం దేవ్, మహాదేవ్ లకు మాజీమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ... బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ అన్ని దేవాలయాలను అభివృద్ధి చేయడం జరిగిందని అన్నారు. కొమరం భీం స్మారకార్థం జోడె ఘాట్ నుండి మొదలు కొని కేస్లాపూర్ లోని నాగోబా ఆలయం అభివృద్ధి పనులు చేపట్టినట్లు గుర్తు చేశారు. 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీలు గిరిజన సంస్కృతులు, వారి ఆచారాలతో పాటు వారి సంక్షేమంపై ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. సదల్ పూర్ లో 2 కోట్లతో కమ్యూనిటీ హాల్, రోడ్డు, బ్రిడ్జిలను నిర్మించామన్నారు.